చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

పంచమహాభూతాలు అన్నీ ముఖ్యమైనవే అయినా, మనిషి బతికిబట్ట కట్టడానికి, ముఖ్యంగా గాలి కావాలి .. ప్రకృతిలో ఒకానొకప్పుడు స్వఛ్ఛమైన గాలే లబించేది… కాలక్రమేణా, వాతావరణంలో మార్పుల ధర్మమా అని, ఆ గాలికి కూడా రేషనింగ్ మొదలవడంతో , విసిని కర్రలు ఆవిద్భవించాయి. మరీ పురాణకాలంలో ఎలా ఉండేవో తెలియదు కానీ, కొంతకాలానికి , తాటాకు విసినికర్ర, మేదరివాడు అల్లిన విసినికర్ర మాత్రం  రంగంలోకి వచ్చాయి…మొదటిది వేసవికాలంలోనూ, రెండోది ఏ కుంపటిలోనో, పొయ్యిలోనో  మంట రాజేసుకోడానికి ఉపయోగించేవారు…  చైత్రమాసంలో సంవత్సరాది  తరువాత వచ్చే శ్రీరామనవమి రోజున, భక్తులకి పానకం ప్రసాదంతో పాటు  తాటాకు విసినకర్రకూదా బోనస్ గా ఇచ్చేవారు. అప్పటికే ఎండలు  మొదలయి, వాతావరణంలో ఉక్కపోతగా ఉండేది. సాయంకాలాలు ఏ హరికథో, పురాణమో , ఈ విసినకర్ర అటూ ఇటూ ఊపుకుంటూ, హాయిగా ఆ కథేదో వినేవారు… ఆ రెండోది – మేదరివాడు అల్లిన విసినకర్ర అయితే ప్రతీ ఇంట్లోనూ ఉండాల్సిందే.. మరీ వంట గదిలో ఉపయోగించే విసినకర్ర, పెరటిలో, వేణ్ణీళ్ళు కాచుకోడానికి ఉండే పొయ్యిలో మంట రాజేయడానికి ఇచ్చేవారు కాకపోవడంతో, మనవాళ్ళు , ఏ అట్టముక్కతోనో పనికానిచ్చేసేవారు…  నిద్రపట్టకపోతే, ఏ న్యూసుపేపరో సగం మడత పెట్టి విసురుకోవడమే..

కాలక్రమేణా,  Electricity    రావడంతో  , దానితో నడిపే ఫాన్లూ వచ్చేసాయి.. ప్రతీ ఇంట్లోనూ ఓ టేబుల్ ఫానైతే ఉండేదే.. కొద్దిగా ఆర్ధిక పరిస్థితి బావున్నవాళ్ళ ఇంట్లో అయితే, కనీసం హాల్ లో ఓ సీలింగ్ ఫాన్ ఉండేది. ఇంటిపెద్ద గారి గదిలో టేబుల్ ఫానూ, పిల్లలందరూ హాల్లో సీలింగ్ ఫాన్ కిందానూ.. కరెంట్ ఖర్చు ఎక్కువైపోతోందని , ఏ అర్ధరాత్రప్పుడో వచ్చి ఫాన్ ఆర్పేసిన రోజులుకూడా ఉండేవి…
తరవాత్తరవాత రూమ్ముకి ఒకటీ రెండూ సీలింగ్ ఫాన్లూ పెట్టుకోగలిగేవారనుకోండి. ఆఫీసుల్లో పెడస్టల్ (  Pedastal Fan ) ఫాన్లుండెవి.  కర్మాగారాల్లో అయితే అవేవో పెద్ద పెద్ద  Air Circulator  లుండేవి. ఆతావేతా అన్నీ కూడా ఫాన్ల జాతే… కాలక్రమేణా కంప్యూటర్  CPU   దగ్గరనుంచి,  Air Conditioner  దాకా  ప్రతీదాంట్లోనూ ఫాన్లే.  టేబుల్  ఫాన్లొచ్చిన కొత్తలో, ఉషా కంపెనీవీ, రాలీస్ వారివీ, ఓరియంట్ కంపెనీవారివీ  ప్రముఖంగా కనిపించేవి… పాపం వాటికీ కాలదోషం పట్టేసింది.

ఈ సీలింగ్ ఫాన్ల వలన  ఇంట్లో గాలి ఆడ్డంతో పాటు, ఇంకా చాలానే ఉపయోగాలున్నాయి – ఉదాహరణకి, ఏ వర్షా కాలంలోనో ఎండ తక్కువై ఆరేసిన బట్టలు ఎండకపోతే, హాయిగా వాటన్నిటినీ ఏ సీలింగు ఫాన్నో ఫుల్ల్ గా పెట్టేసి, దానికింద పెట్టేస్తే, లక్షణంగా ఆరిపోతాయి… ఈమధ్యన పేపర్లలో చదువుతున్నాము, ఈ ఫాన్లని దుర్వినియోగం కూడా చేసికోవచ్చని—పూర్వపురోజుల్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకోడానికి, బయటెక్కడో ఏ చెట్టుకొమ్మకో ఉరి వేసికునేవారు. ఈ సీలింగ్ ఫాన్లొచ్చిన తరువాత, జనాలూ తెలివిమీరారు.. రూమ్ములో ఉండే సీలింగ్ ఫాన్ కే ఏ చున్నీయో, పొడుగ్గా ఉండే గుడ్డో  వేల్లాడతీయడం, ఏ స్టూలో ఎక్కేసి, ఆ గుడ్డని మెడకి చుట్టుకుని, ఆ స్టూలేదో కాళ్ళతో తన్నేస్తే వాడూ బకెట్ తన్నేస్తున్నాడు.

ఎక్కడ చూసినా ఆవిష్కరించిన ప్రతీ వస్తువుకీ బొమ్మాబొరుసూ ఉంటాయే..  ఏదో గాలి ఆడుతుందని హాస్టల్ రూమ్ముల్లో కూడా ఈ సీలింగ్ ఫాన్లు పెట్టారే కానీ, ఉత్తిపుణ్యాన్న ఉరేసుకోమని కాదుకదా.. ఇలాటివి ఎవరూ ఆపలేరు.. అలాగని ఫాన్లు పెట్టించడం మానుకోలేముగా.. మనుషుల్లోనే మార్పురావాలని ఆశిద్దాం…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు