వారంవారం వారివారి వార ఫలాలు - ఈడూరి

varam varam vari vari phalalu

వారంవారం వారివారి వార ఫలాలు శీర్షికలో ఒకో వారం ఒకో అంశం తీసుకుని సరదా వారఫలాలు అందించే ఈ శీర్షికలో ఈ వారం ఈభూమి మీదే అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతున్న జీవులు అనగా (మీరూహించేసుంటారులెండి) భర్తల వారఫలాలు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రాన్ని కించపరచడం కాకుండా ఆ శాస్త్రాన్ని లేనివాటికి ఆపాదించడం ద్వారా హాస్యం పుట్టించడానికి  మాత్రమే ఈ ప్రక్రియ.

మేషం:
ఈరాశి భర్తలకి ఈ వారం అస్సలు బాగోలేదు (ఏవారం బాగుంది గనక అని నిరుత్సాహ పడకండి). రోజూ చేసే వంటే కదా అని అలసత్వం చూపించి భార్యతో చీవాట్లు తినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప్పు, కారాలు వేసే సమయలో సమ్యమనం పాటిస్తే మంచింది. ప్రతి విషయంలో బకర అవుతున్నాను అని బాధపడకండి, రాశిని బట్టే కదా వాశి వుండేది. మీ రాశి మేషం అయినప్పుడు మీరు బకరా అవడం సహజమే కదా అని గుర్తించండి  

వృషభం:
గుడెద్దు చేలో పడ్డట్టు అన్న సామెతని నిజం చేస్తూ మీరు మీలోకంలో వుంటారు. అందుకే ప్రతిపూటా మీ శ్రీమతి మిమ్మల్ని ఉతికి ఆరేస్తుంటారు. పెళ్ళై ఎన్నేళ్ళైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మీరు వుండటం వల్ల ఆవిడదే పైచేయి అయింది. ఇకనైనా మీరు మారాలనుకుంటే ఈవారం అనుకూలంగా వుంది. మీరు ఎప్పుడూ వెళ్ళే రాముడి గుడికీ ఆంజనేయస్వామి గుడికీ కాకుండా కృష్ణుడి గుడికీ శివుడి గుడికీ వెడుతుంటే పరిస్థితుల్లో మార్పు రావొచ్చు. 

మిధునం:
పొరుగింటి మీనాక్షమ్మని చూడటం మానేసి మీ ఇంటి మహలక్ష్మిని చూడటం మొదలెడితే ఇంటికి, ఒంటికి మంచిది. బుధగ్రహానికి దోషపరిహారం చేయించుకుంటే బుధ్ధి మారే అవకాశాలున్నాయి. నలభై రోజులపాటు పొద్దున్నే రామాలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చెయ్యడం ఈరాశి వారికి అత్యంత శ్రేయోదాయకం. 

కర్కాటకం:
ఈరాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వున్నట్టుండి పనిమనిషి మానెయ్యడం మిమ్మల్ని కలవరపెడుతుంది, ఐతే వెంటనే అంతకన్నా అందమైన కొత్త పనిమనిషి దొరకడంతో ఊపిరి పీల్చుకుంటారు. సమాయానుకూలంగా చెణుకులు విసురుతూ కొత్తవారిని ఆకట్టుకునే గుణం మీకు సత్ఫలితాలనిస్తుంది. నిలువెత్తు కృష్ణ విగ్రహం ఇంట్లో ఈశాన్యం మూల పెట్టండి మరింత మంచి ఫలితాలు కనబడతాయి, ఒకవేళ ఆల్రెడీ మీ ఇంట్లో కృష్ణుడి విగ్రహం వుంటే చేతిలోని మురళి పదక గదివైపు చూపించేలా మారిస్తే మంచి ఫలితముంటుంది. కొన్ని కొత్త స్నేహాలు చేతిచమురు వదిలించే సూచనలున్నాయి

సింహం:
పేరుకి సింహ రాశివారైనా ఈరాశి భర్తలు ఇంట్లో మాత్రం ఎలుకలే. పక్కింటి పిన్ని గార్ని పంచదార అరువు అడగాలన్నా శ్రీమతి పర్మిషన్ కోసం ఎదురు చూసే మీ మనస్తత్వం మహిళలకి బాగా నచ్చుతుంది కానీ ఆఫీసులోనూ పార్కుల్లోనూ మీ గురించి మిగిలిన పురుషులు గొణుక్కోవడం మీకు బాధ కలిగిస్తుంది. మీ కింది వుద్యోగులు ప్రతి విషయానికి మేడం గారికి చెప్పాం సార్ అంటూ మిమ్మల్ని తమ అవసరాలకి వాడేసుకుంటుంటారు. ఎనిమిది మంగళ వారలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించితే కొంత మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయి. మెడలో ఆంజనేయస్వామి లాకెట్ ధరించడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. 

కన్య:
గిన్నెలు తోమడంలో మీరు కనబరిచే ప్రజ్ఞ మీకు ఎందరో మహిళా అభిమానుల్ని సంపాదిస్తుంది. మీరు వీధిలో వెడుతుంటే మీ వీధిలోని మహిళల కళ్ళలో కనబడే వెలుగు మీకు ఒకింత గర్వకారణమౌతుంది. సాటి మహిళలు తనను చూసి ఎంతగా ఈర్ష్య పడుతున్నారో చెబుతుంటే మీ మనసు పరవశమౌతుంది. మొత్తం మీద ఈవారం మీకు చాలా బాగుంటుంది

తుల:
భార్యకీ తల్లికీ మధ్య సయోధ్య కుదర్చాలని మీరు చేసే ప్రయత్నాలు కలిసొచ్చే వారం ఇది. ఏది ఏమైనా పూర్తి ప్రశాంతత కోరుకోవడం ఎండమావి అని మీరు గుర్తించాల్సి వుంటుంది. అడకత్తెరలో పోకచెక్క జీవితం ఎలా నెట్టుకురావాలో సమయానుకూలంగా మీ తండ్రి గారూ, మామ గారూ మీకు నేర్పుతుండటం ఒకింత ఊరటనిస్తుంది. గురుబలమ కోసం సాయిబాబా చరిత్ర నిత్య పారాయణ మంచిది.

వృశ్చికం:
మీ కృషి ఈవారంలో మంచి పేరుని మీకు తెచ్చి పెడుతుంది. ఖాళీ సమయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. సాటి భర్తల్లో మీ పట్ల ఈర్ష్యాసూయలు పెట్రోల్ ధరల్లా మండుతాయి. మీ మామగారిని అడిగి దిష్టి తీయించుకోగలరు.  

ధనుస్సు:
చేసే పనుల్లో ఆసక్తి ప్రదర్శించక ఈవారం ఇబ్బందులని ఎదుర్కోవాల్సివస్తుంది. బట్టలు పూర్తిగా ఆరకుండా దండెం మీంచి తీసెయ్యడం, వాషింగ్ మెషీనులో కంఫర్ట్ బదులుగా కొబ్బరి నూనె వెయ్యడంలాంటి పొరబాట్లు చేసి మీ శ్రీమతి కోపాన్ని చవి చూస్తారు. ఆమెకి కోపం వచ్చినప్పుడు కళ్ళు, పళ్ళు జాగ్రత్తగా కాపాడుకోకపోతే తీవ్ర నష్టాలు సంభవించే ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి. దోష పరిహారార్ధం కొత్తగా పెళ్ళైన 10 మంది మగాళ్ళకి బట్టలు ఉతకడంలో మెళకువలు నేర్పడం మంచిది.

మకరం:
అద్భుతమైన విజయాలు ఈవారం మీ సొంతమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఒక టీవీ ఛానల్ వాళ్ళు తమ వంటల ప్రోగ్రాంకి మిమ్మల్ని ఆహ్వానించడంతో కాలనీ మగాళ్ళందరిలో మీ హోదా ఒక్కసారిగా పెరిగిపోతుంది. మీరు వంట చేస్తున్న విధాన్ని చూసిన యాంకరు పిల్ల మీ మీద మనసు పారేసుకున్న సంగతి మీ శ్రీమతికి చెప్పి పొగిపోదామనుకుంటారు కానీ ఇంటికి రాగానే ఆవిడ మిమ్మల్ని చూసిన చూపుకి భయపడి తీరిక మరెప్పుడైనా చెప్పచ్చులే అని మిమ్మల్ని మీరు సమాధానపరుచుకుంటారు.

కుంభం:
ఒళ్ళు తగ్గాలన్న మీ కోరిక ఈవారం మంచి ఫలితాలనిస్తుంది మీ శ్రీమతి ఊరికెళ్ళిన కారణంగా స్వయంపాకం తప్పదు మీకు, అందువల్ల బరువు భారీగా తగ్గుతారు. ఆనందం తట్టుకోలేక ఈ విషయం మీ భార్యకి చెప్పెయడంతో ఆవిడ తన తిరుగు ప్రయాణం మరొ వారం రోజులు వాయిదా వేసుకుంటుంది. రోజూ వినాయకుడి గుడికి వెళ్ళి దద్దోజనం ప్రసాదం ఆరగిస్తే కొంత మంచి జరుగుతుంది.

మీనం:
అఫీసులో మీరు పొందే గౌరవం, అధికారం ఇంటికి రాగానే మాయమవ్వడం మీకు కొత్త కాకపోయినా ఈవారం మరింత ఆ లోటు మీకు కనబడుతుంది. మీ శ్రీమతి మెప్పు పొందాలని మీరు చేసే ప్రయత్నాలేవీ ఫలితాలనివ్వవు. ఏదేమైనా ఇది ఈవారం వరకే ఎందుకంటే వచ్చే వారం నుండీ మీరూ అలవాటు పడిపోతారు. వీలు చూసుకుని పదహారు ప్యాంటుల వ్రతం చేసుకోగలరు.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు