తెలుగువారు హాస్యప్రియులు అన్నారు! ఈ రోజుల్లో 'హాస్యం' లేని సినిమాలని ఎవరూ చూడటం లేదు కూడా!
బాపు - రమణ ల 'బుడుగు' తెలుగు హాస్య చరిత్రలో చెరిగిపోని అపూర్వ ఖండం అనొచ్చు.
హాస్యం పండించడానికి 'జోక్', 'కార్టూన్', 'సినిమా', కథ, నాటకం ఇలా ఎన్నో అస్త్రాలున్నాయి. కొంతమంది మాటలు వింటేనే హాస్యం పుడుతుంది. నా దృష్టిలో నవ్వించగలగటం ఓ వరం!
హాస్య ప్రధాన సినిమాలు తీయటంలో జంధ్యాల గారు, వంశీ గారు, ఇ.వి.వి. సత్యనారాయణ గారు చాలా గొప్పవారు! ఈ మధ్య వచ్చే చిత్రాల్లో 'శ్రీను వైట్ల' సక్సెసయ్యారు. 'కింగ్', 'దూకుడు' వంటి చిత్రాల కామెడీ మనకి గుర్తొచ్చి చెక్కిలిగింతలు పెడుతున్నాయి.
ఇటీవల 'గోతెలుగు' కంటెంట్ కోసం ప్రముఖ దర్శకులు శ్రీ వంశీ గారిని కలవటానికి వారింటికెళ్ళాను. నేను ఆయన 'ఫేన్'ని! వారి 'లేడీస్ టైలర్' లో ప్రతీ డైలాగూ నాకు కంఠస్తం!! "రండి బన్ను గారు... కాఫీ తీసుకుంటారా?" అనడిగారు.
నేనేదో చెప్పబోయే లోపు ఆయన "ఫ్రీయే లెండి... డబ్బులు పుచ్చుకోం" అన్నారు. పక్కున నవ్వేశాను. 10 సంవత్సరాలనుంచి నాకాయన తెలుసు. మంచి హ్యూమర్ వున్న మనిషి!
తెలుగువాడికి 'ఆవకాయ' అంటే ఏమిటో తెలీక పోవడం ఎంత ఆశ్చర్యమో... 'బాపు కార్టూన్' తెలీక పోవటం కూడా అంత ఆశ్చర్యమే అని నా భావన! తర్వాత మా గురువు గారైన 'జయదేవ్' గారు... వారి కార్టూన్స్ ఆలోచింపజేసి నవ్విస్తాయి!
పరమాన్నంలో తీపి మరీ ఎక్కువైతే మొహం మొత్తినట్టు... 'హాస్యం' మితిమీరితే వెగటుగా వుంటుంది. తెలుగులో మంచి జోక్స్, కార్టూన్స్, హాస్య కథలు, హాస్యరస చిత్రాలు రావాలని కోరుకుందాం! హాయిగా నవ్వుకుందాం!