విహార యాత్రలు (థాయ్ లాండ్ ) - - కర్రా నాగలక్ష్మి

thailand

13 , 14 వ శతాబ్దం లో ఖమేర్ రాజుల పరిపాలనలో ‘ అంగ్కోర్ ‘ రాజధానిగావుండేది . తరువాత లైన్ , యిప్పటి లావోస్ లు కలిసి ‘ అయోథయ ‘ రాజధానిగా చేసుకొని ‘ ఛాప్రయ ‘ నదీ తీరంలో సుఖోతాయి రాజ్యం యేర్పడింద . సుఖోథాయి సమయంలో బౌద్దమతం ప్రాచుర్యంలోకి వచ్చి రాజ్యం బౌద్దరాజ్యంగా గుర్తింపబడింది . 1431 లో సుఖొథాయి రాజులు ఖమేర్ రాజులను ఓడించి వారిని అజ్ఞాతం లోకి పంపేరు . ఆసమయం లోనే ‘ అంగ్కోర్ ‘ శిధిలంగా మారిందని అంటారు . అప్పట్లోనే సియామీస్ పొరుగుదేశాలైన చైనా , యిండియా లతో పాటు పెర్షియ , అరబ్బు దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంచుకొన్నారు. 16 వ శతాబ్దం లో యురోపియన్ వ్యాపారులు దేశంలో ప్రవేశించేరు .

అప్పటి లోనే పశ్చిమ దేశాలైన ఫ్రెంచ్ , డచ్ , బ్రిటన్ వారు వ్యాపారం అనే సాకుతో దేశం లో ప్రవేశించి ఆధిపత్యంకొరకు ప్రయత్నించసాగేరు . ఇక్కడి పాలకులు తెలివిగా బయటి దేశాలవారికి వారిలో వారికి అభిప్రాయభేదాలు కలుగజేసి కొన్నాళ్లు వారి వత్తిడిన తట్టుకొన్నారు . 1765 నుంచి రెండు సంవత్సరాలు జరిగిన బర్మీస్ థాయి యుధ్దంలో బర్మీస్ వారిది పై చెయ్యి కాగా వారు ధాయి రాజధాని అయిన అయోథయ ను కాల్చి రాజులను అడవులలోకి తరిమి కొట్టేరు .1767 లో బర్మీస్ ‘ థోన్ బురి ‘ ని రాజధానిగా చేసుకొని 15 సంవత్సరాలు పరిపాలించేరు . 1782 నుంచి యిప్పటి వరకు వున్న కాలాన్ని ‘ రత్తనకోశిని కాలం( రత్నకోశి ) ‘ గాను , రాజ్యాన్ని రత్నకోశి రాజ్యంగానూ వ్యవహరిస్తారు . 1782 లో రామ-1 నేతృత్వంలో చక్రి వంశాన్ని స్థాపించి బేంకాక్ ని రాజధానిగా చేసుకొని పరిపాలనా బాధ్యతను చేపట్టేడు . యిప్పటికీ చక్రి వంశస్థులే రాజ్యపాలకులుగా వున్నారు . ఇప్పుడు పట్టాభిషిక్తుడైన రాజును రామ-10 గా వ్యవహరిస్తారు .

17 వ శతాబ్దంలో ఫ్రెంచి వారు ‘ ఛొప్రయ ‘ నదీ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు . బ్రిటిష్ వారు దక్షిణ మలయ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు . 1908 లో జరిగిన ఆంగ్లో -సియామీస్ ఒప్పందం ప్రకారం దక్షిణ మలయ ప్రాంతాన్ని బ్రిటష్ వారికి యిచ్చేరు . 1917 లో మొదటి ప్రపంచయుధ్ద సమయంలో బ్రిటిష్ కి మద్దతు ప్రకటించింది సియామి దేశం .

1932 వ సంవత్సరంలో రక్తరహిత ప్రజాస్వామ్యం సాధించిన దినంగా చరిత్రలో నిలచిపోయింది . మిలటరి , ప్రజలు కలిసి మొదటి పార్లమెంట్ యెన్నికలు నిర్వహించి మంత్రులను యెన్నుకున్నారు . రాచరికం సాగుతూన ప్రజాస్వామ్యం వున్నరాజ్యంగా తీర్చదిద్దబడింది . రాజ్యపాలన ప్రజలచే యెన్నుకోబడ్డమంత్రులదైనా రాజ్యాధికారం వంశపారంపర్యంగా వస్తుంది . 1939 లో సియామి రాజ్యాన్ని థాయిలాండ్ గా అధికారికంగా ప్రకటించేరు . 1939. నుంచి 1973 వరకు మిలటరి పాలనలో వుంది థాయిలాండ్ . తరచు కమ్యూనిష్ట్ లకు మిలటరీకి గొడవలు జరుగుతూ వుండేవి ఆ గొడవలు యెంతగా పెరిగాయంటే నగర వీధులలో పౌరుల తలలు విచక్షణా రహితంగా నరికేంత . తమ్మసాట్ యూనివర్సిటీ విద్యార్ధులు , యూనివర్సిటీ ఛాన్సలర్ ‘ సన్య ధర్మశక్తి ‘ నేతృత్వంలో విప్లవం లేవదీసి మిలటరీ పరిపాలనను రద్దుచేసి తిరిగి ప్రజాపాలను నెలకొల్పి కొంతకాలం ప్రధానిగ కూడా కొనసాగేడు . తరవాతి సంవత్సరాలలో చిన్నచిన్న భేదాభిప్రాయాలతో ప్రజాస్వామ్యపరిపాలన కొనసాగింది . రెండవ ప్రపంచ సమయంలో 2 లక్షల ఆసియా పనివారు , 60 వేల మంది యుధ్ద ఖైదీలు కలిసి జపనీస్ వారి ప్రోద్బలంతో నిర్మించిన బర్మీస్ రైల్వే నిర్మాణం చేపట్టి పూర్తిచేసేరు . దీనిని డెత్ రైల్వే అని కూడా అంటారు . ఈ రైల్వేకి సంభందించిన విషయాలు తరువాత సంచికలలో చదువుదాం .

థాయిలాండ్ నదులు , అడవులు , సముద్ర తీరాలు కలిగివున్న దేశం . విదేశీ పర్యాటకుల దృష్టిలో 20వ స్థానం సంపాదించుకుంది . ఎక్కువగా పర్యాటక , వ్యవసాయాల మీద ఆధారపడ్డ దేశం . ఆహారం , ఆటోమొబైల్ , ఎలక్ట్రానిక్ వస్తువులను దిగుమతి చేసుకొనే వారు . కొన్ని విదేశీ కంపెనీలు 1980 ల తరువాత యిక్కడ వేతనాలు కనిష్ట స్థాయిలో వుండడం వలన వారి విభాగాలను యిక్కడ ప్రారంభించేరు . ఆటో మొబయిల్ పార్ట్స్ , మొబయిల్ ఫోనులు తయారీ లు మొదలు పెట్టబడ్డాయి . ఇవి కాక రచ్చాబురి ( రత్నపురి) , బర్మా కి తగిలి వున్న థాయ్ ప్రాంతాలు నవరత్నాల గనులకు ప్రసిధ్ది. ముఖ్యంగ యిక్కడ దొరికే కెంపులు , పుష్యరాగాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది . అలాగే మంచి క్వాలిటి కల్చర్డ్ ముత్యాలు కూడా లభ్యమౌతాయి . థాయిలాండు కాటన్స్ ప్రపంచ వ్యాప్తంగా యెగుమతి అవుతున్నాయి , అలాగే ప్లాస్టిక్ వస్తువుల కూడా . ప్రపంచ వ్యాప్తంగా థాయి వంటలు , మసాలాలు ప్రసిధ్ద పొందేయి . ఈ దేశం లో పులి మెదలైనజంతు చర్మాలు , గోళ్లు అమ్మడం నేరం కాదు . ఒరిజనల్ పులి గోళ్లు పోల్చగలిగే వారు వీటిని కొనుక్కోవచ్చు .

ఇక మనం దేశ రాజధాని అయిన బేంకాక్ గురించి తెలుసుకుందాం .

అయోథయ , థోన బురి లు రాజ్యాలు వున్న సమయంలో బేంకాక్ వాణిజ్యపరం గా గుర్తింపబడ్డ చిన్న గ్రామం . రత్నకోశి యేర్పడి ధాయిలాండ్ రాజధానిగా బేంకాక్ ను గుర్తించన తరువాత రాజభవనిర్మాణం జరిగి నగరంగా రూపుదిద్దుకుంది . 1980 లలో చాలా విదేశీ సంస్థలు తమ రీజనల్ ఆఫీసులను బేంకాక్ కి తరలించడంత తో చాలా త్వరితగతిలో మహానగర రూపాన్ని పొందింది. . మహానగరంగా మారుతున్న కాలంలో బహుళ అంతస్థుల భవనాలు , మహారాజ మార్గాల నిర్మాణం జరిగింది . విదేశీయుల రాకపోకలు యెక్కువవడంతో వాతావరణం కాలుష్యమైందనే వాదనలు మొదలయేయి . ఏది యేమైనా బేకాంక్ నగరం ప్రపంచదేశాలలో గుర్తింపు పొందింది .
అన్ని దేశాలనుంచి బేంకాక్ కి విమాన సౌకర్యాలు వున్నాయి . విమానాశ్రయంలోనే ‘ విదేశీయులకు వీసా ‘ సౌకర్యం వుంది . బేంకాక్ ఎయిర్ పోర్టుని ‘ సువర్ణభూమి ‘ ఎయిర్ పోర్టు అని అంటారు . ఈ దేశంలో మారకంలో వున్న కరెన్సీని ‘ భాట్ ‘ అని అంటారు . ఒక భాట్ విలువ సుమారు 2.7 రూపాయలకు సమానం . విమానాశ్రయంలో కన్నా బయట రూపాయిని మార్చకుంటే యెక్కువ విలువ వుంటుంది . ఎయిర్ పోర్ట్ నుండి నగరం లోకి వెళ్లడానికి మెట్రొరైలు సదుపాయం వుంది .

నగరంలో బహుళ అంతస్థుల భవనాలువున్నా వృక్షాలు యెక్కువగ వుండడం వల్ల మిగతా నగరాలవలె ధూళి దుమ్ము లేకుండ వుంటుంది . ప్రతీ రోజూ యేదో వొక సమయం లో ఓ గంట వానపడడం యిక్కడి మరో విశేషం . అందుకే యిక్కడ రోడ్డుమీద ప్రతీ స్థంబానికీ ఆర్కిడ్ లను పెంచడం కనిపిస్తుంది . అలాగే జనరద్దీ బాగా వున్న మార్కెట్ ల దగ్గర ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ కి వెళ్లేటప్పుడు రోడ్లపైన పందిర్లు వేసి వుండడం ఆ పందిర్లకి ఫల సంపెంగలు పూస్తూ సువాసనలు వెదజల్లుతూ వుండడం ఆనందాన్ని కలుగచేసింద . నడిచే వారు సేదతీరేందుకు పందిళ్లకింద బెంచీలను అమర్చేరు .

బేంకాక్ లో చూడవలసిన ప్రదేశాలలో రాజభవనం ముఖ్యమైనది . అదికాక షాపింగ్ సెంటర్లు , నైట్ లైఫ్ , గోల్డెన్ బుద్ద , ఎమరాల్డ్ బుద్ద , ఫ్లోటింగ్ మార్కెట్ ముఖ్యమైనవి . ఇండియన్ మార్కెట్ లో వున్న ‘ మారియమ్మకోవెల ‘ కూడా చూడదగ్గదే .

మనం ముందుగా రాజభవనం చూద్దాం . రాజభవనం లోకి ప్రవేశానికి నిర్ధేశించిన పైకం చెల్లించేక మన వస్త్రధారణను పరిశీలిస్తారు . ముణుకులు కనిపిస్తూ వున్న డ్రెస్సులను అనుమతించరు . వారి వద్ద నున్న పొడుగు బట్టలనుఅద్దెకు తీసుకొని మన డ్రస్సు పైన కట్టుకోవాలి .

గేటు దగ్గర రాజపరివారం చేసిన చేతిపనుల వస్తువుల అమ్మకానకి వుంటాయి .

ముందుగా యీ రాజభవనం గురించి కొంత చరిత్ర చెప్పుకుందాం .

చక్రి వంశ స్థాపకుడు , రత్నకోశి సామ్రాజ్య స్థాపకుడుఅయిన రామ-1 వ రాజు 1782 లో బేంకాక్ లో భవన నిర్మాణం చేపట్టాడు . ఛో ప్రయ నదీ తీరాన 2 లక్షల 18 వేల 4వందల చదరపు మీటర్ల స్థలం యీ భవనానికి గానుయెంచుకున్నారు . ముందుగా రాజ నివాసం కొరకు మాత్రమే కట్టినా తరువాత కచేరి హాలు , న్యాయస్థానం , మంత్రుల కచేరీలు అలా ఒకటి తరువాత ఒకటిగా భవంతుల నిర్మాణం గావించేరు . 1782 నుంచి 1925 అంటే రామ-9 పరిపాలన లోకి వచ్చినంతవరకు అన్ని పరిపాలనావిధులు యిక్కడ నుండి జరిగేవి . 1925 నుంచి పరిపాలనా యంత్రాంగం వేరే ప్రదేశాలకు మార్చబడింది . అలాగే రాజ పరివార నివాసం వెనుకవైపుకి మార్చబడింది . ముందున వున్న భవనం పర్యాటకుల సందర్శనానికి వీలుగా వుంచేరు .

ఈ భవనం ముఖ్య పర్యాటక స్థలం కావడం మూలానా దీని సంరక్షణా భారం మొదటి బాధ్యతగా ప్రభుత్వం స్వీకరించింది . చాలా నీటుగ వుంటుంది .

1932 లో రాచరికం పోయి ప్రజాస్వామ్యం రాగానే అన్ని కార్యాలయాలూ యిక్కడనుండి తరలింప బడ్డాయి .

ఈ భవనం నాలుగు గోడల మధ్యన చతురస్రాకారం లో నిర్మితమైన భవనం .

ఈ భవంతి గురించి మరిన్ని విశేషాలు పై వారం చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి