ప్రతాప భావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapa bhavalu

"రైల్లూ..సిగ్నల్లూ"-

అన్ని ఉద్యోగాల సంగతి నాకు తెలియదు కాని టెక్నికల్ వి మాత్రం కష్టమే! టెక్నిక్ అంటే సాంకేతికత, మనకు అర్థమయ్యేభాషలో మెళకువ! ఏదైనా పనిచేసేప్పుడు టెక్నిక్ తో చేయమనడం వినే ఉంటారు. ఏ పని చేసినా తక్కువ సమయంలో, తక్కువ కర్చులో చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. అంచేత బయట జరుగుతున్న అభివృద్ధిని ఒక కంట కాదు కాదు వేయి కళ్లతో గమనిస్తుండాలి. అదే మన నైపుణ్యానికి కొలమానం. నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరును కాబట్టీ, నా ఫీల్డ్ లో మిమ్మల్ని కాసేపు విహంగ వీక్షణం చేయిస్తాను.

రోడ్డుమీద వెళ్లే వాహనాలకు, పట్టాల మీద వెళ్ళే రైళ్లకూ తేడా ఏమిటో తెలుశా? రోడ్డు మీద వాహనం నడిపే వ్యక్తి తనకెలా తోచితే వాహనాన్ని అలా నడపొచ్చు, కానీ రైలు అలా కాదు దాని నిర్దేశిత కక్ష్య (ట్రాక్)ను స్టేషన్ మాష్టర్ నిర్ణయిస్తాడు. మరి రైలు డ్రైవర్ చేసే పనేంటో తెలుశా? సిగ్నల్ లను గమనిస్తూ రైలు వేగాన్ని నియంత్రించుకోడం, ఆపడం. అంతే! రెడ్ యాస్పెక్ట్ (లైటు) అంటే రైలు కచ్చితంగా ఆగిపోవాలి. ఆరెంజ్ లేదా యాంబర్ యాస్పెక్ట్ (లైటు) అంటే రైలు నిదానంగా వెళ్లాలి, అంటే అవసరం అయితే ఆగేట్టుగా వెళ్లాలి. అదే గ్రీన్ యాస్పెక్ట్ (లైటు) అయితే రైలు తన నియమిత వేగంతో వెళ్లిపోవచ్చు. ఇదంతా రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ అంతర్భాగం.

మనం రైల్లో వెళుతూ స్టేషన్ కూతవేటు దూరంలో ఉండగా సిగ్నల్ పడలేదని రైలును గంటల కొద్దీ ఆపడం మనందరికీ అనుభవమే! ఆ సమయంలో మనందరం తెగ తిట్టుకుంటాం కూడా, కదూ. ఇక్కడ మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేమిటంటే రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను సేఫ్టీ క్రిటికల్ సిస్టం అంటారు. అంటే రైలుకు ఏదన్నా ప్రమాదం సంభవిస్తే జన, ఆస్తి నష్టం అధికంగా వాటిల్లుతుంది. అందుచేత సిగ్నలింగ్ వ్యవస్థను పకడ్బందీగా రూపకల్పన చేసి కూలంకషంగా అనేక పరీక్షలు జరిపి ఏర్పాటు చేస్తారు. రైలు పట్టాలపై ఏదన్నా రైలు ఆగిపోయి ఉందా? లేక రైలు పట్టాలు విరిగిపోయాయా? వంటి అనేక విషయాలు సిగ్నలింగ్ వ్యవస్థ లోని పరికరాలు అనుక్షణం పర్యవేక్షిస్తుంటాయని మీకు తెలుసా? రైల్వే స్టేషన్ లో రైల్లు ఆగే స్థలాన్ని బెర్తింగ్ ట్రాక్ అంటారు. అంటే ఒక రైలు స్టేషన్ లోకి రావాలంటే ఏ బెర్తింగ్ ట్రాక్ ఖాలీగా ఉందో, దాని మీదకే స్టేషన్ మాస్టర్ రైలును రప్పిస్తాడు. ఒక వేళ బెర్తింగ్ ట్రాక్స్ ఖాలీగా లేకపోతే రైలును అవుటర్ లో రెడ్ సిగ్నల్తో నిలిపేస్తాడు. అప్పుడే మనం విసుక్కుంటాం.  దేశ వ్యాప్తంగా ఇన్నన్ని రైళ్లు క్షేమంగా నిర్దేశిత పట్టాలపై తిరుగుతూ మనుషులను, సరకును క్షేమంగా గమ్యాలకు చేరుస్తున్నాయంటే, ఆ వ్యవస్థను ఎంత చక్కగా రూపొందించారో ఊహించుకోండి. దాన్ని ఇంగ్లీషులో ఫూల్ ప్రూఫ్ వ్యవస్థ అంటారు. అంటే లోపరహితమైనదని అర్థం. ఎక్కడో మానవ తప్పిదంతోనో, ప్రకృతి కన్నెర్ర చేయడంవల్లనో ఒకట్రెండు ప్రమాదాలు జరుగుతాయేమోగాని చాలావరకు సురక్షితమైన వ్యవస్థ అది.

రైల్వేలో ఏదన్నాభద్రతావ్యవస్థకు సంబంధించిన ఒక పరికరాన్ని (ఎక్యూప్మెంట్) నెలకొల్పాలంటే అంత సులభం కాదు. ప్రాథమిక స్థాయి నుంచి ఎంతోమంది మేదోమథనం చేస్తారు. డిజైన్లను సాంకేతిక అనుభవ నిపుణులు ప్రతి ఒక్క కోణం నుంచి క్షుణ్నంగా పరిశీలిస్తారు. అన్ని డిజైన్లు సంతృప్తికరంగా ఉంటే, అప్పుడు నమూనా (ప్రోటోటైప్) నిర్మాణానికి అనుమతిస్తారు. ఆ ప్రోటోటైప్ ను ల్యాబ్ లో రకరకాల పరీక్షలకు గురిచేస్తారు. ఇవి కాకుండా దానిపై ఎన్విరాన్మెంట్ టెస్ట్ లు చేయిస్తారు. అంటే, బాగా వేడిలో, అతి చల్లదనంలో, దుమ్ము, ధూళి వాతావరణంలో, వర్ష వాతావరణంలో, ప్రకంపనల్లో ఇలా ఎన్విరాన్మెంట్ ల్యాబ్ లలో ఉన్న ఛాంబర్ (గదులు)లలో అన్ని రకాల వాతావరణ పరీక్షలు నిర్వహిస్తారు. ఇలాంటి సదుపాయాలు కొన్ని చోట్లే లభ్యమవుతాయి. ఈ పరీక్షలు చాలా క్లిష్టమైనవి. ఇన్ని పరీక్షలకూ తట్టుకుని నిలబడితే, అప్పుడు ఏదైనా రైళ్లు తక్కువగా నడిచే స్టేషన్లో ఆ పరికరాన్ని నిలబెడతారు(ఇన్ స్టాల్). అక్కడ కొన్నాళ్లపాటూ సంపూర్ణంగా, సంతృప్తికరంగా, ఫెయిల్ అవకుండా పనిచేస్తే అప్పుడు ఆ పరికరాన్ని ఉపయోగించడానికి అనుమతి (అప్రూవల్) ఇస్తారు. ఇంత తతంగం ఉంటుంది, రైల్వే భద్రతావ్యవస్థలో ఒక పరికరాన్ని విజయవంతంగా చేర్చాలంటే! అమర్చాలంటే!

 

కొసమెరుపు: నాతో పాటు పనిచేసే ఒక పెద్దాయన ఒకసారి నాతో ఒక మాట అన్నాడు " నేచర్ ఈజ్ అగైనిస్ట్ టు ఫెయిల్ సేఫ్టీ" అని. అంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత శ్రద్ధగా ఉన్నా ఒకోసారి ప్రకృతి ముందు దిగదుడుపే అని.

*****

 

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి