వారంవారం వారివారి వార ఫలాలు - ఈడూరి

varam varam vari vari phalalu

వారంవారం వారివారి వార ఫలాలు శీర్షికలో ఒకో వారం ఒకో అంశం తీసుకుని సరదా వారఫలాలు అందించే ఈ శీర్షికలో ఈ వారం ఎవరిని చూస్తే ప్రజలు భయపపడతారో ఎవరి పేరు చెబితే ముందూ వెనుకా చూడకుండా పిల్లలూ పెద్దలూ పరుగులు పెడతారో ఆ  కవుల/కవయిత్రుల వారఫలాలు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రాన్ని కించపరచడం కాకుండా ఆ శాస్త్రాన్ని లేనివాటికి ఆపాదించడం ద్వారా హాస్యం పుట్టించడానికి  మాత్రమే ఈ ప్రక్రియ.  

మేషం:
మీ ఉగాది కవితలు ఉగాది పచ్చడి కన్నా ఘోరంగా వున్నాయంటూ విన్న ప్రతివారూ చీత్కరించుకోవడంతో చేసేదేమి లేక మీరు మరిన్ని కవితలు రాయడంలో నిమగ్నమైపోతారు. మీలోని ఈ గొప్ప గుణమే ఇన్నాళ్ళుగా మిమ్మల్ని కవి/కవయిత్రి గా ఎదురులేకుండా చేసింది (ఎవరూ మీకెదురు రారనుకోండి, అది వేరే సంగతి). మీ కవితలు బాగా పేరుపొందాలంటే పదహారు కవితల నోము చేసుకోవడం మంచిది.

వృషభం:
మీ కవితలన్నీ కాల్చేసి ఆ బూడిదని ఉగాది పచ్చడిలో కలిపేసి అందరికీ పెట్టడం ద్వారా మీ కవితలు "మింగుడు పడట్లేదు" అన్నవాళ్ళకి జవాబు చెప్పాలనుకున్న మీ ఆశయం సత్ఫలితాలనిస్తుంది (ఎటొచ్చీ అది తిన్న విమర్శకులకే డెత్ ఫలితాలనిస్తుంది అనుకోండి). మాంఛి ఆవుపేడ పిడకలను పొడి చేసి ఆ పొడిని చిక్కని ఆవుపాలతో రంగరించి పదకొండు రోజులు సేవించినట్టైతే మీ బుర్ర పదునెక్కి మంచి కవితలు రాయగలరని శాస్త్రం కోడై తన గోడు చెప్పుకుంటోంది గనుక ప్రయత్నించగలరు.  

మిధునం:
దంపతులిద్దరూ కవిత్చం రాస్తారు గనుక మీ ఇంట్లో క్విడ్ ప్రోకో పధ్ధతి అమలులో వుంటుంది. దీనినే మరింత విస్తరించి మరికొంతమంది దంపత కవులని మీ ఇంటికే పిలిచి దంపత్కవితల తాంబూలాలిచ్చుకోడం ద్వారా మిమ్మల్ని ఉగాది కవిసమ్మేళనానికి ఎవరూ పిలవలేదని బాధపడక్కరలేకుండా మీరే ఒక ఉగాది కవిసమ్మేళనం ఏర్పాటు చేసినవారవుతారు. ఈ ఉగాది మీకు అన్నివిధాలా భవ్యం.    

కర్కాటకం:
రాక రాక మీ కవిత పత్రికలో వచ్చిందన్న ఆనందంలో మీరు పార్టీ యిస్తానన్నా పార్టీలో కూడా మీరు మరికొన్ని కవితలు చదువుతారేమో అన్న భయంతో పార్టీకి చాలా తక్కువమంది హాజరవడం మిమ్మల్ని బాధపెడుతుంది. ఈ దోషం పోవాలంటే మీరు 108 సీడీల వ్రతం చెయ్యాల్సిందే. మీ కవితలలో పదకొండు కవితలని మీరే స్వయంగా చదివి వాటిని సీడీలలో రికార్డు చేసి ఆ సీడీలని వుచితంగా 108 మందికి అందించడం ద్వారా మీకు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సీడీలతో పాటుగా జెండూ బాం సీసాలు కూడా ఇస్తే మరింత మంచి జరగవచ్చు కాబట్టి సూచించడమైనది.     

సింహం:
మీరు భయపెట్టి మరీ కవితలు వినిపిస్తారని మీ కాలనీ మొత్తం తెలిసిపోయి మీ ఇంటిముందు నుండి ఎవరూ నడవని పరిస్థితి ఏర్పడుతుంది. మీ ఇంటి పైవాటాలోకి అద్దెకి కూడా ఎవరూ దిగరు. విసిగిపోయిన మీ శ్రీమతి కవితలు కావాలో నాతో విడాకులు కావాలో తేల్చుకోండి అనగానే మంచి అవకాశం మించిన దొరకదు అని మీరు విడాకులే కోరుకోవడంతో మొదట సంతోషం కలిగినా మీకున్న ఒక్కగానొక్క శ్రోత కూడా చెయ్యిజారిపోయిన విషయం గ్రహిస్తారు.  

కన్య:
మంచి కవితలు రాయాలన్న మీ కోరిక కోరికగానే మిగిలిపోవడం మీకు ఎంతగానో అసంతృప్తిని మిగులుస్తుంది. విశ్వంలోని మంచినంతా నింపి మీరు రాస్తున్న కవితలు ప్రజలకి ఎందుకు అర్ధం కావట్లేదో మీకు అర్ధం కాదు. శుక్రుడు మూన్ మీదికి హనీమూన్ వెళ్ళిన కారణంగా మీకు మరికొన్ని సంవత్సరాలు ఈ కష్టాలు తప్పవు. ఆ తరువాత మీరూ ఆ కష్టాలకి అలవాటుపడిపోతారు. ప్రత్యేకించి పరిహారాలు లేవు కానీ అమావాశ్య నాడు చీకట్లో నల్ల బట్టలు ధరించి గట్టిగా మీ కవితలు చదవడం వల్ల కొంత మేరకు మంచి జరగవచ్చు .

తుల:
మీ కవితలు విని ప్రజలు బాగా చైతన్యవంతులవ్వాలనీ, వుద్యమ స్ఫూర్తితో రగిలిపోవాలనీ మీరు కనే కల నిజమయ్యే రోజు దగ్గరలోనేవుంది ఐతే అది మీకు సపోర్టుగానా వ్యతిరేకంగానా అనే విషయం ఇప్పుడే చెప్పడం కష్టం, అందుకు గ్రహాల కూర్పు అనుకూలంగా లేదు.  అంతవరకూ మీ దారిన మీరు విప్లవ కవితలు రాస్తూ వుండటం మంచిది.
 
వృశ్చికం:
ఏనాటికైనా సన్మానం చేయించుకోవాలనే మీ కోరిక ఈవారం తీరే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కానీ అందుకు మీరు పెట్టే ఖర్చు మాత్రమే మీ తలకి మించిన భారంగా మారి మిమ్మల్ని అప్పుల పాల్జేస్తుంది. సన్మానాల జోలికి పోవద్దు అలాంటి ఆశలు పెట్టుకోకండీ అని మీ చెవిలో పుట్టిల్లు కట్టుకుని మరీ చెప్పిన మీ శ్రీమతి ఇప్పుడు మీకు ఐశ్వర్యా రాయ్ అంత అందంగా కనబడుతుంది. ఏది ఏమైనా విపరీతమైన ధన నష్టం ఈ రాశివారికి తప్పదు.


ధనుస్సు:
అబ్బాయికి కట్నం తీసుకోకుండా పెళ్ళి చేస్తే...వచ్చే కోడలు మీ మాటే వింటుంది అన్న ఆశతో మీరు వేసిన బాణం బూమర్యాంగ్ అయి మీమీదికే వస్తుంది. కొత్త కోడలు కూడా కవయిత్రి కావడం మిమ్మల్ని కలవరపెడుతుంది. మీ కవితల కంటే అధ్వాన్నమైన కవితల్ని చదివే/వినే భాగ్యం ఈవారం మీకు కలుగుతుంది. కారుణ్య మరణాలకి సుప్రీం కోర్ట్ అనుమతి లభించిందన్న వార్త మీకు కొంత ఊరట కలిగిస్తుంది   

మకరం:
ఫేసుబుక్కు మొదలైన మాధ్యమాల ద్వారా కవిత్వ గ్రూపుల్ని నిర్వహించడంలో మీది అందె వేసిన చేయి. అడపాదడపా కవిత్వ సంకలనాలను విడుదల చేస్తూ అందరినుండీ డబ్బులు వసూలు చేసి మీరు మంచి పేరు, ధనం సంపాదిస్తారు. మీ వ్యాపార సూత్రం ఇట్టే కనిపెట్టిన మరికొంతమంది వర్ధమాన కవులు దినదిన ప్రవర్ధమానమౌతారు. మొత్తం మీద ఈవారం మీకు ధనలాభం. కొత్త కవులకి అవార్డులిప్పించే పనిలో మీ చాకచక్యం పెద్దల దాకా చేరుతుంది

కుంభం:
బ్రహ్మచారులకే ఇల్లు అద్దెకివ్వడం ద్వారా వారిని మచ్చిక చేసుకుని మీ కవితలు వినిపించొచ్చు అనుకున్న మీ ఆశ నెరవేరుతుంది. కానీ వారు మీ వలలో పడటం కాదు మీరే వారి వలలో పడ్డారన్న విషయం ఈవారం మీరు గ్రహిస్తారు. ఏ నెలా సరిగా అద్దె కట్టరు, మీరు కవిత అన్నప్పుడల్లా వారు మందు అంటారు. మందు పోసినంతసేపూ మీ కవితలకి వహ్వా వహ్వా అనడమే తప్ప నిజంగా వింటున్నారా అన్న మీ అనుమానం సరైనదే. వారు మిమ్మల్ని ఫుల్లుగా వాడేసుకుంటున్నారు. వచ్చే అమావాశ్య తరువాత మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి, మీరు మంచి శ్రోతల్ని పొందుతారు.  

మీనం:

ఈ రాశి వారు ఒక సరికొత్త విషయాన్ని తెలుసుకుంటారు తద్వారా వారి జీవితంలో ఒక పెనుమార్పు చోటుచేసుకుంటుంది. ఆ మార్పు మంచికే దారి తీస్తుంది. ఈ కవితలు, కధలు తమవల్ల కాదన్న గొప్ప విషయాన్ని వీరు గ్రహిస్తారు. సిధ్ధి వినాయకుడి గుడిలో బుధ్ధిగా అష్టోత్తరం చేయించి ఇక ఈరోజు నుండీ కవితల జోలికి వెళ్ళను, ఎవరినీ ఇబ్బంది పెట్టను అని నిర్ణయించుకుంటారు. ఈ మార్పు మీకు సమాజంలో గొప్ప గుర్తింపుని తీసుకొస్తుంది. 

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి