ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఇకపై 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. చదువు, చదువు, రివిజన్, రివిజన్ అంటూ పిల్లలపై ఇటు స్కూలు యాజమాన్యం, అటు తల్లితండ్రులు తీవ్రమైన ఒత్తిడి కల్గించారు. అయితే ఇక ఆ ఒత్తిడికి స్వస్థి చెప్పంది. 10వ తరగతి విద్యార్ధుల్ని మినహాయిస్తే, మిగిలిన తరగతుల పిల్లలకు పరీక్షలు దాదాపు అయిపోయినట్లే. అందుకే వారి మెదడుకు కాస్త విశ్రాంతి కలిగించే దిశగా తల్లితండ్రులు ఆలోచనలు చేయండి. అంతేకానీ, రిజల్ట్ విషయంలో వారిని ఏమాత్రం ప్రలోభపెట్టకండి. ఎగ్జామ్స్ రాయించడం వరకే మీ బాధ్యత. ఇక రిజల్ట్ ఎలా ఉండబోతోందనే విషయంపై మాత్రం ఎలాంటి ఒత్తిడిని పిల్లలకు కలిగించొద్దు.
రిజల్ట్ ఎలా వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడగలిగే ఆత్మస్థైరాన్ని మాత్రం మీ పిల్లల్లో నింపే ప్రయత్నం చెయ్యండి తప్ప, పలానా పిల్లాడు ఎగ్జామ్స్ చాలా బాగా రాశాడు. వాడికి 80 శాతం మార్కులు, పలానా పక్కింటి కుర్రోడికి 90 శాతం మార్కులు వస్తాయి. మరి నీ సంగతేంటనే ప్రశ్నలతో మీ మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. ఆ పోలికను తేలికగా తీసుకునే మనస్తత్వం అందరి పిల్లల్లోనూ ఉండదు. కొందరు సున్నితమైన మనస్తత్వం ఉన్న పిల్లలు ఉంటారు. వారు ఆ పోలిక తట్టుకోలేరు. తద్వారా ఆ తరుణంలో విచక్షణ కోల్పోయి, విపరీత ధోరణికి పాల్పడే అవకాశాలున్నాయి. ఆ రకమైన కారణాలే విద్యార్ధుల మనసును చలింపచేసి, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. దయచేసి తల్లితండ్రులు ఈ రకమైన వింత ధోరణిని పక్కన పెట్టి, తమ పిల్లల మనసు తెలుసుకొని ప్రవర్తిస్తే బావుంటుంది.
ఇకపోతే 10వ తరగతి పరీక్షలు అయ్యాక ఇంటర్మీడియట్ చదువుల కోసం పలువురు దళారీ విద్యా సంస్థలు తల్లితండ్రులను ప్రలోభపెట్టి, మా కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామంటూ మెరిట్ స్టూడెంట్స్ తల్లితండ్రులను ఆశ్రయిస్తూ ఉంటారు. అలాంటి వారి విషయంలో తల్లితండ్రులు కాస్త అప్రమత్తత వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. నేటి పోటీ ప్రపంచంలో ర్యాంకులు, మార్కులే కొలమానంగా మారాయి. దాంతో విద్యార్ధులు తమ తల్లితండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను తీర్చగలమో లేదోననే తపనతో అంతర్లీనంగా మదనపడుతున్నారు. ఆ మేధోమదనమే ఒక్కోసారి వారిని విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. తద్వారా అలాంటి విద్యార్ధులు చాలా ఈజీగా ఆత్మహత్యలే శరణ్యమనుకుని తమ నిండు జీవితాన్ని బలి చేసుకుంటూ, తల్లితండ్రులకు తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు. ఈ విపరీత ధోరణి మారాలంటే ముందుగా తల్లితండ్రుల ఆలోచనల్లోనే మార్పు రావాలి. అవసరమైతే రుద్ది రుద్ది ర్యాంకుల కోసం ప్రాకులాడే విద్యాసంస్థలపై మూకుమ్మడి దాడికి పాల్పడాలి, తప్ప లేలేత మనుసు పిల్లల్ని క్షోభపెట్టడం సబబు కాదు. మార్కులు రాకపోతే, మరెన్నో రంగాలు నీకోసం చేయి చాచి నిలుచున్నాయి, ఆ రంగంలో వారికి ఏది ఆశక్తి ఉందో అటు వైపు వారిని ప్రోత్సహించాలి.
చదువు, మార్కులే జీవితం కాదు, జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే అనే ఆలోచనను వారిలో కలిగించాలి. ప్రపంచం చాలా విశాలమైనది. ఏ రంగం వైపు మనసు ఆకర్షిస్తే, ఆ రంగం వైపు తమ పిల్లల్ని ప్రోత్సహించే బాధ్యత తల్లితండ్రులదే. ఎవరేమైనా అనుకోనీ, ఏదేమైనా కానీ, నా వెంట నాకు ధైర్యంగా ఎప్పటికీ నా కుటుంబం తోడుంటుంది. దానితో నేనేదైనా సాధించగలను అనే నమ్మకాన్ని, ధైర్యాన్ని ప్రతీ విద్యార్థికీ కల్గించాల్సిన పూర్తి బాధ్యత తల్లితండ్రులదే.