ప్రతాప భావాలు: - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

"మూర్తీ-ఏ వర్క్ హాలిక్"

పదిహేనేళ్ల క్రితం నేను టెక్నికల్ టీమ్ లీడర్ గా అయిదు మంది గల టీం ను లీడ్ చేస్తున్నప్పుడు మా దగ్గర నలుగురు కాంట్రాక్ట్ లేబర్ వచ్చి వైరింగ్, మెకానికల్ వర్క్స్ చేసేవారు. అందులో మూర్తి అనే అతను నన్ను ఆకర్షించాడు. కారణం, వర్క్ హాలిక్ లని వినడమే తప్ప చూసింది లేదు. మూర్తి వర్క్ హాలిక్. నాతో సహా మేమందరం ఆఫీసులో ఎనిమిది గంటలు, లేదా ముఖ్యమైన పని ఉంటే ఇంకో రెండు మూడు గంటలు ఎక్స్ ట్రా అవర్స్  ఉండి వెళ్లిపోయేవాళ్లం. కాని మూర్తి మేమెళ్లిపోయిం తర్వాత కూడా నాకు ఫోన్ చేసి పని పూర్తయిందని చెప్పేవాడు. పని పట్ల అతని నిబద్ధత, అంకితభావం నన్ను విస్మయ పరిచేది. ఒకసారి అతన్ని లంచ్ టైం లో పిలిచి ’కాంట్రక్టరు ఎంతిస్తా’రని అడిగాను. దానికతను-కాంట్రాక్టరు రోజుకు రూ.75/- చొప్పున కట్టి ఇస్తున్నాడని, కాని సంతకం మాత్రం రూ.150/- ఇస్తున్నట్టుగా పెట్టించుకుంటున్నారని వాపోయాడు.

నాకు జాలేసింది. పాపం ఉదయం నుంచి రాత్రి దాకా నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తాడు. అతనికెలాగైనా న్యాయం చేయాలని ’మూర్తీ, నీకు నేనేదైనా చేస్తాను’ అన్నాను జాలిగా. అది మొదలు నేనంటే అభిమానం చూపించేవాడు. నేను చెబితే ఎంతటి పనైనా అవలీలగా చేసేసేవాడు. హార్డ్ వేర్ డిజైన్స్, సాఫ్ట్ వేర్ కోడ్ చెక్ సమ్ అతని నోట్లో ఉండేది. అతనికి ఎలాగైనా మూడేళ్ల కాంట్రాక్ట్ ఇప్పించి కంపెనీ నార్మ్స్ లోకి తీసుకురావాలని నేను మా డిపార్ట్ మెంట్ హెడ్ తో మాట్లాడాను. ఆయన ‘అది కుదరదంటే, కుదరదు. ఎందుకంటే అతను కాంట్రాక్టరు మనిషి, కాంట్రాక్టరుతో మనకు అభిప్రాయబేధాలు వస్తాయి’ అన్నాడు. ’సార్! నేను కాంట్రాక్టరుతో మాట్లాడతాను. మీరు మన సంస్థ నుంచి ఏం ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యాలో, చెయ్యండి ప్లీజ్, అతను మన కంపెనీకి గొప్ప హ్యూమన్ అస్సెట్ అవుతాడు’ అన్నాను ప్రాధేయపూర్వకంగా. ఆయనేమనుకున్నాడో ’సరే, చూస్తాను. మీరు అతన్ని కన్సిడర్ చేయమని మేనేజ్ మెంట్ ను రిక్వెస్ట్ చేస్తూ, నన్ను ఒక లెటర్ రాసిమ్మ’ని..వెంటనే బట్ నో గ్యారంటీ’ అన్నాడు సాలోచనగా!.

‘ఒ కె సార్!’ అన్నాను. ఒక డిసర్వ్ డ్ కేండీడేట్ కు న్యాయం చేస్తున్నానని నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. వాళ్ల కాంట్రాక్టర్ రెడ్డిని పిలిచి మూర్తి విషయం మాట్లాడాను. అతను ‘ససెమిరా’ అన్నాడు. కారణం, మూర్తి లాంటి వాళ్లవల్లే కాంట్రాక్టర్స్ కి మంచి పేరొస్తుంది. అలాంటి వాళ్లని ఎవరైనా వదులుకుంటారా?. నేను అతనితో ‘మానవతాదృక్పథంతో ఆలోచించమని, నువ్వు చేసే ఈ మంచి నీకు భవిష్యత్తులో కచ్చితంగా ఉపకారం చేస్తుందని’ ఎన్నోవిధాల నచ్చచెప్పిన మీదట, అతనికి నేనంటే కూడా అభిమానం ఉండడంతో చివరాఖరికి ఒప్పుకున్నాడు. నేను మూర్తికి వర్క్ లో గల ఎంథూసియాస్మ్, ఇంట్రస్ట్, నాలెడ్జి, డెడికేషన్, డిసిప్లిన్ ఇత్యాదివన్నింటినీ క్రోడీకరీస్తూ, కాంట్రాక్టర్ ను కూడా కలిసి ఒప్పించానని, మూర్తి సంస్థకి విలువైన ఉద్యోగి అవుతాడని, మేనేజ్ మెంట్ కు చక్కగా వివరణాత్మకంగా నాలుగు పేజీల ఉత్తరం రాశాను. దాన్ని మా డిపార్ట్మెంట్ హెడ్ అప్రూవ్ చేశారు.

వారం తర్వాత పి అండ్ ఏ నుంచి మూర్తి కి 3 ఏళ్ల కాంట్రాక్ట్ ఇస్తూ లెటర్ వచ్చింది. మూర్తి ఎంత ఆనంద పడ్డాడో చెప్పలేను. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందేలా చేశాను. అర్హతకు తగిన గుర్తింపు తెచ్చినందుకు నాక్కలిగిన సంతోషం అంతింత కాదు.

అతని ముందు బీ టెక్ ఇంజనీయర్లు కూడా తీసికట్టే! అతను నాతో ఉన్నంత కాలం వర్క్ లో బలమైన కుడి భుజంలా ఉండేవాడు. తర్వాత అతని ఊరు వైజాగవడం చేత, అక్కడ మా సంస్థ బ్రాంచ్ పెట్టడంతో, నా రికమెండేషన్ తో అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్లిపోయాడు.
మూర్తి ఇప్పుడు ఒక సెక్షన్ మొత్తం హాండిల్ చేస్తున్నాడట. ఒకతనికి అన్నం పెట్టించానన్న సెంటిమెంట్ కన్నా, సబ్జెక్ట్ పట్ల తపన ఉన్న వ్యక్తికి న్యాయం చేశానన్న సంతృప్తితో మనసు నిండిపోయింది. 

కొసమెరుపేంటంటే మూర్తికీ ఎలక్ట్రానిక్స్ కి అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే, అతని ఫీల్డ్ ఆటోమొబైల్! అదీ అతని క్వాలిఫికేషన్ ఐ టి ఐ!! మరి ఎలెక్ట్రానిక్స్ లో అంతటి ప్రతిభకి కారణమేమిటో?

*****

మరిన్ని వ్యాసాలు