రంప శర్మ: నువ్వు మూటలు మూటలు విప్పి, డబ్బులిచ్చేసి దానాలూ, ధర్మాలూ చేశావ్ గదా? నీకు మిగిలిందేమిటి?
కొంప శాస్త్రి: పుణ్యం మూటలు కట్టుకున్నానుగా!
రుషిపుంగవుడు: "జ్ఞానా దేవతు కైవల్యం", అంటే జ్ఞానం వలన మాత్రమే మోక్షం అంటారు కదా స్వామీ... కనుక నాకు జ్ఞానం బోధించు.
పరమశివుడు: దానితో పనిలేకుండా, నీకు నేరుగా కైవల్యం ప్రసాదిస్తున్నాను వెళ్ళిపో.
రుషిపుంగవుడు: సరే, కైవల్యం లో నాకు జ్ఞానం బోధించే వాళ్ళున్నారా?
పరమశివుడు: .....!
భర్త శిఖామణి: కొందర్ని అర్ధం చేసుకోవడానికి జీవితకాలం సరిపోదు. నిన్ను అర్ధం చేసుకోవడానికి వెచ్చించే సమయం ఎంత వృధా ఐపోతుందో తెలుసా?
భార్యామణి: సమయం వెచ్చిస్తే ఏం లాభం? డబ్బు వెచ్చించి చూడండి!
పాము పెళ్ళాం: నువ్వు వింటున్నావు అని తెలిస్తేనే నా మనసులో మాట చెబుతాను. వినడం ఇష్టం లేదు, లేదా వినడం లేదు అని తెలిస్తే, ఒక్క మాట పలకను.
పాము మొగుడు: ఔనూ... నువ్వు ఏదో పెదాలు కదుపుతున్నావు!
ఏం మాట్లాడుతున్నావేం?
ఒక గంధర్వుడు: విష్ణువు వస్తున్నాడని తెలిసి , శివుడు పారిపోతున్నాడా.. ఎందుకూ?
మరో గంధర్వుడు: శివుడు పామును మొలతాడుగా, గజ చర్మాన్ని కౌపీనం గా పెట్టుకుని వున్నాడు గమనించలేదా?
ఒక గంధర్వుడు: ఔను ఐతే ఏం?
మరో గంధర్వుడు: విష్ణువు గరుత్మంతుడి మీద వస్తున్నాడుగా! గరుత్మంతుడ్ని చూస్తే, పాముకి గుండెలవిసిపోతాయి. కౌపీనం ఊడిపోయే ప్రమాదముంది! అందుకూ!!
రామిరెడ్డి: నేను తీవ్ర మానసిక సమస్యకు లోనై ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటున్నాను.
సోమిరెడ్డి: మన రాజ్యం లో ఏకైక సుప్రసిద్ధ మానసిక వైద్యుడున్నాడుగా. ఆయన్ని సంప్రదించి తగిన వైద్యం పొందవచ్చుగా?
రామిరెడ్డి: ఆయన కూడా తీవ్ర మానసిక సమస్యకు లోనై ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటున్నాడు మరి!
మంత్రి: మహారాజా, మన కొలువులోకి వచ్చిన ఈ పొరుగుదేశపు తర్క శాస్త్ర పండితుడు, తనను పరీక్షవలిసిందిగా కోరుతున్నాడు.
మహారాజు: (మంత్రి చెవిలో గుసగుసలు పలకుతాడు. కాసేపటికి ఒక సేవకుడిని స్పృహ తప్పి పడిపోయినట్లు నటించమని, మంచం మీద పడుకోబెట్టి సభలోకి తీసుకురమ్మంటాడు)
తర్క శాస్త్ర పండితులవారూ, ఈ సేవకుడు భోజనం చేస్తూ ఏమరుపాటున, చింతకాయంత విషపు పురుగును మింగేసి ఇలా ఐపోయాడు పాపం! వీడిని బతికించే మార్గం సెలవీయండి.
తార్కికుడు: వాడిది ఉత్త నటన! ముద్దలో చింతకాయంత విషపు పురుగును చూసికూడా మింగాడంటే నేను నమ్మను! వాడిని లేచిపొమ్మని ఉత్తరువివ్వండి.
మహారాజు: మంత్రి, ఈ తార్కికుడు గెలిచినట్లే లెక్క! ఇలాంటి వాళ్ళని సభకు రప్పించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి... ఆ(?
ఇంద్ర సభలో ఒకడు: ఇంద్రుడు డేగ రూపం దాల్చి, పావురం రూపం దాల్చిన అగ్ని దేవుడ్ని తరుముకుంటూ వెళ్తున్నాడు, శిభి చక్రవర్తి పరీక్ష ఐపోయిందిగా, మరిప్పుడు ఎవరిమీద ఈ పరీక్ష?
ఇంద్రసభలో మరొకడు: ఎవరిమీదా పరీక్ష లేదు. ఇంద్రుల వారికి " నాన్ వెజిటేరియన్" తినాలని ఆశ కలిగిందిలే!
రాజు: స్థానిక రాజ్యాల మధ్య మనస్పర్ధలూ, కలహాలూ పెంపొందించారా?
వేగులవాళ్ళు: దండిగా పెంచాం! ఒకర్నొకరు కొట్టుకుంటున్నారు ప్రభూ!
రాజు: శభాష్! దండనాయకా యుద్ధం ప్రకటించు!
అప్పన్న: నా బట్టతల పోయి, నా తలనిండా జుట్టు మొలిస్తే, మొక్కు చెల్లిస్తానని వేడుకున్నాను.
తిమ్మన్న: ఏం మొక్కు
అప్పన్న: నా తలనీలాలు సమర్పిస్తానని!!