వారంవారం వారివారి వార ఫలాలు - ఈడూరి

vaaram varaam vari vari varaphalalu

వారంవారం వారివారి వార ఫలాలు శీర్షికలో ఒకో వారం ఒకో అంశం తీసుకుని సరదా వారఫలాలు అందించే ఈ శీర్షికలో ఈవారం అప్పుల అప్పారావుల వారఫలాలు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రాన్ని కించపరచడం కాకుండా ఆ శాస్త్రాన్ని లేనివాటికి ఆపాదించడం ద్వారా హాస్యం పుట్టించడానికి  మాత్రమే ఈ ప్రక్రియ. 

మేషం
ఈరాశివారికి ఇబ్బడిముబ్బడిగా అప్పులు పుట్టే వారమిది. అడిగిన వారు కాదనకుండా మీకు అప్పివ్వడం చూసి మీరే ఆశ్చర్య పోవాల్సివస్తుంది. ఈ ఆనందంలో పాత బాకీలు తీర్చేస్తారేమోనని మీరూ మీ కుటుంబసభ్యులూ ఒకింత భయపడటమూ సంభవమే. ఐతే మీకలాంటి భయమక్కరలేదు మీ ఇలవేలుపు శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆదర్శంగా తీసుకుని కేవలం వడ్డీలు మాత్రమే కడుతూ కాలక్షేపం చెయ్యగలరు.

వృషభం
ఈవారం మీరు అప్పుకోసం చేసే ఏ ప్రయత్నమూ కలిసిరాకపోవడంతో జీవితంలో ఇక అప్పు పుట్టదేమో అన్న భయంతో మీరు డిప్రెషన్లోకి వెళ్ళే ప్రమాదముంది. ఏమాత్రం అధైర్యపడకుండా గతంలో వచ్చిన అప్పుల అప్పారావు సినిమా రోజుకి ఒకసారైనా వారం రోజులపాటు చూస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.

మిధునం
ఆదర్శ ఆలూమగలులా మీరిద్దరూ అప్పులు చేస్తూ ఎంతొమందికి కన్నుకుట్టేలా వర్ధిల్లుతుంటారు. మీ శ్రీమతిని ఎంతసేపూ కాఫీపొడీ చింతపండూ మాత్రమే కాకుండా డబ్బూ దస్కం కూడా అప్పు తెచ్చేలా మీరు తీర్చిదిద్దిన వైనం మీకు ఎంతోమందిని అభిమానులనీ శతృవలనీ కూడా తెచ్చిపెడుతుంది. అప్పుకోసం వెళ్ళిన ప్రతిసారీ  దిష్టి తగలకుండా వినాయకుడి పటం దగ్గర ఒక రూపాయి పెడుతూ వెళ్ళండి. మళ్ళీ అవసరం పడినప్పుడు ఆ వినాయకుడి దగ్గరే అప్పు తీసుకోవచ్చు. 

కర్కాటకం
"సోషల్ మీడియాలో అప్పు పుట్టించడం ఎలా?", "మీ నెట్వర్కే మీ ఏటీయెం" అని మీరు రాసిన పుస్తకాలు రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించిపెట్టి మిమ్మల్ని కోటీశ్వరుడిని చేస్తాయి. ఐనా ఏమాత్రం వెనుకాడకుండా మీరు అప్పులు సాధిస్తూనే వుంటారు. మీరంగంలో మీరు చేస్తున్న కృషికి మీ నగరంలోని అప్పుల అప్పారావులందరూ మీకు సన్మానం చేస్తారు.  

సింహం
ఈవారంలో మొదటి రెండురోజులూ మీకు ఎక్కడా అప్పు పుట్టదు, ఐనా అధైర్యపడకుండా కాస్త కష్టమైనా మీ శ్రీమతి దగ్గర రోజుకి రెండు రూపాయలైనా అప్పు తీసుకోకపోతే మీకు ఇప్పట్లో అప్పు దొరికే సూచనలు కనబడట్లేదు.  ముళ్ళపూడి వారి ఋణానందలహరి క్రమం తప్పకుండా పారాయణ చెయ్యడం సత్ఫలితాలనిస్తుంది.

కన్య
మీ అందం చూసి ఎవరైనా మీకప్పిచ్చేస్తారు, అంతేకాదు మా దగ్గర తీసుకోండి అంటే మా దగ్గర తీసుకోండంటూ అప్పిచ్చువారు (వైద్యులు కాదు) మీవెంట పడటం మీతోటి అప్పుతీసుకును వారందరికీ ఆశ్చర్యం గొలుపుతుంది. లోటుబడ్జెట్ రాష్ట్రాలన్నీ అప్పు తెచ్చుకోవడంలో మెళకువలకోసం మిమ్మల్ని సలహాదారుగా వేసుకోవడం ఖాయం. ఆ రాష్ట్రాలనుండి కూడా మీరు పెద్ద యెత్తున అప్పు తెచ్చుకోగలుగుతారు.

తుల
ఆచితూచి అప్పుతేవడంలో మీది అందెవేసిన చేయి. అప్పు పుడుతోంది కదా అని దుబారా అప్పులు చెయ్యరని మీకు గొప్ప పేరుంది. మీ ప్రత్యేకత ఇలాగే కొనసాగుతుంది. ఎట్టిపరిస్థితులలోనూ మీరు మాత్రం ఎవరికీ అప్పు ఇవ్వకండి అదే మీకు చెడు దాపురించడానికి సంకేతంగా భావించవచ్చు. ఎక్కడైనా అప్పుచేసి గణేశ హోమం చేయించుకుంటే మంచి జరుగుతుంది.

వృశ్చికం
రావాల్సిన అప్పులు సమయానికి చేతికందక చాలా చికాకు పడతారు. మీరంటే గిట్టనివాళ్ళే మీకు అప్పు పుట్టకుండా చేస్తున్నారన్న అనుమానం రానురానూ బలపడి మీరు నీరసపడతారు.  ఇంతకాలం అప్పుసామ్రాజ్యంలో మకుటంలేని మహారాజులా వెలిగిపోయిన మీరు హెల్మెట్ పెట్టుకుని తిరగాల్సిన రోజు వస్తుందని కలలో కూడా ఊహించివుండరు. కుబేర వ్రతం చేసుకుంటే కొంత ఫలితం వుంటుంది. 

ధనుస్సు
అప్పుకోసం మీరు విసిరే బాణాలు ఎప్పుడూ గురితప్పవు. అసలు నీరవ్ మోడీకి, విజయ్ మాల్యాకి కూడా మీరే అప్పిప్పించారని మీ వెనుక అందరూ చెప్పుకోవడం మీకు వినబడుతూనే వుంటుంది ఐనా విననట్టు నటిస్తారు. ఏదో ఒకరోజూ మీరూ దేశం విడిచి పారిపోతారని మీరంటే గిట్టనివాళ్ళు ప్రచారం చేస్తుంటారు. కానీ అదంతా అసత్యమే ఎందుకంటే అప్పు పుట్టని రోజంటూ మీ జీవితంలో రాదు గనక.

మకరం
ఋణం-దాఋణం అన్న పుస్తకాన్ని బ్యాన్ చెయ్యాలంటూ ఆందోళన చేపట్టిన మీరు అప్పులప్పారావులందరికీ ఆదర్శంగా నిలబడతారు. గ్రహస్థితులు కలిసొస్తే ఈసారి ఎన్నికల్లో మీరు మీ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడిగా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. మీరు తొందరపడి ఏ పార్టీలోనూ చేరక ఇండిపెండెంటుగా నిలబడి ఆ తరువాత ఏ పార్టీ ఎక్కువ అప్పిస్తే ఆ పార్టీలోకి జంప్ అవడం ఉత్తమం.  

కుంభం
అప్పనంగా అప్పులందుకోవడంలో గొప్ప పేరుంది మీకు. ఈవారం కాస్త అటు యిటుగా బాగానే సంపాదిస్తారు అప్పులు. కొత్తగా అప్పులు తీసుకునేవాళ్ళకి అప్పులిచ్చెవారి డేటా సప్లై చేస్తూ కూడా సంపాదించడం మీలోని నైపుణ్యం. అంతగా మీదగ్గర నగర పౌరుల వివరాలు వున్నాయి. ఏ వీధిలోకి వెడితే ఎంత అప్పు ఈజీగా సంపాదించవచ్చో అవలీలగా మీరు చెబుతుంటే మీతోటి అప్పులప్పారావులు నోళ్ళు తెరుచుకు వింటుంటారు. కానీ ఇంతటి ఘనులూ మీరు మీ శ్రీమతి దగ్గర మాత్రం ఈనాటికీ ఒక్క రూపాయి కూడా అప్పు పొందలేకపోయారని జనాల్లో టాక్ వుంది. 

మీనం
"అప్పుంటేనే పఫ్ఫు" అనే సినిమా నిర్మించి చలనచిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుంటారు. కేవలం అప్పుతో మాత్రమే నిర్మించిన మొట్టమొదటి సినిమాగా మీ సినిమా చరిత్ర సృష్టిస్తుంది. "అప్పు టు ద పవర్ ఆఫ్ అప్పు" మరియు "అప్పు రాజేసిన నిప్పు" అని మరొ రెండు సినిమాలు నిర్మించి హ్యాట్ ట్రిక్ సాధిస్తారు. ఐతే మీరు తీసుకున్న అప్పు తిరిగివ్వలేదని హీరోయిన్ కోర్టుకెక్కడంతో కొన్ని చిక్కుల్లో పడతారు.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు