జోకులు - - డా. ఎస్. జయదేవ్ బాబు

 

ద్రౌపది తన శిరోజాలు సరిచేసుకుంటూ, చిక్కుతీయమని , భీమార్జున నకుల సహదేవులనడిగితే వాళ్ళు తమవల్ల కాదంటారు. చివరిగా ద్రౌపది ధర్మరాజును, సాయం చేయమని అడుగుతుంది.
ధర్మరాజు: ఈ మాత్రం చిక్కు తీయడానికి నేను రావాలా ద్రౌపదీ?
ద్రౌపది: యక్ష ప్రశ్నలకి సమాధానాలిచ్చిన వారు మీరేగా? అవి చిక్కు ప్రశ్నలు కదా! ఆ చిక్కు ప్రశ్నలకి జవాబులిచ్చిన మీరు, ఈ మాత్రం చిక్కు తీయలేరా స్వామీ!!

నకులుడు: సహదేవా... శ్రీకృష్ణుడు మన అన్నదమ్ముల్లో అర్జునిడికే ఎందుకు గీత బోధించాడంటావ్.
సహదేవుడు: మన  అన్నదమ్ముల్లో, అర్జునుడొక్కడికే పన్నెండు పేర్లున్నాయి, అర్జునుడొక్కడికి  గీత భోధిస్తే, అంతమందికి భోధించినంత, అనుకున్నాడు, శ్రీకృష్ణుడు!!

 

ఒక గంధర్వుడు: విరాటనగరానికి వెళుతూ, పాండవులు తమ ఆయుధాల మూటను జమ్మిచెట్టుకు కడుతూ, ధర్మరాజు, ఆ ఆయుధాల మూట, భీముడికి అస్సలు కనిపించకూడదని మొక్కుకున్నాడే... ఎందుకంటావ్?
ఒక కిన్నెరుడు: చీటికి మాటికి కోపమొచ్చి, తొడలు కొట్టుకుంటాడు కదా.. భీముడూ! అందుకనీ!

 

నర్తనశాల బొద్దింక: నువ్వు వంటశాల బొద్దింకవు కదా? ఇక్కడికెందుకొచ్చావ్?
వంటశాల బొద్దింక: ఈ రోజు మాంసాహారం తినాలనిపించి ఇలా వచ్చాను.
నర్తనశాల బొద్దింక: ఇక్కడ మాంసాహారమా?
వంటశాల బొద్దింక: అదుగో ఆ తెర చాటున కనబడే మాంసపుముద్ద ఎవరిదనుకున్నావ్? మహారాణి గారి తమ్ముడు కీచకుడు, మా వంటశాల  వలలుడి చేతిలో నలిగి చచ్చాడు తెలీదా?

పరమేశ్వరుడు: ఏమీ.. నాతో పొరాడితే తప్ప నేను వరాలివ్వనా?
పార్వతి: ఔను స్వామీ! అర్జునుడికి మీరు పాశుపతాస్త్రాన్ని ఊరికే ఇచ్చారా చెప్పండి?

 

 

పొట్టి పిట్ట:  అర్జునుడు గెడ్డాలూ మీసాలు పెంచి, నువ్వెప్పుడైనా చూశావా?
పొడుగుపిట్ట: తీర్థయాత్రలూ, తపస్సులు చేసినప్పుడు పెంచాడేమో గాని, గెడ్డాలూ, మీసాలూ అతికించి తిరగడం ఒకసారి చూశాను.
పొట్టిపిట్ట: ఔనా... ఎప్పుడూ?
పొడుగుపిట్ట: సుభద్రకు "లైను" వేసినప్పుడు!!


ఉత్తరకుమారుడు: బృహన్నలా మనం వెళ్తున్నది యుద్ధభూమికేగా?     
బృహన్నల: సందేహమేల?
ఉత్తరకుమారుడు: నువ్వు తోలే ఈ గుర్రాలు మాంచి బలవంతమైనవా, వేగవంతమైనవా?
బృహన్నల: నిస్సందేహంగా! ఎందుకడిగావ్
ఉత్తరకుమారుడు: ఒకవేళ మనం తిరిగి వెళ్ళాలంటే, ఈ గుర్రాలు ఇంతకన్నా వేగంగా పరిగెట్టగలవా?

ద్రౌపది: వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నౌకా విహారం వాయిదా వేద్దామా నాథా?
అర్జునుడు: ఈ అర్జునుడు ముందు వేసిన అడుగును, వెనక్కు తీసుకోడు అని నీకు తెలీదా ప్రాణేశ్వరీ?
ద్రౌపది: ఐతే నేనొక చత్రం తీసుకువచ్చేదా?
అర్జునుడు: వొద్దు.. దాన్ని పట్టుకుని నేను నడవను, నువ్వు పట్టి నడవడం నాకు నచ్చదు.
దౌపది: ఐతే మరెలా? నౌకావిహారమప్పుడు, కుంభవృష్టి కురిస్తేనో...?
అర్జునుడు: "శరఛత్రం" నిర్మిస్తా! నోర్మూసుకుని నడువ్.  

కురుక్షేత్ర యుద్ధభూమిలో...
అర్జునుడు: కృష్ణా, ఘటోత్కచుడు మరణించాడని , మేమందరం ఏడుస్తుంటే, నువ్వు నన్ను కౌగిలించుకుని నవ్వుతున్నావే?
కృష్ణుడు: కర్ణుడి చేతిలో నువ్వు చచ్చుండే వాడివిగా! ఆ సంతోషం లో నవ్వుతున్నాను!!

 

భీమసేనుడు: అమ్మా, రోజూ నువ్వు వడ్డించే ఈ అన్నం లో నెయ్యి పోయకున్నా, నెయ్యి వాసనతో ఘుమఘుమలాడుతుందే... ఎలా?
కుంతి: మనం నివసించేది లక్క ఇంట్లో కదా! లక్క ఇల్లుని మట్టి , నెయ్యి కలిపి నిర్మిస్తార్రా పిచ్చిసన్నాసీ!
భీమసేనుడు: ఓహో.. అదా కారణం! ఐతే నీకు నెయ్యి పొదుపైందన్నమాటే!
కుంతి: మరే ! నీ విస్తటికి కావల్సినంత నెయ్యిని నేనెక్కణ్ణుంచి తేనూ!!

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు