ఇదివరకటిరోజుల్లో ఏపనైనా చేయాలంటే లక్షన్నరసార్లు ఆలోచించికానీ చేసేవారు కాదు. ఏం చేస్తే ఏం కొంపమునిగిపోతుందో అని ఓ భయం అనండి, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో బాగుండదూ అని అనండి, మొత్తానికి ఆరోజుల్లో ఎవరికీ అంత ధైర్యం ఉండేది కాదు. చెప్పానుగా, పనిమాట దేవుడెరుగు, అవతలివారికి నచ్చదేమో అనే ఓ శంక లాటిది పీకుతూండేది. కానీ కాలమూ మారుతోంది, దానితోపాటే మనుష్యుల ఆలోచనాపధ్ధతిలో కూడా మార్పులు వచ్చేస్తున్నాయి... వచ్చేస్తున్నాయి ఏమిటిలెండి వచ్చేశాయి.
ఆ మార్పుకే అక్షరరూపం ఇవ్వాలంటే "అబ్బే... ఫరవాలేదండీ..." అనో లేక ఆధునిక భాషలో చెప్పాలంటే "చల్తా హై..." అనో పిలవొచ్చు. ఏ విషయం తీసికోండి, ఈ "చల్తా హై..." అనేది ప్రత్యక్షం అయిపోతుంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఇదివరకటి రోజుల్లో, బయటకి వెళ్ళివచ్చి, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. అక్కడికేదో మడీ, ఆచారం, శుధ్ధీ అనికాదు, ఎక్కడెక్కడో తిరిగొచ్చి, మాయదారి రోగాలన్నీ ఇంట్లోకి తేకుండా, మన పెద్దలు తీసికున్న జాగ్రత్తలు అవి. కానీ ఇప్పుడో, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళూ లేవూ, చెప్పడానికి పెద్దలూ లేరూ, వినేవాళ్ళూ లేరూ. అధవా, ఏ పెద్దమనిషైనా అడిగినా, "అబ్బే పరవాలేదండీ..." అనేసే రోజులు. దేవుడిగుళ్ళోకి ఇదివరకటి రోజుల్లో, ఆ గుడిప్రాంగణంలో ఓ నుయ్యుండేది, ఓ బాల్చీతో బాల్చీడు నీళ్ళు పోసుకుని, కాళ్ళూ చేతులూ కడుక్కుని, నెత్తిమీద నీళ్ళు జల్లుకుంటేనే కానీ, గుళ్ళోకి అడుగెట్టేవారు కాదు, కానీ ఈ "చల్తాహై" రోజుల్లో, కాళ్ళుకడుక్కోడం మాట దేవుడెరుగు, సాక్స్ తోనే గుళ్ళోకి అడుగెట్టేయడం, ఏమైనా అంటే "చల్తా హై..."
ఎప్పుడైనా రైళ్ళలో ప్రయాణం చేయాలంటే, రెండు నెలల ముందుగానే రిజర్వేషను చేయించుకోవడమో, ఆన్ లైన్ లో చేసికోవడమో కానివ్వడం ఎందుకూ, సుఖంగా ప్రయాణం చేద్దామనే కదా, తీరా మనం ఎక్కాల్సిన బెర్త్/ సీట్ దగ్గరకు వెళ్ళేటప్పటికి, అప్పటికే ఇంకో ప్రాణి అక్కడ తిష్ఠవేసికుని ఉంటాడు. ఏమిటయ్యా అని అడిగితే , టీటీ ని అడిగేమండీ, ఇక్కడ కూర్చోమన్నాడండీ... అనేసి ఊరుకుంటాడు, పైగా వీడితో పాటున్న ఇంకొకడిని కూడా కూర్చోపెట్టి, సద్దుకోమన్నా ఆశ్చర్యం లేదు. పాపం ఆ రెండోవాడికి అదోలా అనిపించి అడిగినా" అబ్బే ఫరవాలేదురా, టీటీ మనవాడే..." అంటాడు. చివరకి ఎప్పుడో రెండునెలలక్రితం రిజర్వేషను చేయించుకున్న మనం, నాలుగు న్యూసు పేపర్లేసికుని బెర్త్ క్రింద సెటిలవుతాము. కారణం మళ్ళీ "చల్తాహై". ఏ అర్ధరాత్రో టీటీ వచ్చినా అడిగి లాభం లేదు, "అదేమిటండీ ఏదో సద్దేసికోవాలికానీ, మరీ పేచీ పెడితే ఎలాగ మాస్టారూ..." అని మనకే జ్ఞానబోధ చేస్తాడు.
పాతరోజుల్లో అంటే న్యాయవ్యవస్థ అని ఉన్నరోజుల్లో, సైకిలు కి లైటులేకపోయినా, ఇద్దరేసి ఎక్కి ప్రయాణం చేసినా, పోలీసు టక్కున ఆపి కేసు వ్రాసేవాడు. ఇప్పుడు ఆ సైకిళ్ళే లేవనుకోండి, ద్విచక్రమోటారు వాహనాలమీద కుటుంబం అంతా (అధమపక్షం ఇద్దరో, ముగ్గురో పిల్లలూ, భార్యా సమేతుడై) వెళ్ళినా అడిగే దిక్కు లేదు. ఆటోల్లోనూ, అవేవో సెవెన్ సీటర్లలోనూ, జెండాల్లగ మనుష్యులు వేళ్ళాడుతూ ప్రయాణం చేస్తూ కనిపిస్తారు, అడిగితే మళ్ళీ "చల్తాహయ్యే". ట్రాఫిక్కు సిగ్నల్సూ, పార్కింగులూ పేరుకి మాత్రమే, ఎవడిష్టం వాడిదీ, అడిగితే చల్తా హై గురూ...
అంతదాకా ఎందుకూ, ఏ కూరలో తెచ్చుకుందామని బజారుకెళ్ళామనుకోండి, అయిదో పదో గ్రాములు తక్కువ తూస్తాడు కానీ, ఛస్తే ఒక్క గ్రాముకూడా ఎక్కువ ఇవ్వడు. మళ్ళీ అడిగితే బాగుండదేమో అని ఒకటీ, అలాగే రూపాయికి తక్కువైన చిల్లర మనకి దక్కే ప్రాప్తం ఉండదు, ఏమైనా అడిగితే 'ఫరవాలేదండీ' అంటాడు. అదే మనం అర్ధరూపాయ తక్కువిస్తే టిక్కెట్టిస్తాడా, చెవులుమెలెట్టి మరీ తీసికుంటాడు. ఈ పరవాలేదండీ అన్నది అక్కడకి వాడేదో మనల్ని oblige చేస్తున్నంతగా అంటాడు. నిజమే కాబోసనుకుని మనమూ ఈ ఫరవాలేదండీ/ చల్తాహై syndrome కి అలవాటు పడిపోతాము.
అలాగే రోడ్డు పక్కనుండే ఏ టప్రీ కిందైనా చాయ్ త్రాగుదామని వెళ్ళండి, పక్కనుండే బకెట్టు నీళ్ళల్లో ఓ గ్లాసు ముంచేసి దాంట్లోనే ఓ చాయ్ పోసి ఇచ్చేస్తాడు, అప్పటికే ఆ బకెట్లో అంతకుముందు వేసిన గ్లాసులూ, పళ్ళేలూ తేలుతూ ఉంటాయి, అందుకేనేమో బయట చాయ్ అంత రుచిగా ఉంటుంది.
అన్నిటిలోకీ ముఖ్యమైనది మనం ఏ ఎపార్టుమెంటో కొనుక్కుని లోకాన్ని ఉధ్ధరించేద్దామని, అప్పుడప్పుడే పునాదులువేస్తూన్న ఓ బిల్డరు దగ్గరకి వెళ్తాం. వెళ్ళేముందర, ఇంట్లో భార్య ఎక్కడెక్కడినుంచో విన్న వివరాలతో ఓ క్లాసుతీసికుంటుంది. "వాడు ఏవేవో కబుర్లు చెప్పేడుకదా అని ఊరికే తలూపేయకండి, అన్ని వివరాలూ అడగండి. అప్పుడెప్పుడో అన్నయ్యగారు చెప్పింది గుర్తుందా, మొట్టమొదట అక్కడ బిల్డింగు కట్టడానికి కార్పొరేషన్/ పంచాయితీ/ మ్యునిసిపాలిటీ వారి అనుమతుందా లేదా అని అడగాలి తెలిసిందా...". పాఠాలు బట్టీపట్టినట్టు, ఈ వివరాలన్నీ ఇంకోసారి వల్లె వేయించికానీ, ఆ ఇంటావిడ ఈయన్ని వదలదు. మొత్తానికి ఆ బిల్డరు దగ్గరకి వెళ్ళీవెళ్ళగానే, వాడిచ్చిన కాఫీయో, డ్రింకో త్రాగేసి, వాడు చూపించిన రంగురంగుల బ్రోచర్లు చూసి, ఒక్కోచోట అవేవో పవర్ పాయింటు ప్రెజెంటేషన్లు కూడా చూసి, పూర్తిగా ఆ మత్తులోకి వెళ్ళి, ఇంటావిడ చెప్పింది మర్చిపోతాడు. చటుక్కున గుర్తొచ్చి మొహమ్మాటపడుతూ, నసుగుతాడు." మన (అప్పుడే మన లోకి వచ్చేశాడు) బిల్డింగుకి పెర్మిషనూ అదీ... ఉండే ఉంటుందిలెండి... అయినా..." అంటూ వదిలేస్తాడు. ఆ బిల్డరు ఓ పెద్ద ఫోల్డరు లాటిది తీసి, ఏవేవో కాగితాలు చూపిస్తాడు, అందులో ఎక్కడలేని పెర్మిషన్లూ ఉంటాయి కానీ, ఈ కార్పొరేషన్ వాడి అనుమతి కనిపించదు. ఏమిటండీ అని అడిగితే, "అబ్బే దానికేముందండీ, ఎప్పుడో అడిగేశాము, ఏదీ ఇంకా పునాదుల్లోనే కదా, మీరు బుక్ చేద్దామనుకుంటున్న ఆరో అంతస్థు దాకా వచ్చేసరికి, ఆ పెర్మిషనూ వచ్చేస్తుంది సార్... ఖంగారేమీ లేదండీ..." అంటూనే ఊరుకోకుండగా "సబ్ కుఛ్ చల్తాహై సాబ్..." అని ఓ భరోసాకూడా ఇస్తాడు.
మన రాజకీయనాయకులని చూడండి, వాళ్ళకైతే అన్నీ "చల్తా హై..." లోకే వస్తాయి. ఎడాపెడా హామీలిచ్చేస్తూంటారు. ఈ దేశంలో 'సబ్ కుచ్ ఛల్తాహై' కదా మరి?
భమిడిపాటి ఫణిబాబు