ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

నా చదువు - 1 !

చిన్నప్పట్నుంచీ నాకు చదువుపట్ల తెగ ఆసక్తి ఉండేది.

నేను టెంత్, స్కూల్ ఫస్ట్ లో పాసవ్వగానే మా నాన్నగారు "డిప్లొమా అంటే టెక్నికల్ చదువట. దాన్లో ఫ్యూచర్ బాగుంటుందని మా ఆఫీసులో, టెంత్ క్లాస్ పూర్తిచేసిన పిల్లలున్న కొలీగ్స్ అనుకుంటున్నారు. అయితే అందులో చేరాలంటే ముందు ఎంట్రన్స్ రాయాలట (CEEP ఎంట్రన్స్ అప్పుడే కొత్తగా ప్రారంభమయ్యాయి). దానికి వన్ మంత్ కోచింగ్ సంజీవరెడ్డి నగర్లో ఇస్తారట. నువ్వు పొద్దున్నే లేచి అక్కడికి వెళ్లాలి. సరేనా?" అన్నారు.

‘నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని. అలా టెస్ట్ రాస్తే, ఇలా ఎంట్రన్స్ పాసవుతాను. నాలాంటి వాడికి మళ్లీ కోచింగేమిటో?’ మనసులో అనుకున్నాను.

నాన్నగారు ఫీజ్ కట్టేశారు. నేను రోజూ హెచ్ ఎ ఎల్ కాలనీ నుంచి సంజీవరెడ్డీ నగర్ కు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాలి. అక్కడ ఎక్స్ పీరియన్స్ డ్, ఎక్స్ పర్ట్స్ చేత ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ క్లాసులు చెప్పించేవారు. క్లాసులో అరవైమంది దాకా ఉండేవారు. నా గర్వం ఎంతలా తలకెక్కిందంటే, అసలు ఈ క్లాసులు నాకెందుకు అనుకునేవాడిని. కానీ చిన్నప్పట్నుంచీ క్రమశిక్షణ ఉన్న పిల్లాడిని అవడం చేత ఠంచనుగా అటెండ్ అయ్యేవాడిని. కాని ఆకారపుష్టి, నైవేద్య నష్టి చందం. సబ్జెక్ట్స్ పై ఏకాగ్రత చూపకుండానే మధ్యాహ్నం ఇంటికి వచ్చేసేవాడిని.

ఎంట్రెన్స్ టెస్ట్ రాశాను. నాకొచ్చిన ర్యాంక్ 2500. నాకు సీటు రాలేదు. నెత్తి మీదున్న కళ్లు మళ్లీ మామూలు స్థితికి వచ్చాయి. ఎంతో బాధ కలిగింది. కారణం-

1. మా నాన్నగారు ఒక్కో పైసా చాలా జాగ్రత్తగా కర్చు పెట్టేవారు. అలాంటిది ఆయన కోచింగ్ కు కట్టిన ఫీజ్ వేస్టయిపోయింది.

 

2. మా స్కూలు అనేది ఓ బావి, దాన్లో నేను తెలివైన కప్పనే కావచ్చు, ఫస్టు వచ్చుండొచ్చు. కానీ సముద్రంలోకి వెళితే చాలా వాటితో పోటీ పడాల్సి వస్తుంది. మనమెంత?

కొద్దిగా నిరాశగా ఉన్న నన్ను మా నాన్నగారు ఎం పీ సీ కోర్స్ న్యూ గవర్నమెంట్ కాలేజ్, సికింద్రాబాదులో చేర్పించారు.

అంతకు ముందే టెక్నికల్ కోర్స్ కోసం మల్లెపల్లి లోని ఐ టీ ఐ లోనూ అప్లై చేయించారు. ఎం పీ సీ లో ఒక నెల చదువు వెలగబెట్టాక, ఎలెక్ట్రానిక్స్, ఐ టీ ఐ లో సీటొచ్చింది. లిస్ట్ లో నాది రెండో నెంబరు(అక్కడ సెలెక్షన్ కు టెస్ట్ లు ఉండవు, లాంగ్వేజెస్ ని వదిలి మిగిలిన సబ్జెక్ట్స్ లో వచ్చిన మార్కులు చూసి, ఎవరివి ఎక్కువుంటే వారికి సీటిస్తారు). పైగా స్టై ఫండ్ కూడా ఇస్తారు. మళ్లీ కళ్లు నెత్తికెక్కాయి. ఐ టి ఐ లో చేరాను.

రెండేళ్ల కోర్సు క్లాసులో అందరికంటే మంచి మార్కులతో పూర్తిచేసి, హెచ్ ఎ ఎల్ లో అప్రెంటీస్ వస్తే చేరి అందులోనూ మంచి మార్కులు సంపాదించుకుని బయట కొచ్చాను.

నా ఉద్దేశం ఏంటంటే అప్రెంటీస్ అయిపోతే జాబ్ నన్ను వెతుక్కుంటూ వస్తుందని. అయితే అది రాంగని తేలింది. మనం మన బయోడాటా అన్ని కంపెనీలకీ తిరిగి ఇస్తే, వేకెన్సీ ఉండి ఎవరైనా పిలిస్తే, అక్కడ రాతపరీక్షా, ఇంటర్వ్యూ ల్లో నెగ్గుకు వస్తే అప్పుడు ఉద్యోగం వస్తుందట. ఇది తెలిసి గుండె జారిపోయింది.

నేను డెక్కన్ క్రానికల్ పేపర్లో వాకిన్ యాడ్ చూసి ఇంటర్వ్యూకి వెళితే, అక్కడ దాదాపు ముప్పై మందిదాకా ఉన్నారు. వేకెన్సీలు అయిదుట. లక్కీగా నేను సెలెక్ట్ అయ్యాను.

చేరిన రెండోరోజు లారీల్లో బ్యాటరీలు వచ్చాయట వాటిని కిందకు దింపమన్నాడు సూపర్ వైజర్. నాకు కోపం, ఉక్రోషం తన్నుకు వచ్చాయి. రావూ మరి. మా నాన్నగారు హెచ్ ఎ ఎల్ లో ఎంప్లాయి. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ను. ‘నేను మొయ్యను’ అన్నాను. అలా ‘అనకూడదు మొయ్యాలి’ అన్నాడు. ‘మరి మోయడానికి వాళ్లెందుకు రావడం లేదు’ అన్నాను. అదా! వాళ్లు డిప్లొమా, బి టెక్ చేసినవాళ్లు. వాల్లు మోయరు. ఇలాంటి పనులు చేయరు. హెల్పర్లు, మెకానికల్ వాళ్లు, ఐ టీ ఐ వాళ్లు మాత్రమే చెయ్యాలి అన్నాడు కాస్త అసహనంగా. నేను నాలుగు బ్యాటరీలు మోయంగానే ‘ప్లీజ్ నేను లావుగా ఉంటాకదా, బాగా చెమట పోస్తోంది, ఇహ మొయ్యలేను’ అన్నాను బతిమిలాడుతున్నట్టుగా.

‘ఏవనుకున్నాడో..సరె’ అన్నాడు. అయితే నా మనసులో మాత్రం నేను డిప్లొమా చేయక ఎంత తప్పు చేశానో అవగాహనకొచ్చింది.
ఇంటికి రాగానే, నేను హెచ్ ఎ ఎల్ లో అప్రెంటీస్ చేసేప్పుడు ఆ సంస్థలో పనిచేసే నాగరాజనే అతను పార్ట్ టైం డిప్లొమా చేస్తున్నట్టు తెలిసింది. మా నాన్నగారికి అతని గురించి చెప్పి అతన్ని నేను ఎలాగైనా కలిసే ఏర్పాటు చేయమన్నాను. అతను విద్యానగర్ లో ఉంటాడట. మా నాన్నగారు సాయంత్రం సంస్థ బస్సులు బయల్దేరే ముందు అతనితో నన్ను కలిపించారు. నేను పార్ట్ టైం డిప్లొమా చేయాలంటే, ఎలా ప్రిపేర్ అవ్వాలని అడిగాను.

అతను వాళ్లింటి అడ్రస్ ఇచ్చి ఆదివారం ఇంటికొస్తే అన్ని విషయాలు కూలంకషంగా చెబుతా అన్నాడు.

నేను ఆదివారం వాళ్లింటికెళ్లాను.

ఆ వ్యక్తి నన్ను కూర్చోబెట్టి పైపైన చెప్పడం మొదలెట్టాడు. కాని ఎలాగైనా డిప్లొమా చేయాలన్న తపన, కసి నాది. నేను ప్రశ్నలు వేస్తూ, ఎంట్రన్స్ ప్రాధాన్యత ఏమిటి? ఏ ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇత్యాది విషయాలు చాలా డిటెయిల్డ్ గా తెలుసుకున్నాను. నాకున్న ఆసక్తి అతనికి ఆశ్చర్యం కలిగించింది. అన్ని విషయాలు చెప్పడమే కాకుండా, అతని దగ్గరున్న బుక్స్ కొన్ని నాకిచ్చాడు.
నేను ఎంట్రన్స్ ఎప్పుడో తెలుసుకుని ఫీజ్ కట్టి, ఏ కోచింగ్ తీసుకోకుండా, ఆఫీసు నుంచి రాగానే క్షణం వృధా చేయకుండా, నాకు నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లో నోట్సులు తయారు చేసుకుని, రాత్రి 12 గం. దాకా, మళ్లీ ఉదయానే నాలుగున్నరకు లేచీ చదవసాగాను.

నేను చదివే విధానం మా నాన్నకూ ఆశ్చర్యం కలిగించింది.

పార్ట్ టైం ఎంట్రెన్స్ సంతృప్తిగా రాశాను. దాదాపు పన్నెండు పేజీల మందిలో నాకు రెండో ర్యాంకు వచ్చింది. మా నాన్న"మంచి ర్యాంకు భలే తెచ్చుకున్నావురా, నాకు చాలా సంతోషంగా ఉంది"అన్నారు.

చదువుకోవడం అన్నది వ్యక్తిలో ఉండాల్సిన తపన. అది ఉంటే మనిషి ఎటువంటి ఆంక్షలూ లేకుండానే చదువుతాడు. అదే లేకపోతే బయటి నుంచి ‘చదువూ, చదువూ’ అని టీచర్స్, పేరెంట్స్ ఎంత ఒత్తిడికి గురిచేసినా వాళ్లది యాంత్రిక పఠనమే! అది ముమ్మాటికీ నటనే!!
అందుకే నా దగ్గరి వాళ్లతో నేనొక్కటే అంటాను " చదివించొద్దు, ఎందుకు చదవాలో అర్థమయ్యేలా చెప్పండి. మాటి మాటికీ కాంపిటీషన్ బూచిని చూపొద్దు, స్వేచ్చగా చదవనీయండి. అద్భుతాలు జరుగుతాయి. ఇది నిజం.

***

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు