వారంవారం వారివారి వార ఫలాలు - ఈడూరి

vaaram varaam vari vari varaphalalu

వారంవారం వారివారి వార ఫలాలు శీర్షికలో ఒకో వారం ఒకో అంశం తీసుకుని సరదా వారఫలాలు అందించే ఈ శీర్షికలో ఈవారం పెళ్ళికాని ప్రసాదుల వారఫలాలు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రాన్ని కించపరచడం కాకుండా ఆ శాస్త్రాన్ని లేనివాటికి ఆపాదించడం ద్వారా హాస్యం పుట్టించడానికి  మాత్రమే ఈ ప్రక్రియ. 

మేషం
ఈరాశివారికి పెళ్ళైపోతుంది అని అనలేము కానీ ఈవారం బాగా సంబంధాలు వచ్చే అవకాశముంది. ఏదైనా సంబంధం కుదిరినా ఆశ్చర్యపోనక్కరలేదు. పొట్టీపొడుగూ, ఎత్తూ వెడల్పూ అంటూ తల్లిదండ్రులని సతాయించక ఏదో ఒక సంబంధం ఖాయం చేసుకుంటే కాయానికి మంచిది. మీరు పూజించే హనుమంతుణ్ణి కాకుండా ఆయన ప్రభువైన రామచంద్రుణ్ణి నమ్ముకుంటే కొంత మంచి జరిగే అవకాశం లేకపోలేదు.

వృషభం
ముందుగా మీకు శుభాకాంక్షలు ఈవారం మీరు వందో పెళ్ళిచూపులకి వెళ్ళబోతున్నందుకు. కొత్తగా పెళ్ళిచూపులకి వెళ్ళబోయే కుర్రాళ్ళు మీవద్దకు సలహాల కోసం రావడం మీకు ఆనందం కలిగించినా వాళ్ళు చివరికి వీడికే పెళ్ళికాలేదు ఇక వీడి సలహాలు మనకేమి పనిచేస్తాయ్ అని సణుక్కుంటూ వెళ్ళడం మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. రోజుకి ఒక కుర్రాడైనా వచ్చి "సార్ మీ సలహాలు ఫలించి నాకు పెళ్ళి కుదిరింది" అంటూ మీకు శుభలేఖ అనిదించడం మిమ్మల్ని అబ్బురపరుస్తుంది. 

మిధునం
కాపురానికి కావాల్సిన సరుకులన్నీ అమర్చుకుని మీరు భార్య కోసం ఎదురుచూస్తున్నారు. కానీ కనుచూపు మేరలో మీకు వివాహ ఘడియలు కనబడట్లేదు. వాషింగ్ మెషీన్ మొదలైన వస్తువులు బ్రహ్మచారి గానూ సంసారి గానూ వాడాల్సింది నేనే కదా ఈమాత్రం దానికి పెళ్ళెందుకు అన్న నిర్వేదం మీలో పెరగకముందే ఎవరో ఒక అమ్మాయిని ఎంచుకోవడం మీకు మంచిది.

కర్కాటకం
“త్వరగా మీ జీవిత భాగస్వామిని ఎన్నుకోండి”, “పండంటి పెళ్ళికి పన్నెండు సూత్రాలు” అని మీరు రాసిన పుస్తకాలు విపరీతమైన అమ్మకాలు సాధించి మీకు పెళ్ళికాలేదన్న బాధని కొంతమేరకు తగ్గించినా మీరంటే గిట్టనివారు మీవైపు చూసే చూపులు మీకు గుచ్చుకుంటూనే వుంటాయి. సిధ్ధి బుధ్ధి సమేత విజయవినాయకుడికి హోమం చేయించడం శుభప్రదం.

సింహం
ఎప్పటిలాగే బలికి తీసుకెడుతున్న మేకలాగా మిమ్మల్ని మీ తల్లిదండ్రులు మరో పెళ్ళిచూపులకి తీసుకెళ్ళడం జరుగుతుంది కానీ వివాహ యోగం మాత్రం కనబడట్లేదు. మీ తల్లిదండ్రులింకా బతికేవున్నారన్న సాకుతో అమ్మాయి మీ సంబంధం తిరస్కరిస్తుంది. పెళ్ళికాగానే మీ పేరెంట్సుని ఓల్డేజి హోం కి పంపేస్తానని మీరు మాట యిచ్చినా ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో చేసేదేమిలేక తిరుగు మొహం పడతారు. ఏమీ తెలియని తల్లిదండ్రులు మరో సంబంధం వెతికే పనిలో నిమగ్నమౌతారు.  

కన్య
ఈరోజుల్లో అమ్మాయిలకి మునుపెన్నడూ లేనంత మంచి అవకాశాలున్నమాట వాస్తవమే ఐనా గొంతెమ్మ కోరికలు ఎన్నటికీ మంచి చేయవు. మీ స్థాయికన్నా కాస్త పైవాళ్ళని కోరుకోవచ్చు కానీ మరీ ఎక్కడో వున్నవాళ్ళు మిమ్మల్ని వరించి రావాలంటే ఎలా? పదోతరగతి అమ్మాయి అయ్యేయెస్ అబ్బాయిని కానీ చేసుకోనంటే యిక పెళ్ళి అవడం సాధ్యమేనా? ఆలోచించండి.

తుల
మీకన్నా యిరవై యేళ్ళు వెనక పుట్టినవాళ్ళ పెళ్ళి ఐపోతుంటే మీ పెళ్ళి యింకా కాలేదు అని మీరు బాధ పడటంలో తప్పు లేదు కానీ అది మీ తప్పే అని మీరు గుర్తిస్తే మంచిది. ఏ వయసు ముచ్చట ఆ వ్యసులో తీరాలి. మీరేమో వయసులో వుండగా ఆకాశంలో విహరించి వయసుడిగ్పొయాక పెళ్ళి కావట్లేదు అని రోదిస్తే ఏమి లాభం? ఈవయసులో మీరు ఏ హొమమ చేసినా చివరికి తపస్సు చేసినా వివాహ సూచనలు కనబడట్లేదు.

వృశ్చికం
పెళ్ళిచూపులకి వెళ్ళిన ప్రతిసారీ వాళ్ళు పెట్టిన చిరుతిళ్ళు తిని మీ చిరుబొజ్జ కాస్తా బానపొట్టగా మారినా మీకు మాత్రం పెళ్ళి కుదరలేదు. ఐదుగురు బ్రహ్మచారులకి ఏడు శనివారాలు తొమ్మిది పిండివణ్తలతో భోజనం పెట్టడం ద్వారా సత్ఫలితాలు సాధించగలరు, ప్రయత్నించండి. 

ధనుస్సు
పెళ్ళిచూపులెలాగూ సక్సెస్ అవట్లేదు కదా అని మీరు మరో రూట్లొ రావాలనుకుని రోట్లో తలపెడతారు. మీరు విసిరిన వలపుబాణాలు పిల్లకి కాక తల్లికి తగిలి మీకు ఒళ్ళు గుల్ల అయ్యే పరిస్థితి వస్తుంది. నిదానంగా నిజాయితీగా చేసే ప్రయత్నాలు విజయవంతమౌతాయి.  మకరం
మీకు పెళ్ళి ఆలశ్యమౌతున్నది అని మీకన్నా ముందు మీ తమ్ముడిని పెళ్ళిచేసుకొమ్మని సలహా ఇచ్చి అప్పట్లో మంచి మార్కులు కొట్టేశారేమో గానీ అదే మీ పాలిట శాపమయింది. ఇతగాడిలో ఏ లోపముందో ఇతడికన్నా ముందే తమ్ముడికి పెళ్ళిచేశారు వాళ్ళింట్లో….అని అమ్మలక్కలు అనుకునే మాటలు మీ చెవులకి శూలాల్లా తాకుతాయి. ఇప్పుడు వగచి వుపయోగం లేదు. మీ ప్రయత్నాలు మాత్రం మానకండి.   

కుంభం
పెళ్ళికాని ప్రసాదులకి బ్రాండ్ అంబాసడర్ మీరు. మీకు పెళ్ళైపోతే వాళ్ళ గతేమి కావాలి అని వాళ్ళందరూ మీకు పెళ్ళికాకుండా వుండేందుకు హోమాలు చేయిస్తున్నారని తెలిసి కుమిలిపోతారు మీరు. వారిపై కక్ష సాధించే ప్రయత్నాలు చెయ్యకుండా వాళ్ళందరూ ఆ పనిలో బిజీగా వుండగానే మీరు పెళ్ళి ప్రయత్నాలు గట్టిగా చేసుకోవడం మంచిది, శుభం. 

మీనం
ఈరొజు వుదయమే గిన్నెస్ బుక్ వాళ్ళు ఫోన్ చేసి అత్య్ధిక పెళ్ళిచూపులు చూసిన వ్యక్తిగా మీ పేరు గిన్నెస్ బుక్ లో చోటు సంపాదించబోతోందని చెప్పడం మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇంతాకలం వివాహం ఆలశ్యం అవుతోంది అనే బాధ తప్ప ఇంత గొప్ప విజయం సాధించబోతున్నారని ఎరుగని మీరు విజయగర్వంతో విర్రవీగుతారు. ఏదేమైనా మీ విజయ రహస్యం మాత్రం మీ ముఖమే.  

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి