థాయిలాండ్
(పట్టయ , కోరల్ అయిలెండ్ )
ఈ వారం మనం పట్టయ నగరం గురించి తెలుసుకుందాం . మేము యీ నగరంలోనే ఒక సంవత్సరం వున్నాం .
ముందుగా మనం యీ నగరం గురించిన చరిత్ర తెలుసుకుందాం . బర్మా రాజులదాడుల నుంచి తప్పించుకోడానికి 16 వ శతాబ్దం లో రాజు ఫ్రయతక్ తరువాత తస్కిన్ గా పిలువబడ్డాడు , అప్పటి రాజధాని అయోథియ నుంచి సేనలతో చాంతాబురికి బయలుదేరినపుడు యీప్రాంతాల మీదుగా వెళ్లవలసి వస్తుంది . రాజు యొక్క యీ చర్యను సమర్ధించని ఈ ప్రాంతపు నాయకుడు రాజుపై యుధ్దం చేయనిశ్చయించుకుంటాడు , కాని రాజు యొక్క నిబద్దత , సైన్యం యొక్క క్రమశిక్షణ చూసి యుధ్దం విరమిస్తాడు . నాయకుడు ఆప్రాంతాన్ని ‘ థాప్ ఫ్రయ ‘ అని పిలువసాగేడు . థాప్ ఫ్రయ అంటే ఫ్ర యొక్క సైన్యం అని అర్దం , కాలాంతరం లో యీ ప్రదేశం ‘ పట్టయ ‘ గా మారిందట .
1960 లవరకు మామూలు చిన్న జాలరి పల్లెగా వున్న ‘ పట్టయ ‘ వియత్నాం యుధ్దం తరువాత విదేశీయుల దృష్టిలో పడి పర్యాటక ప్రదేశంగా రూపు దిద్దుకుంది . అమెరికా సేన వియత్నాం తో యుధ్దం చేసేటప్పుడు ‘ యు -తప ‘ మొదలైన ప్రదేశాలలో మిలిటరీ సిబిరాలు యేర్పరచుకొని , మావన సంచారం లేని దీవులలో యెక్కువ రోజులు గడపడం వల్ల సేనల మనోబలం దెబ్బతినగా సేనలలో కొత్త వుత్సాహం నింపడానికి దగ్గరగా వున్న జనావాస ప్రాంతమైన ‘ పట్టయ ‘ కి శలవులు గడపడానికి పంపుతారు . అమాయకులైన పల్లె ప్రజలు వారు చూపిన ప్రలోభాలకు లొంగి వారికి కావలసినవి వారికి అమర్చసాగేరు . అలా అమెరికా సైనికాధికారులు రాకపోకలు చేయ నారంభించేరు . అదే సమయంలో దేశాభివృధ్దిని దృష్టిలో పెట్టుకొని థాయిలాండు ప్రభుత్వం తమకు గల సముద్రతీరాన్ని వుపయోగించుకోవాలనే ఆలోచనతో ఓడరేవులను నిర్మించి రాయితీలు కల్పించి విదేశీ నావలను ఆకర్షించ సాగేరు . విదేశీ ఓడలు రేవులో లంగరులు వేసుకొని వారి అవపసరాలకు చేపలు పట్టుకొని జీవించే పల్లెవాసులలో ఆశలు రేకెత్తించి ‘ ఈజీ మనీ ‘ కి అలవాటు చేసేరు . ఇప్పుడున్న ‘ పట్టయ ‘ కల్చర్ అలా మొదలయింది . విదేశీ మారకద్రవ్యం మీద మోజుతో ప్రభుత్వం కళ్లుమూసుకు నడవడం కూడా ఓ కారణం .
విదేశీయులకోసం యెన్నో ఆకర్షణలు మొదలు పెట్టబడ్డాయి . చాలా పెద్ద సముద్రతీరం , యెన్నో చిన్నచిన్న ద్వీపాలు వుండడం తో పర్యాటకులలో గుర్తింపు పొందింది .
చిన్నపెద్ద అన్ని తరగతులవారికి అందుబాటులో వుండే వసతులు అందుబాటులో వున్నాయి . అయితే మార్చ్ నుంచి సెప్టెంబరు వరకు ఆఫ్ సీజనుగా పిలువబడే సమయంలో మాత్రమే మనకి రూములు దొరుకుతాయి . సీజన్ లో మొత్తం ఆరునెలలూ రూములు బుక్ అయేవుంటాయి , ఒక్కరే మొత్తం ఆరునెలలకూ రూములు అద్దెకు తీసుకోడం ఆశ్చర్యాన్ని కలుగజేసింది , అదీ సీనియర్ సిటిజన్స్ యెక్కువగా వుండడం కూడా మా ఆశ్చర్యానికి ఓ కారణమే . వివరాలలోకి వెళితే పశ్చిమ దేశాలలో శీతాకాలం తరచుగా మంచు కురుస్తూ వుండడంవల్ల గడపటం చాలా కష్టంగా వుంటుంది . థాయిలాండు వాతావరణం మరీ చలిగా కాకుండా వుండడం , ధరవరలు వారి దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా వుండడం వల్ల వారు శీతాకాలం ఆరునెలలూ యిక్కడ గడపడం చేస్తున్నారు . బీచ్ రోడ్డు పెద్దపెద్ద హోటల్స్ , బార్లతో పగలు చాలా నిశ్సబ్దంగా , సాయంత్రం నుంచి తెల్లవారేవరకు డిస్కో సంగీతం , కేబరే నృత్యాలతో హోరెత్తుతూ వుంటుంది .
థాయిలాండు లో పనివారి వేతనాలు చవుకగా వుండడం వల్ల బహుళ జాతీయ సంస్థలు యిక్కడ వారి కంపెనీలను స్థాపించేరు . దీనివల్ల ఆయా దేశాల నుంచి వుద్యోగస్థులు రావడం వల్ల కూడా పట్టయ నగరం మహానగరంగా రూపుదిద్దుకోడానికి దోహాదపడింది .
బీచ్ రోడ్డు , వెనుకనున్న మరో రెండు రోడ్డులు రాత్రయేసరికి రెడ్ లైట్ యేరియా గా మారిపోతాయి .
బీచ్ లు మాత్రం చాలా నీటుగా వుంటాయి , సముద్రపు నీరు కూడా స్వఛ్చంగా నీలిరంగులో వుంటాయి . రకరకాల బీచ్ స్పోర్ట్స , సీ ఫుడ్ పర్యాటకులకి అందుబాటులో వుంటాయి .
సూర్యుడు వున్నంత వరకు యిక్కడ విదేశీ పర్యాటకులు సేద తీరుతూ కనిపిస్తారు . బీచ్ రోడ్డులో రెండు , పక్కనున్నరోడ్డులో మరో రెండు యిండియన్ హోటల్స్ వున్నాయి . ఈ రోడ్డు మీద చాలా మాల్స్ వున్నాయి . మసాజ్ సెంటర్లకి కొదవలేదు . బీచ్ రోడ్డుని రెండు భాగాలుగా చెప్తారు . ముందు భాగం బార్లు , వ్యభిచార గృహలతో నిండి వుంటుంది , రెండో భాగం ధనవంతుల బిల్డింగులతో నీటుగా వుంటుంది . ఈ రెండింటిని కలుపుతూ వాకింగ్ స్ట్రీటు వుంటుంది . వాకింగు స్ట్రీటు గురించి చెప్పుకోవాలంటే విలాసవంతులకు కావలసినవన్నీ అందుబాటులో వుండే ప్రదేశం అని చెప్పుకోవచ్చు . రాత్రి యెనిమిది గంటలకి తెరవబడి ప్రొద్దుట వరకు హడావిడిగా వుండే ప్రదేశం . వీకెండ్స్ లో అయితే చెప్పనే అక్కరలేదు . చాలామంది థాయి లాండు టూరుకి చిన్నపిల్లలని , వయసులో వున్న పిల్లలని తీసుకువచ్చి విచారించడం చూసేం .
సైట్ సీయింగులలో చిన్నపెద్ద ద్వీపాల సందర్శనం వుంటుంది . అలాంటిదే ‘ కోరల్ అయిలెండ్ ‘ . వీటిలో భోజనం కూడా వుంటుంది . శాఖాహారం అంటే యేమిటో వీరికి తెలీదు . మనం కాఫీ , టీ , కోల్డ్ డ్రింకులతో సరిపెట్టుకోవాలి . కోరల్ అయిలెండు టూరులో ముందుగా బోటులో సముద్రం మీద ఓ ప్రదేశానికి తీసుకు వెళతారు , అక్కడ రకరకాలైన వాటర్ స్పోర్ట్స్ వుంటాయి , పారాచూట్ సహాయంతో సముద్రం మీద యెగరడం , బనానా బోట్ రైడింగ్ , వాటర్ స్కీయింగ్ , బైక్ రైడింగు లాంటివి యెన్నో వుంటాయి . వయసుతో సంబంధం లేకుండా పర్యాటకులు పాల్గొనడం మనలో కూడా హుషారు నింపుతుంది . అక్కడ రెండుగంటలు గడిపేక తిరిగి బోటులో సముద్రం లో కొంతదూరం తీసుకు వెళతారు . అక్కడ మనలని పెద్ద బోటు లోంచి చిన్న బోటులోకి మారుస్తారు , చిన్న బోటులో మరికొంత దూరం ప్రయాణించేక కాళ్ల దగ్గర వున్న పలకలని తొలగిస్తారు . పలకల క్రిందనుంచి సముద్రం కనిపిస్తూ వుంటుంది . అంటే నావ క్రిందభాగం గాజుతో చేసి వుంటుంది . ఆ జలాలు యెంత స్వఛ్చంగా వుంటాయంటే సముద్రం లోపల వున్న జలచరాలు , నాచు మొదలయినవన్నీ చాలా బాగా కనిపిస్తాయి . ఓ పదినిముషాల తరువాత తిరిగి మనని మన పెద్ద బోటులోకి మారుస్తారు . అక్కడనుంచి పెద్దబోటు కోరల్ అయిలెండు చేరుతుంది . సముద్రం లో వున్న పగడాలు , జలచరాలను చూడడం యీ బోటు ప్రత్యేకత .
కోరల్ అయిలెండు చాలా చిన్న ద్వీపం , యిక్కడ చిన్న చిన్న బార్లు , సీఫుడ్ రెస్టోరెంట్స్ తప్ప మరేమీ వుండవు . కూర్చోడానికి యేమీ వుండవు , కూర్చోడానికి కుర్చీ కావాలంటే నూరు , టవలు అద్దెకి కావాలంటే నూరు రూపాయలు వసూలు చేస్తూ స్థానికులు బతికేయడం కనిపిస్తుంది . సాయంత్రా కి కుర్చీలవాళ్లు , రెస్టొరెంట్స్ వాళ్లు వారివారి సామాను బోట్లలో వేసుకొని పట్టయ చేరుకుంటారు , పొద్దున్నే తిరిగి కోరల్ అయిలెండ్ కి వెళతారు . ఎందుకలాగ అంటే హై టయిడ్స్ వల్ల వారి సామాను పాడవడమో , కొట్టుకు పోవడమో జరగకుండా అని అంటారు .
మిగతా విశేషాలు వచ్చేవారం చదువుదాం అంతవరకు శలవు .