ప్రతాప భావాలు! - -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

నా చదువు - 2 !

సరే, ఎంట్రన్స్ లో సీట్ వచ్చిందని చెప్పానుగా! ఒక శుభముహూర్తాన వెళ్లి మాసాబ్ ట్యాంక్ లోని పాలిటెక్నిక్ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకున్నాను.

కాలేజ్ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకు. ఎంతో ఉత్సాహంతో చేరిన నేను రెండు మూడు రోజులు కాలేజీకి వెళ్లాక తెలిసిందేమిటంటే, పార్ట్ టైం కు కూడా డే టైం ప్రిన్సిపలే, అలాగే లెక్చరర్లూనూ. అందుచేత పొద్దున్నంతా వాళ్లు అలసిపోయి ఉంటారు కాబట్టి, వస్తే రావచ్చు, లేకపోతే లేదని. ఎంత నిరాశ కలిగిందంటే చెప్పలేను.

డే కాలేజ్ లో చదువు వేరు, పార్ట్ టైం చదువు వేరు. వివిధ కారణాలవల్ల రెగ్యులర్ గా చదువుకోలేకపోయిన, ఉద్యోగాలు చేస్తూ చదువుకోవాలనుకునే వాళ్ల కోసం (ఉద్యోగం చేస్తున్నట్టు ఆధారం చూపించాలి)ఏర్పాటు చేసిన విద్యా విధానం పార్ట్ టైం చదువు అనేది . కొంతమంది సంస్థల్లో ప్రమోషన్లిచ్చే, సర్టిఫికేట్ కోసం చదువుకోవచ్చు కాని నాలాంటి వాల్లు మాత్రం చదువుమీద ఉన్న అభిమానంతో, తపనతో చదువుకుంటారు.

మా సీనియర్లు మాతో ‘మనకు మనమే చదువుకోవాలి. ప్రాక్టికల్స్ మాత్రం జరుగుతాయి. W. V. రమణ కుమారి సైక్లోస్టైల్డ్ నోట్స్ దొరుకుతాయి అవి (నాకు గుర్తున్నంతలో, కాకినాడనుంచనుకుంటా) తెప్పించుకుని, లేదా సీనియర్స్ నుంచి తీసుకుని చదువుకుంటే పాసయిపోతాం’ అని జ్ఞానోపదేశం చేశారు.

నేనూ, శ్రీనివాస్ అనే కూకట్ పల్లి నుంచి వచ్చే అతను ఆఫీసు అయిపోగానే బస్సులెక్కి ఠంచనుగా కాలేజ్ కు ప్రెజెంట్ అయ్యేవాళ్లం. చాలామంది ఫస్ట్ గేట్ లోంచి బైక్ తో ఎంటర్ అయ్యి, బయట పోర్టికోలో సిమెంట్ బెంచ్ లాంటి దాని మీద కూర్చున్న మమ్మల్ని ‘సార్ వచ్చాడా?’ అని అడిగేవాళ్లు. మేము‘ రాలేదని’ చెప్పంగానే తుర్రుమని వెళ్లిపోయే వాళ్లు. మేము మాత్రం ఒక్కరోజూ కూడా మానే వాళ్లం కాదు. అయితే కొంతమంది లెక్చరర్లు మాత్రం వచ్చేవాళ్లు. కానీ చాలా తక్కువమంది. అందులో డ్రాయింగ్ సర్ నిరంజన్ గారొకరు. అలా వచ్చేవాళ్లకి మేము బాగా తెలుసు.

ఫస్ట్ ఇయర్ ఇలా జరుగుతుండగా, మా దగ్గరకు సీనియర్లు వచ్చి ‘మీరు మాథ్స్ మాత్రం రాయొద్దు. చాలా టఫ్. అన్నీ రాసి, ఆర్నెళ్ల తర్వాత మాథ్స్ ఒక్కటీ రాద్దురుగాని పాసయిపోవచ్చు’ అని ఉచిత సలహా ఇచ్చేవాళ్లు. అలా వాళ్లు చెప్పగా, చెప్పగా, మేము వినగా, వినగా మా మనసులో అనుకోకుండానే మాథ్స్ అంటే భయం (ఫోబియా)పట్టుకుంది.

ఫైనల్ ఎక్జామ్స్ ఫీజు కట్టి అన్ని పరీక్షలూ రాస్తుంటే, రేపు మాథ్స్ అనగా నా ఫ్రెండొకతను ’నాకు డౌట్స్ కొన్ని ఉన్నాయి, అవి రేపు మనం కలిసినప్పుడు డిస్కస్ చేద్దాం’ అన్నాడు.

’నేను వెంటనే, రేపు మాథ్స్ కదా! నేను ప్రిపేర్ అవలేదు సప్లీలో రాస్తాను. మనం తర్వాతి పరీక్షలో కలుద్దాం’ అన్నాను.
అతను  వెంటనే ’ఎలాగూ ఫీజ్ కట్టావు కదా, వచ్చి జస్ట్  పేపర్ చూడు, పేపర్ తీసుకుని గంటలో వెళ్లిపోదువుగాని, నీకు రిఫరెన్స్ కన్నా పనికొస్తుంది అన్నాడు’ అన్నాడు.

‘సరే’ అన్నాను.

మరుసటి రోజు పరీక్షకి వెళ్లాను. హాల్లోకి వెళ్లి పేపర్ తీసుకున్నాను. అప్పటిదాకా నాకు ఏ ఫీలింగ్ లేదు. నేను ప్రిపేర్ అవ్వలేదు దట్సాల్.
ఎగ్జామ్ స్టార్ట్ అయింది.

అందరూ రాస్తున్నారు...ఒక్క..నేను..తప్ప..

సంవత్సరం సమయం ఆ సబ్జెక్ట్ చూడకుండా చాలా తప్పు చేశాను. అంటే సంవత్సరం పోగొట్టుకున్నట్టే..

పరీక్ష రాస్తున్న వాళ్లందర్నీ చూస్తుంటే అప్రయత్నంగా కళ్లలో నీళ్లు తిరిగాయి.

ఆ రోజు ‘ఇహ నుంచీ చదవకుండా కాలం వృధాచేసి, పరీక్షలు రాయడానికి వెళ్లకూడదు’ అని మనసులో స్థిర నిర్ణయం తీసుకున్నాను. అది పాటించాకూడా!

జీవితంలో కొంతమంది ఇన్ఫ్లూఎన్స్ చేస్తారు. అది మంచి అయితే ఫర్వాలేదు. చెడు అయితే మనం జీవితంలోని కొంత సమయాన్నీ, జీవితాన్నీ కోల్పోతాం. అందుకే ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా ఫాలో అవకుండా ప్రశాంతంగా, తార్కికంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అనిపించింది. అదే నాకు కాలం చెప్పిన గుణపాఠం.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు