చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఒకానొకప్పుడు తీర్థయాత్రలు చేయడం జీవితంలో ఓ ముఖ్యభాగంగా ఉండేది… పెద్దవారు చెప్పగానో, లేక  ఎక్కడో చదివో, “ మనం కూడా ఓసారి అక్కడకి వెళ్ళిరావాలిరా… అబ్బాయీ… “  అని  పెద్దవారి మాట విని, శలవు పెట్టుకుని అక్కడెక్కడికో వెళ్ళి వారి కోరిక తీర్చేవారు….. సావకాశం కుదరకపోతే , ఏ  Yatra Special  లోనో పంపేవారు.  ఈ  Specials  వాళ్ళు కూడా, ఓ పదిపదిహేను రోజుల్లో , ఓ పాతిక  స్థలాలు చూపించి పుణ్యం కట్టుకునేవారు.  అయినా ఆరోజుల్లో ఈ స్థలాలు మనకి తెలుసున్నవి ఎన్ననీ.. ఓ కాశీ, ఓ ప్రయాగ, చార్ ధాం , దక్షిణాదిలో ఓ రామేస్వరం, కంచి, తిరుపతీనూ..

రానురాను  వివిధ టీవీ చానెళ్ళ ధర్మమా అని, మనకి తెలియనివీ, ఎప్పుడూ విననివీ, ఎన్నో ఎన్నెన్నో స్థలాల గురించి తెలుస్తోంది.  చిత్రం ఏమిటంటే, ఏ స్థలం గురించి చూపించినా, చివరలో “ ఈ క్షేత్రం దర్శించకపోతే అసలు మానవజన్మే వ్యర్ధం .. “ అనడం. నిజమే కాబోసనుకుని, ఇంట్లోవాళ్ళని కంగారు పెట్టేయడం. “ ఫలానా క్షేత్రం చూడకపోతే  నెత్తిమీద శని వదలడుటరా అబ్బాయీ.. అందుకేనేమో నువ్వేం చేద్దామనుకున్నా అసలు జరగడమే లేదూ… “ అంటూ  ఊదరకొట్టేస్తారు… మంచిదే ఎవరి నమ్మకాలు వారివీ.. కానీ  Yatra Specials  వారు వాళ్ళ   Trip  లో ఇవన్నీ చూపించరే.. ఎలాగా మరి? ఏదో మొత్తానికి అంచెలంచెలుగా ఆ ప్రదేశానికి వెళ్ళడం, అక్కడే ఉండే ఏ సత్రం లోనో బసచేసి, వీలునిబట్టి చుట్టుపక్కలుండే ఇంకొన్ని  ప్రదేశాలు కూడా దర్శించి పుణ్యం మూటకట్టేసికోవడం… ఇక్కడ ఓ విషయం గమనించాలి—టీవీలో చూపించినంత  హడావిడేమీ ఉండదు. సదుపాయాలుకూడా అంతంత మాత్రమే.. ఓ పదిమందికి వెళ్ళొచ్చామని చెప్పుకోవడానికి తప్ప , అనుభవించిన ఆనందం మాత్రం బహుతక్కువే…

టివీ ల్లో చూపించేవన్నీ, ఆ   స్థలాల ని  చాలామంది దర్శించుకుని, ఆదాయం పెంచడానికి కూడా కావొచ్చు. వారు చెప్పేవన్నీ అసత్యాలని కాదూ,  కానీ ఉన్నదానికి మరింత జోడించి చెప్పడంలో టీవీ చానెల్లవాళ్ళు సిధ్ధహస్తులే… పోనీ ఏ ఉత్సవాల టైములోనే వెళ్ళొద్దామా అనుకుంటే, జనసందోహం  ధర్మమా అని  దైవదర్శనం మాట దేవుడెరుగు, వసతి సౌకర్యాలుకూడా అంతంతమాత్రమే. పోనీ ఏదో తిప్పలుపడి, చేంతాడంత  క్యూల్లో నుంచున్నా, ఆ దైవదర్శనం క్షణమాత్రమే..  పలుకుబడి అంటూ ఉంటే, ఇంకో నాలుగు క్షణాలదర్శనం !!! ఈమాత్రందానికి అతంత దూరాలువెళ్ళి దర్శనాలు చేసుకోవడం అంత అవసరమా అనే ఆలోచనకూడా వస్తూంటుంది.  అలాగని చూడ్డం మానేస్తే ఏం కొంపమునుగుతుందో అని భయం.

ఇంక ఈ గొడవలన్నీ భరించలేక, మన ప్రముఖ దేవాస్థానాలవారు , వారి కార్యకలాపాలన్నీ అంతర్జాల పరిధిలోకి తెచ్చేసారు.  ఏ దేవాలయానికైనా వెళ్ళాలనుకుంటే, వారి లింకు తెరవడమూ, మన దర్శన, వసతి వ్యవహారాలన్నీ  Online  లో  book  చేసేసి కోడమూనూ… పైగా ఏ సేవ చేయిద్దామనుకుంటామో దానిక్కూడా బుక్కింగే.. డబ్బులు కట్టేసి, హాయిగా వాళ్ళిచ్చిన రసీదులు తీసికెళ్తే, అన్ని పనులూ చకచకా జరిగిపోతున్నాయి…

చూద్దామని ఉండీ, అనారోగ్య కారణాలవలన దర్శనానికి వెళ్ళలేకపోయేవారికి,  మన టీవీ చానెళ్ళవాళ్ళు, మరో సదుపాయంకూడా  సమకూర్చేసారు. ఆ దేవాలయాల్లో ఉదయం సుప్రభాతం దగ్గరనుండీ, రొజంతా జరిగే సేవలూ, చివరకు జరిగే పవ్వళింపు సేవ దాకా  ప్రత్యక్ష ప్రసారాలద్వారా వీక్షించే సౌలభ్యం. హాయిగా ఇంట్లోనే కూర్చుని, దైవదర్శనం చేసుకోవచ్చు… పైగా ఆ కెమేరాల ధర్మమా అని, ఆ దేవుణ్ణి మరింత స్పష్టంగా చూడొచ్చు… పుణ్యం పురుషార్ధమూనూ..

అలాగే ఏవైనా ఆటలపోటీలు జరిగినప్పుడు కూడా, వాటి ప్రత్యక్ష ప్రసారాల ధర్మమా అని, ఆ స్టేడియం కి వెళ్ళి, ఎక్కడో వందల అడుగులదూరం నుండి కాకుండా,  close up  లో చూడొచ్చు… అయినా టిక్కెట్టు కొనుక్కుని, ఆ తొక్కిసలాటలో ఆట చూడ్డం కొందరికి పిచ్చీ..ఆ హడావిడంతా స్వయంగా అనుభవిస్తేనే అసలు కిక్కంతా అంటారు కొంతమంది. ఎవరి ఆనందం వారిదీ…

వీటివలన టీవీలవాళ్ళకి వ్యాపారమూ పెరిగింది. అది ఓ భక్తి అయినా, రక్తి అయినా ఒకటే..

సమాచార వ్యవస్థలో జరిగిన అనూహ్యమైన మార్పుల వలన ఈ రోజుల్లో ప్రతీదీ, మన నట్టింట్లోకి వచ్చింది.. అందుకేనేమో పాత రోజుల్లా కాకుండా, నట్టిల్లుని  నెట్టిల్లు గా మార్చేసారు…

సర్వేజనా సుఖినోభవంతూ….

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి