శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

Sri Swamy Vivekananda

కొన్నిరోజులు ఆళ్వారు నగరంలో వున్న నరేంద్రుడు జయపురం వెళ్ళాడు. అక్కడ్నుంచి అతడు యూబ్ పర్వతానికి వెళ్లి ఒక గుహలో కొంతకాలం పాటు తపస్సు చేశాడు. ఆ తర్వాత క్షేత్రీ మహారాజును కలుసుకొని తన అసామాన్య ప్రతిభవల్ల రాజును తన శిష్యుడుగా మార్చుకొనగలిగాడు. పిమ్మట నరేంద్రుడు "లింబ్డి" అనే నగరానికి వెళ్లి ఒక మఠంలో బసచేశాడు. అందులో వున్న కొందరు క్షుద్రదేవతో పాసకులు, నరేంద్రుని బ్రహ్మచర్య వ్రతం విడిచిపెట్టి తమ సాధనాలకు తోడ్పడమని నిర్భంధం చేయసాగారు. నరేంద్రునకది ఎంత మాత్రమూ ఇష్టం లేదు. వారు దౌర్జన్యంగా నైనా అతనిని ఒప్పించాలని ప్రయత్నించసాగారు. నరేంద్రుడది గ్రహించి ఒక బాలుని ద్వారా, మహారాజుకి ఒక లేఖ వ్రాసి పంపగా, రాజభటులు వచ్చి అతని అపాయాన్ని తప్పించారు.

అనంతరం నరేంద్రుడు అన్ని నగరాలు పర్యటిస్తూ పూనా చేరి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ను దర్శించి ఆయనకతిదిగా వుండి అనేక సమస్యలపై ఆయనతో చర్చించారు. నరేంద్రుడు మరికొన్ని పట్టణాలు సందర్శించి మైసూరు చేరుకున్నాడు. మైసూరు మహారాజు నరేంద్రుని రూపురేఖలు చూడగానే, ఆశ్చర్య చకితుడై, బ్రహ్మాండమైన స్వాగతమిచ్చాడు. అక్కడ ఏర్పాటు చేసిన ఒకసభలో వేదాంత సారము గురించి నరేంద్రుడు ఇచ్చిన మహోపన్యాసానికి ప్రతివారు పరవశులయ్యారు. మైసూరు దివాను నరేంద్రునకు విలువగల బహుమతులివ్వబోయాడు. కానీ నరేంద్రుడు వాటిని తీసుకోలేదు. ఇలాగే అతడు మరికొన్ని ప్రాంతాలను కూడా సందర్శించి, ఆయా ప్రజలకూ, ప్రభువులకూ మతభోధలు చేసి కన్యాకుమారి, ఆగ్రా నగరాలకు ప్రయాణమయ్యాడు.

నరేంద్రుడు సముద్రాన్ని ఈది కన్యాకుమారి శిలాతపనకూర్చుని తీవ్రధ్యానంలో నిమగ్నుడయ్యాడు. ఆధ్యానంలో అతని కళ్ళ ఎదుట సోదర భారతీయులు దారిద్ర్యాది ఘోరావస్థలు ప్రత్యక్షంగా కనిపించాయి. "ఆకలి బాధతో అలమటించిపోతూ అన్నం కొరకు విలపించే అభాగ్యులకు మతబోధలెందుకు" అన్న రామకృష్ణ గురువరేణ్యుని అమూల్య వాక్యాలతని చెవులలో మారుమ్రోగసాగాయి. "నిరక్షరాసులైన - నిరుపేదలైన సామాన్యజనుల్ని ఉద్ధరించనిదే మోక్షం లేదు" అని అతడు నిర్ణయించుకున్నాడు. అయితే చిల్లిగవ్వలేని సన్యాసి ఇటువంటి మహత్కారాన్ని ఎలా నిర్వహించగలడు? ఈ నిరాశతోనే అతను కొద్దిసేపు తటపటాయించి చివరకు, పాశ్చాత్యదేశాలకు వెళ్లి తన స్వశక్తి వల్ల అవసరమైన ధనాన్ని ఆర్జించి తిరిగివచ్చి మాతృదేశోద్ధారణకు పాటుపడాలనీ, లేదా ఆ ప్రయత్నంలో తన ప్రాణాలనైనా సమర్పించాలనీ ప్రతిజ్ఞ పూనాడు.

నరేంద్రుడు కన్యాకుమారి నుండి 1892 వ సంవత్సరంలో మద్రాసు చేరుకున్నాడు. ఈ శుభవార్త తెలియగానే ఆయన దర్శనం కోసం, ఉపన్యాసము కోసమూ వేలాది మంది ప్రజలు రాసాగారు. చాలామంది యువకులు నరేంద్రుని శిష్యులై అతని కొరకు తమ ప్రాణాలను సైతం అర్పించటానికి సంసిద్ధులయ్యారు. సనాతన ధర్మ సందేశాన్నిపశ్చిమ ఖండ ప్రజలకు అందచేయటానికి నరేంద్రుడు నిశ్చయించుకున్నట్లు తెలియగానే మద్రాసు యువకులు అమితోత్సాహంతో ఆయనకు కొంత ధనాన్ని ప్రోగుచేసి ఇచ్చి, చికాగోలో జరగనున్న విశ్వమత మహాసభకు వెళ్ళవలసిందని కోరారు. కానీ అప్పటికింకా అతని ప్రయాణం నిశ్చయంకాకపోవటం వల్ల ఆధనాన్ని బీదలకు పంచిపెట్టి వేశాడు నరేంద్రుడు.

ఇంతలో హైదరాబాద్ వారు నరేంద్రుని ఆహ్వానించగా అతడచ్చటకు వెళ్ళి మతవిషయాలపై ఉపన్యాసాలిచ్చాడు. హైద్రాబాద్ నవాబు కూడా నరేంద్రుని పాండిత్యానికి, ఉపన్యాసధాటికీ ఆశ్చర్యపడి అతని పశ్చిమఖండయాత్రకు కావలసిన దనం ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. క్షేత్రీమహారాజు కూడా నరేంద్రుని విదేశీప్రయాణం సంగతి తెల్సుకుని అతనిని పిలిపించి తన కార్యదర్శి ద్వారా అన్ని సదుపాయాలనూ కలిగించి బొంబాయికి ప్రయాణం చేయించాడు.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు