అతి సామాన్య కుటుంబం నుండి అమెరికాలో సెటిలయ్యేంతగా ఎదిగాడో యువకుడు. లక్షల్లో జీతం.. కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న డాలర్లు ఇవేమీ అతనికి ఆనందాన్నివ్వలేదు. ఊళ్లో వ్యవసాయం చేసుకుంటే ఆ కిక్కే వేరప్పా అన్న భావన అతనిలో ఉంది. కానీ, హోదా తగ్గిపోతుంది, నలుగురిలో పలుచన అయిపోతాననే చిన్నపాటి సమస్యే అతన్ని వెనక్కి లాగేసింది. దాంతో ఆలోచించి, ఆలోచించి, ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఊళ్లో స్నేహితుడికి ఫోన్ చేశాడు. తన ఆలోచన గురించి చెప్పాడు. ఆ తర్వాత వ్యవసాయం గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. విదేశాల్లో అనుసరిస్తున్న సాంకేతిక పద్థతుల్ని భారతదేశంలో ఎంతవరకూ అనుసరించగలం అని అధ్యయనం చేశాడు. స్కెచ్ ప్రిపేర్ చేసుకున్నాడు. అందుకు తగిన ఏర్పాట్లు సొంతూళ్లో చేశాడు.
ఉద్యోగం మానక్కర్లేదు. అమెరికా నుండి కదలక్కర్లేదు. అంతా ఆన్‌లైన్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల గురించి తెలియచేశాడు. దాంతో ఊళ్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఇదంతా సినిమాటిక్‌గా ఉంది కదా. కానీ నిజంగా నిజం. నిజ జీవితంలో రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోవు. కానీ మార్పు దిశగా ముందడుగు అయితే పడింది. వ్యవసాయమే కాదు, పల్లెటూరి విద్యార్ధులకు పాఠాలు, నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో శిక్షణ, వ్యాపారంలో మెలకువలు, ఆరోగ్యం పట్ల అవగాహన, రాజకీయాలపై చైతన్యం ఇలా ఒక్కటేమిటి విదేశాల నుండి దేశంలో వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డవారు అక్కడి నుండే ఊరు బాగు కోసం ప్రయత్నిస్తున్నారు. నేటి యువతే రేపటి భవిష్యత్తు. యువత ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్నట్లే కనిపిస్తోంది.
చేస్తున్న పని మానేయాల్సిన అవసరం లేదు. ఉన్న చోట నుండి కదలాల్సిన పని అసలే లేదు. సాంకేతిక పరిజ్ఞానం అందించిన వెసులుబాటు ఇది. మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్ టాప్, వీడియో ప్రొజెక్షన్ తదితర గాడ్జెట్స్ వినియోగంతో యంగ్ తరంగ్ దేశ భవిష్యత్తును అందంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తోంది. దురదృష్టవశాత్తూ ఈ అద్భుతాలకు ప్రచారం చాలా తక్కువగా జరుగుతోంది. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, రాజకీయ కుట్రలు వంటి వాటికి మీడియాలో దక్కుతున్న ప్రాధాన్యత, మంచి విషయాలకు దక్కడం లేదు. ప్రేమోన్మాది ఓ యువతని చంపేస్తే ఆ ఘటనకి టీఆర్‌పీ రేటింగ్స్ అదిరిపోతాయ్. అదే ఓ యువకుడు ఓ ఊరిని బాగుచేశాడని చెప్పడానికి మీడియాకి తీరిక ఉండడం లేదు. అందుకే సోషల్ మీడియా వేదికగా యువత తాము చేయాలనుకున్న మంచి పనుల్ని అందరికీ తెలియచేస్తూ, సమాజ పురోగతికి తమ వంతు కృషి చేస్తోంది.