విశ్వరూపుడు : అయ్యయ్యో....నీవు అస్త్ర సన్యాసం చేసేశావంటగా ఏం పాపం?
సముద్ర వేషుడు : ఔను...అస్త్ర ప్రయోగ మంత్రాలూ, ఉపసంహరణ మంత్రాలూ తలచుకుంటే గుర్తు రావడం లేదు.!
......................................................
చప్పసేన : మన శ్రీలంకలో, కొండరాళ్ళు దొర్లే చప్పుళ్ళొస్తున్నాయే?
లావునాయిక : రావణుల వారు పళ్ళు పటపట కొరుకుతున్నారు !
చప్పసేన : ఎందుకేం?
లావునాయిక ( రహస్యంగా ) మిధిలలో సీతారాముల కళ్యాణం జరుగుతోంది. ! బాజాభజంత్రీలు ఇక్కడిదాకా వినవస్తున్నాయి..!
...........................
పాతాళాసురుడు : ఇదుగో...ఆ వచ్చేదెవరో తెలుసా? బకాసురుడు !
అధః పాతాళాసురుడు : ఆ ..తెలుసు ! ఏం చేస్తాడేం ? ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేరకం అంతేగా?
పాతాళాసురుడు : హు...హు...అతడి ముక్కు చూశావా ? ఆవులిస్తే పేగులు భోంచేస్తాడు....చచ్చూరుకుంటావు..! నోరు గట్టిగా మూసుకు కూర్చో...!
......................................
సోమయ్య : రాజుగారు, రహదారికిరువైపులా చెట్లు నాటమన్నారు. వాటికి నీళ్ళుపోయడానికి, బావులు తవ్వమన్నారు. తాపీవాళ్ళనీ, కూలీలనూ రప్పించి , సత్రాలూ, చావడీలూ కట్టిస్తున్నారు. బావి తవ్వకాలు పూర్తయ్యాక, అందర్నీ పనుల నుంచి తీసేస్తారా?
భీమయ్య : తీసేయరు, బావుల్లో పూడిక తీతలకి సత్రాల మరమ్మత్తులకీ మనుషులు కావాలిగా ..!
.............................
వంకర నాయుడు : ఇమంట్లో తాబేలు దూరితే , ఇల్లు ఖాళీ చేయాలిటగా ?
టింకర రెడ్డి : ఔను, నిస్సందేహంగా !
వంకర నాయుడు : మరైతే కోటలో దూరితేనో?
టింకర రెడ్డి : ఇల్లయినా, కోటయినా ఒకటే..!
వంకర నాయుడు : ఐతే మూటాముల్లే సర్దుకో !
టింకర రెడ్డి : ఎందుకూ?
వంకర నాయుడు : తాబేలొకటి కోటలో దూరింది!!
................................
లెక్కలయ్య : వురేయ్, శెట్టి గారి లోగిలికి, బంగారు కుండలూ, వెండి కుండలూ, మట్టి కుండలూ కావాలి. ఇంద డబ్బులు., బజారుకెళ్ళి కొనుక్కు రా !
పసలయ్య : ఇన్ని రకాల కుండలెందుకు లెక్కలయ్యా?
లెక్కలయ్య : వంటనీటికీ, తాగునీటికీ బంగారు కుండలూ, స్నానానికి వెండి కుండలూ, ( రహస్యంగా) మరుగుదొడ్లకి మట్టి కుండలూ...పో...!
..................
మహారాజు : మహామంత్రీ ! గుర్రప్పందాలకు అశ్వాలన్నీ సిద్ధంగా వున్నాయా?
మహామంత్రి : సిద్ధం చేశాం ప్రభూ!
మహారాజు : రౌతులకి తగిన శిక్షణ ఇచ్చారా?
మహామంత్రి : మాంఛి తర్ఫీదు యిచ్చాం ప్రభూ ! ( రాజు గారి చెవిలో రహస్యంగా) ఏ పందెంలో, ఏ రౌతు గెలవాలో కూడా నిర్ణయించేశాం ప్రభూ!
మహారాజు : అద్దీ....ఆలస్యం దేనికీ? పందాలు ప్రారంభించండీ!!
.........................................
తొట్టిరాజు : ఆఁ...మన విదూషకుడు బావిలో దూకేశాడా....ఎందుకూ?
మట్టిమంత్రి : నవ్వించి, మన కడుపులుబ్బిస్తాడు.....తన కడుపెందుకు ఉబ్బదూ అని తమరు తిట్టారుగదా...అందుకనీ...
తొట్టిరాజు : వెంటనే విదూషకుడ్ని రక్షించండి.
మట్టిమంత్రి : బావిలో చుక్క నీటిని మిగల్చకుండా , తాగి పొట్టవుబ్బి, మరణించాడు రాజా..!!
.........................
ఈటె భటుడు : పల్లకీని రాజుగారూ, రాణీగారూ మోస్తున్నారే? పల్లకీ మోసే వాళ్ళెక్కడ?
కత్తిభటుడు : విశ్రాంతి సమయంలో పల్లకీమోసేవాళ్ళతో పాచికలాడి పందెం కాసి రాజూ, రాణీ ఓడిపోయారు !
ఈటె భటుడు : పల్లకి మోసేవాళ్ళెక్కడా?
కత్తిభటుడు : పల్లకీలో వున్నారు.
.......................
చెక్క రాక్షసుడు : నీకెందుకు నరుడంటే అంతసహ్యం?...కోపమా?
తొక్క రాక్షసుడు : వాడు తినని ఆహారంతో మేపి, రుచికరమైన మాంసం తింటాడు చూడూ, అందుకూ, వాడంటే అసహ్యం !
చెక్క రాక్షసుడు : ఏ జంతు మాంసం?
తొక్క రాక్షసుడు : పంది!!