ఒకానొకప్పుడు ఎవరైనా ఏ పనైనా చేయాల్సొస్తే, స్వయనా చేసుకోవడమో, మహా అయితే ఆరోగ్యరీత్యానో, వయసురీత్యానో ఇంకోరెవరిచేతో చేయించుకునే వారు. అలాగే ఏదైనా తెలియకపోతే , స్కూల్లో ఉపాధ్యాయులనో, లేక ఇంట్లో ఉండే ఏ పెద్దవారినో అడిగి తెలుసుకునేవారు.
ఉదాహరణకి ఏ లెక్కలో తెలియకపోతే, ముందుగా ఎక్కాలు బట్టీపట్టించేవారు., దీనితో ప్రతీదీ లెక్కకట్టడం సులభంగా వచ్చేది. కొంతమందైతే నోటితోనే లెక్కలు కట్టేవారు—చాకలీ, పాలవాడూ లాటివారు. వాళ్ళకి లెక్కకట్టడానికి ఓ పేపరూ, పెన్సిలూ అవసరమయేవికావు. అలాగని వాళ్ళేమీ పెద్దపెద్ద చదువులు చదివేరనీ కాదు. వ్యాపారంలోకి వచ్చిన తరవాత, కనీసం లెక్కలైనా వచ్చుండాలని ఓ దృఢనిశ్చయం లాటిదన్నమాట.. నోటిలెక్కలు రాని, ఏ వ్యాపారస్థుదూ ఉండేవారు కాదు. అలాగే మన ఇళ్ళల్లో మన అమ్మలూ, అమ్మమ్మలూ కూడా, బయటకెళ్ళి చదువులు చదవకపోయినా, రాయడం, చదవడం, అలాగే లెక్కలు కట్టడం కూడా సునాయసంగా వచ్చేసేది.. Degrees లేకపోయినా, పెద్దపెద్ద రచనలు చేసేవారు… ఎవరిపనులు వారు చేసుకోవడంలోనే ఆనందం పొందేవారు. దీనివలన ఇంకో ఉపయోగమేమంటే, ఆ పనిలో ఉండే సుళువులు కూడా తెలిసేవి, ఇంకోరికి చెప్పగలిగే స్థితిలో ఉండేవారు… ఎవరిపని వారే చేసుకోవడంతో, తమ ఆరోగ్యాలుకూడా బావుండేవి. శరీరంలోని అవయవాలకి , ఆ చేసే పని రూపేణా, మంచి Exercise కూడా ఉండేది. ఉదాహరణకి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, స్వంతంగా ఆలోచిస్తేనే కదా, మెదడుకి మేతలాటిదుండేదీ? అలాగే ఏపని స్వంతంగా చేసినా, సంబంధిత అవయవం, తుప్పుపట్టకుండా నాలుక్కాలాలపాటు పని చేసేదీ?
కాలక్రమేణా, విజ్ఞానమూ అభివృధ్ధి చెందిందీ, దానితో పాటు, సంబంధిత పనులకి కొన్నికొన్ని , పరికరాలూ, సాధనాలూ పుట్టుకొచ్చాయి… వీటిని ఏదో అత్యవసరానికి ఉపయోగించుకోవడం కాకుండా, ఎప్పుడుపడితే అప్పుడే ఉపయోగంలోకి వచ్చి, అవి లేకపోతే మన జీవితమే వ్యర్ధమన్నంతగా తయారైపోయాయి…దీనివలన మనుషుల్లో బధ్ధకం, ఊబకాయం, లేనిపోని ఆరోగ్యసమస్యలూ మొదలయ్యాయి… ఆ తరంవారికీ, ఈతరంవారికీ స్పష్టంగా కనిపించే తేడా ఇదే… ఇదివరకటిరోజుల్లో శుభ్రమైన తిండీ, గాలీ ఉండడంతో విడిగా వ్యాయామాలూ, పరిగెత్తడాలూ అవసరమయేవి కావు.. ఓరకమైన క్రమశిక్షణ ఉండేది… అలాగని ఇప్పుడు లేదా అనీ కాదూ, ఉంది.. కానీ ఏ పనిచేయడానికైనా దానికో మెషీనూ, అది బాగా పనిచేసినంతకాలమూ గొడవలేదు. ఏ కారణం చేతైనా మూలపడిందా, మనం వీధిన పడిపోతున్నాము..
ఉదాహరణకి, ఏ పచారీ కొట్టుకైనా వెళ్ళి పప్పులూ, ఉప్పులూ తీసుకున్నామనుకోండి, ధరని బట్టి, మొత్తం ఎంతయిందో నోటితో లెక్కకట్టడానికి బదులు, అదేదో Calculator ఉంటేనేకానీ, లెక్కకట్టే స్థితిలోలేరు… వాడి మెదడుకీ పనిలేదూ, వాడికీ పనుండదూ, .. బహుశా ఇదంతా Time saving అని ఈతరం వారు సమర్ధించొచ్చు, కానీ at what cost?
ఆ భగవంతుడు మనకి ఆలోచించడానికి మెదడనే ఓ అద్భుతమైన అవయవం ఇచ్చినప్పుడు, దాన్ని ఉపయోగించడానికి ఏం రోగం ? ఈరోజుల్లో ఏది చూసినా ఔట్ సోర్సింగే ( Out sourcing ) కదా, అందుకేనేమో మనుషులు కూడా, అదే రంధిలో పడ్డారు. వాడేవాళ్ళకీ, తయారుచేసేవారికీ కూడా లాభదాయకంగా ఉంటోంది. ఉపయోగించేవాళ్ళుండబట్టేకదా తయారయేదీ… ఉభయతారకంగా ఉంది….
టెక్నాలజీ ఎంతగా అభివృధ్ధి చెందిందో ఉదాహరణకి ఆమధ్యన కొత్తగా ఆవిష్కరించబడ్డ ALEXA అనే పరికరం… దాన్ని ఏదడిగితే అది చేస్తుందిట. ఏపనైనా చేస్తుందిట. ఏ సందేహమడిగినా క్షణాల్లో జవాబు చెప్పేస్తుందిట. మంచంమీద పడుక్కుని , లైటార్పేయాలన్నా, గాస్ కట్టేయాలన్నా, టీవీ కట్టేయాలన్నా, తలుపులు మూసేయాలన్నా… ఒకటేమిటి, మనం ఒకానొకప్పుడు స్వయంగా చేసుకునే పనులన్నీ “ జీ హుజూర్.. “ అంటూ చేసేస్తుందిట. కాపరాలుకూడా చేసేస్తుందేమో చూడాలింక…
దీనివలన ఉపయోగాలమాటెలా ఉన్నా, బధ్ధకం మాత్రం పెరగడం తథ్యం. ఒకానొకప్పుడు చదువుకునే పిల్లలు ఏదైనా సందేహం వస్తే, ఏ పుస్తకం లోనో చదివేవారు.. ఇప్పుడో, ఆ ALEXA ని అడిగితే చాలు. ఇంక ఆ పుస్తకాలూ, చదువులూ చట్టుబండలూ ఎందుకంటా?
టెక్నాలజీ అభివృధ్ధి చెందడం ఎంతో అవసరం, కానీ మరీ మనుషుల్లో బధ్ధకం, అలసత్వం పెరిగేటట్టుగానా? ఏమో కాలమే నిర్ణయిస్తుంది వీటి పరిణామాలు.. అవేవో తెలిసేదాకా హాయిగా సుఖపడ్డమే…
సర్వేజనాసుఖినోభవంతూ…