ప్రతాపభావాలు - ప్రతాప సుబ్బారాయుడు

pratapabhavalu

మా(నా)లావు!

లావు.

స్థూలంగా చెప్పలేని స్థూలకాయం.

ఎంతోమంది లావును పోగొట్టుకుని స్లిమ్ గా కనిపించాలని చాలా చాలా కష్టపడతారు. ఎంతో తాపత్రయపడతారు.

మాలావు యుద్ధం(గో తెలుగులో నాకథ: http://www.gotelugu.com/issue99/2607/telugu-stories/maalaavu-yuddham/) చేస్తారు. కానీ ఎక్కడో ఒకరిద్దరు తప్ప సక్సెస్ కారు.

నేనూ వాళ్లలో ఒకణ్ని. చిన్నప్పట్నుంచీ నేను లావే!

చిన్నప్పుడు నన్నెవరన్నా లావని ఎక్కిరించినప్పుడు వెంటనే అన్నం మానేసే వాడిని, విపరీతంగా వాకింగ్, ఎక్సర్ సైజెస్ చేసే వాడిని, దానివల్ల లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. మా నాన్నగారు నన్ను హాస్పిటల్స్ చుట్టూ తిప్పి ఆ వ్యాధులు తగ్గించేసరికి తలప్రాణం తోక్కొచ్చేది (అంటే నాకు తోకుందని కాదండోయ్, ఏదో మాట వరసకి). డాక్టర్లు "లావుండడం సమస్య కాదు, శరీరం ఆరోగ్యవంతంగా లేకపోతేనే చిక్కులు! ఇలా ఒక్కసారిగా వెయిట్ లాస్ కోసం ట్రై చేయకూడదు"అని హెచ్చరించేవారు. కాని నాకు నా లావు మీద చిరాకొచ్చినా, ఎవరన్నా కామెంట్ చేసినా మళ్లీ కసరత్తులూ మామూలే, సమస్యలు తెచ్చుకోవడం మామూలే!

పెద్దయ్యాక ‘కొంచెం లావు తగ్గొచ్చు కద సార్’ అని ఆత్మీయ సలహా ఇచ్చినా, ‘ఊబ శరీరం వల్ల నష్టాలు’ అని ఎక్కడన్నా చదివినా నా అంతట నేను లావు తగ్గే ప్రయత్నాలు చేయడం మాత్రం మానలేదు.

సరే ఇవన్నీ అలా ఉంచితే, ఒకసారి ’నలభై దాటాం కదా, ఇహ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. నూనె, ఉప్పూకారాలు తగ్గించాలి, ఊరగాయలు అస్సలు తినకూడదు, ఫౄట్, వెజిటేబుల్ సలాడ్ లు తినాలి’ అనుకుని మా ఆవిడకి వంటలో రెస్ట్రిక్షన్స్ పాస్ చేశాను. అది కచ్చితంగా అమలు చేయాలని, లేకపోతే మజ్జిగ తాగి పడుకుంటాను అని బెదిరించాను. నేను చెప్పిన మరుసటిరోజు నుంచే నా స్ట్రిక్ట్ డైటింగ్ ప్రారంభమైపోయింది.

పొద్దున్న రెండు ఇడ్లీలు లేదా ఒక నూనెలేని దోశ లేదా కప్పుడు మజ్జిగన్నం. మధ్యాహ్నం భోజనంలోకి కొద్దిగా కూరాన్నం, కాస్త మజ్జిగాన్నం, కేరట్, కాబేజీ ఇత్యాది పచ్చి కూరల సలాడ్ ఇదే. రాత్రికైతే లైట్ గా కూరాన్నం, జస్ట్ మజ్జిగ తాగడం ఇంతే! ఇవి కాక మార్నింగ్ అండ్ ఈవెనింగ్, హాఫెనవర్ టు వన్ అవర్ బ్రిస్క్ వాకింగ్!

మీరు నమ్మరూ ఎంత స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యానంటే, ఒక్క రోజు కూడా ఫుడ్ విషయంలో రెస్ట్రిక్షన్స్ ను రిలాక్స్ చేయలేదు. ఆఫీసు లంచ్ టైంలో ఫ్రెండ్స్ ’ ఇలాగయితే రాయుడు గారు సన్నబడిపోవడం ఖాయం’ ‘స్మార్ట్ గా అయిపోతాడు’ ఇలా రకారకాలుగా కామెంట్స్ చేసేవాళ్లు. చెప్పొద్దూ, నాకెంత గర్వంగా ఉండేదో! జితెందర్ అనే ఒక్కతను మాత్రం ‘సార్, మీరు రాంగ్ స్టేప్ వేస్తున్నారేమో అనిపిస్తోంది. అంత స్ట్రిక్ట్ వెయిట్ రిడక్షన్ వద్దండి’ అని రెండు మూడు సార్లు అన్నాడు. నేను నవ్వి ’ మనిషి ఎప్పుడు ఒకేలా ఉంటే ఎలా జితెందర్? నేను తగ్గాననుకో, అదీ అఛీవ్ మెంట్ అంటే! అందరూ ఆశ్చర్యపోవాలి. స్టార్ట్ చేశానుగా కొనసాగించి లావు అంతు తేలుస్తా. ఆఁ"అనేవాడిని.

రోజులు గడుస్తూ మూడు నెలలు దొర్లించేశాయి. నా శరీరం గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తోంది. నా ఆనందం అంతింత కాదు. ఏ పనైనా చురుగ్గా చేసుకుపోతున్నాను(బహుశా అది నా ఫిలింగేమో తెలీదు). బాగా చెమట పట్టేది. అరికాళ్లు, అరచేతులకు విపరీతమైన చెమట. చెప్పులొదిలి నేల మీద కాళ్లు పెడితే కాళ్ల అచ్చులు పడేవి. ఒంట్లోని చెడు విసర్జించబడుతోందని ఒకటే సంతోషం.

నాకిప్పటికీ గుర్తు. ఆరోజు వినాయక చవితి.

పూజంతా అయ్యేసరికి రెండు అయింది. మా ఆవిడ ఉండ్రాళ్లు, పులిహోర, పాయసం, వామన చింతకాయల పచ్చడి, టమేటాపప్పు, అరటికాయ బజ్జీలు, ముక్కలపులుసు ఇలా అనేక రకాల పదర్థాలు చేసి, స్వామికి నైవేద్యం పెట్టింది. 

"నేను ఏవైనా రెండు పదార్థాలు లైట్ గా తింటాను"అన్నాను.

"ఇవాళ్టికి తినండి, ఫర్వాలేదు"అంది.

"తినను. పండగైనా సరే నా డైటింగ్ స్ట్రిక్ట్ గా కొనసాగవలసిందే. నన్నింబ్బంది పెట్టకు" అన్నాను.

"అలాగే" అంది.

ఎందుకో ఒక ముద్ద వామన చింతకాయల పచ్చడి తినంగానే కడుపు నిండిపోయిన భావన కలిగింది. ‘నేను నా పొట్టకు ఎంత చక్కటి స్ట్రిక్ట్ ట్రైనింగ్ ఇచ్చాను’ ఇంక తినొద్దు’ అన్న అలార్మ్ ఇచ్చేసింది’ అని మురిసిపోయాను.

"కాస్త పులిహార తినండి"అని ఒక గరిటెడు నా కంచంలో వేసింది.

అది తింటుంటే, కడుపులో వికారంగా అనిపించింది.

"కాస్త అనీజీగా ఉంది, నేను వెళ్లి ఒక గంట పడుకుంటాను"అని లేచెళ్లి పడుకున్నాను. 

కొద్దిసేపట్లో వికారంగా అనిపిస్తే లేచి వామిటింగ్ చేసుకున్నాను. అక్కడి నుంచి ప్రారంభమైంది అసలు కథ.

అన్నాన్నికాదు..కాదు..మెతుకును (నిజంగా), ఏ తినుబండారాలను చూసినా వికారంగా అనిపించేది. రెండు ముద్దలు తింటే కడుపు బిర్రుగా, వామిటింగ్ వచ్చేట్టుగా అనిపించేది. ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుందనుకున్నాను.

తగ్గక పోగా ఏదీ నోట్లో పెట్టుకోలేకపోతున్నాను. ఒళ్లంతా విపరీతమైన చెమట పట్టడం. నీర్సం.

జీ ఎం ఏదైనా చెబుతుంటే ఆయన మాటల మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. లంచ్ టైం లో క్యాంటీన్ లోంచి సువాసనలు వస్తుంటే వికారం. భరించలేకపోతున్నాను. 

నాకు భయమేయడం మొదలెట్టింది. నాకేమవుతోంది? ఏ తినే పదార్థం చూసినా నాకెందుకు వికారం కలుగుతోంది?

డాక్టర్ దగ్గరకెళ్లి జరిగింది చెప్పాను. ఆయన ఓ పది రకాల టెస్ట్ లు రాసి, రిజల్ట్స్ వచ్చాక ఏవో ట్యాబ్లెట్స్ రాసిచ్చి ఓ వారం వాడితే తగ్గిపోతుందన్నాడు.

‘హమ్మయ్య, ట్రీట్ మెంట్ స్టార్ట్ అయింది. ఇంక నాకేం కాదు’ అనుకున్నాను. వారం అయినా తగ్గలేదు. నాకు భయం రెట్టింపయింది. ఎందుకంటే ఆ వారం రోజులూ ఏం తినలేక పోయాను. ఇలా అయితే ఎలా? ఒకసారి ఒక ఫ్రెండ్ తో ఆరెంజ్ జ్యూస్ తాగాను. అది తాగుతుంటే ఎటువంటి వికారం కలగలేదు. ఫర్వాలేదు నా జిహ్వ కొన్నింటిని అలొవ్ చేస్తోంది. కొద్దిగా సంతోషం కలిగింది. కానీ అన్నం తినలేకపోతున్నాను. 

మా ఫ్రెండ్ ఓ హోమియో డాక్టర్ ని సజెస్ట్ చేయడంతో ఆయనకి చుపించుకున్నాను.

పది రోజులు ట్రీట్ చేశాక కూడా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు. మా చుట్టాలలో ఒకాయన సజెస్ట్ చేస్తే ఆయుర్వేదం డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ప్చ్..అక్కడా ఏం ఉపయోగం లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు నా భయం పెరిగిపోతోంది.

ఇదిలా ఉండగా నాకు ‘జాండీస్ అయ్యుండోచ్చేమో’నని ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. విజయవాడలో జాండీస్ ట్రీట్ చేసే ఒక ట్రెడిషనల్ ఆర్ ఎం పి డాక్టర్ మాకు తెలుసు. ఆయన చక్కగా ట్రీట్ చేస్తాడు. నాకు ప్రాణం లేచొచ్చి రాత్రికి రాత్రి బయలుదేరి ఆయన దగ్గరకు వెళ్లాను.
ఆయన నన్ను పరీక్షించి ’ఇది జాండీస్ కాదు. ఆ లక్షణాలేవీ లేవు. అయితే మీరు ఆహారవిషయంలో డ్రాస్టిక్ ఛేంజ్ చేయడం వల్ల బాడీ మెటోబాలిసమ్ దెబ్బతింది. మీరు పాడు చేసుకున్నంత ఈజీ కాదు రికవరవ్వడం. దానికి టైం పడుతుంది. ఎంత సమయం అన్నది ఎవ్వరూ చెప్పలేరు. మీరు మాత్రం తినాలనిపించినా, లేకపోయినా టైంకి అన్నం తినేయండి. అసలు ఈ విషయం ఆలోచించొద్దు. మీ పని మీరు చేసుకోండి’ అని డైజెస్టివ్ టానిక్ ఒకటి రాసిచ్చి పంపించేశాడు. 

నాలుగు రోజులైనా ఉపయోగం లేకపోయింది. నాలో ‘ఇదెక్కడికి దారి తీస్తుందో’ అని భయం పెరిగిపోసాగింది. 

మరొకరెవరో వేరే డాక్టర్ గురించి చెప్పడంతో ఆయన దగ్గరకెళ్లాను. ఆయనా షరామామూలుగా టెస్ట్ లు చేయించారు. మందులిచ్చారు. బట్ నో యూజ్!

నాకు భయంతో నిద్రకూడా పట్టట్లేదు. 

ఆ రోజు రాత్రి పదకొండు నలభై అయిదు అయింది. 

ఆందోళనతో విజయవాడ డాక్టర్ కి కాల్ చేసి నా భయం వ్యక్తం చేశాను. ఆయన "దాని గురించి ఆలోచించొద్దన్నా కదండీ"అన్నాడు నిదానంగా.

"అయ్యో మీకు తెలియడం లేదండీ, ఏం తినలేకపోతున్నాను. నీర్సం బాగా ఎక్కువైపోయింది. పడిపోతానేమో అన్న భయం వేస్తోంది. చెమటలు విపరీతంగా పట్టేస్తున్నాయ్"అన్నాను.

"మీరు ఈమధ్య టెస్ట్స్ ఏవన్నా చేయించుకున్నారా?"అన్నాడు.

"చేయించుకున్నానండీ"

అయితే, ఒక్కో రిపోర్ట్ లో ఉన్న టెస్ట్ రిజల్ట్స్ చిన్నగా చదవండి" అన్నాడు.

నేను అన్ని రిపోర్ట్స్ చదువుతున్నాను. మధ్య మధ్యలో డౌట్ వస్తే మళ్లీ రిపీట్ చేయమంటున్నాడు.

చెప్పడం పూర్తయ్యాక ఒక ఐదు నిముషాలు ఆగి రెండు టానిక్కులు చెప్పి, ‘ఇవి మీరు మూడు పూటలా వేసుకోండి. ఒక వారం అంతా మర్చిపోండి. పీస్ ఫుల్ గా గడపండి’ అన్నాడు.

ఆ వారం టానిక్కులు తీసుకుంటూనే, భయపడుతూనే గడిపేశాను. నా జీర్ణవ్యవస్థ పుంజుకుంది. మళ్లీ మామూలైపోయింది. ఆ విజయవాడ డాక్టర్ కి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పానో చెప్పలేను. 

నిజంగా గండం గడిచింది. 

అతి సర్వత్ర వర్జయేత్! ఏది అతిగా చేయకూడదు. తినకూడదు. మన శరీరం తనకు ఆహారం కావాలని ఆకలి ద్వారా తెలియజేస్తుంది. కడుపు నిండిన తర్వాత సంకేతాలిస్తుంది. ఇంకా తింటూ పోతే మోతాదు ఎక్కువౌతోందని హెచ్చరిస్తుంది. ఇంకా మనం వినకపోతేనే వస్తుంది చిక్కు. స్థూలకాయం తగ్గించుకోడానికి రకరకాల ప్రయోగాలు చేస్తే బెడిసికొట్టొచ్చు. లైపో చేయించుకున్నవాళ్లు ప్రాణాలు కోల్పోవడం మనకు తెలుసు. అందుచేత మితంగా తింటే, లావవ్వం, బరువు పెరగం. ఆల్రెడీ లావై ఉంటే, నిపుణుల పర్యవేక్షనలో నిదానంగా తగ్గాలి. అంతేకాదు ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు. ముఖ్యంగా అడ్వర్టైజ్ మెంట్లను నమ్మకూడదు. లావు సంగతి దేవుడెరుగు, కొత్త సమస్యలు చుట్టబెట్టుకోకూడదు కదా!

***

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి