చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaram

ఒకానొకప్పుడు వాతావరణం లో మార్పు వచ్చి, ఎండలు ఎక్కువైనప్పుడు, కిటికీలకి వట్టివేళ్ళ తడకలని ఉండేవి, ఆ తడకలు కట్టి వాటి మీద నీళ్ళు చల్లి, ఇంట్లో చల్లగా ఉండేటట్టు చూసుకునే వారు…  కాలక్రమేణా Air Coolers, Air Conditioners  ఆవిష్కరించబడ్డాయి. ఎవరి స్థోమతని బట్టి వారు, ఏదో ఒకటి అమర్చుకుని  ఇళ్ళలోనూ, ఆఫీసుల్లోనూ  వాతావరణం చల్లబరుచుకుంటున్నారు. Global warming  ధర్మమా అని, వాతావరణం  వేడెక్కి పోతోంది…

ఇలాటి వాతావరణ మార్పులకు ముఖ్య కారణం, ఎక్కడా చెట్టూ చేమా ఉండక పోవడమే… రోడ్లు వెడల్పు చేయాలంటే, ఎన్నో సంవత్సరాల పూర్వం నాటిన పెద్ద పెద్ద చెట్లు ముందర బలి అయి పోతున్నాయి… అలాగే ఉన్న చెట్లు కొట్టేసి, ఆ స్థానంలో పెద్ద పెద్ద ఎపార్టుమెంట్లు వచ్చేస్తున్నాయి.  మట్టి రోడ్లూ, కంకర రోడ్లూ,   concrete  లోకి మారి పోయాయి. వర్షాలకి పడ్డ నీళ్ళు, మట్టిలో ఇంకి, , చెరువుల్లోనూ, నూతుల్లోనూ సంవత్సరమంతా నీళ్ళు పుష్కలంగా ఉండేవి. ఈ రోజుల్లో మట్టీ లేదూ, నీళ్ళు ఇంకడాలూ లేవు… దానితో భూగర్బ జలాలు ఎండి పోయాయి.  దీనితో సొసైటీల్లో తవ్విన బోరు బావుల లో నీళ్ళనేవి కనిపించడం లేదు. అందుకే ఈరోజుల్లో ఎక్కడ చూసినా నీళ్ళ ట్యాంకుల ద్వారానే  నీళ్ళు. ..

ఇంక ఎండ వేడిని తట్టుకోవడానికి  పెద్ద పెద్ద  కార్పొరేట్ ఆఫీసుల్లో, మొత్తం బిల్డింగంతటికీ  ఎయిర్ కండిషనింగూ, అది కూడా  Centrally Airconditioned.  వీటిలో ఉండే ఇబ్బందేమిటంటే, కర్మవశాత్తూ ఆ  AC Duct  లో ఎక్కడో  short circuit  అయి, మంటలు చెలరేగి  మొత్తం బిల్డింగంతా ఆహుతై పోవడమూనూ.. ప్రమాదాలు పొంచి చూస్తూంటాయి. ఏ   బహుళాంతస్థుల బిల్డింగ్ లోనైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, చెప్పే కారణం ఇదే… పెద్ద పెద్ద కార్పొరేట్ Hospitals  లోకూడా ఇలాటివి చూస్తూంటాము..

 ఆ రోజుల్లో ఇళ్ళల్లో  అన్నం మిగిలి పోతే, తరవాణి లో ఆ అన్నానుంచి, మర్నాడు పొద్దుటే చద్దన్నంగా తినిపించే వారు. అలాగే కూరగాయలు కూడా ఓ బుట్టలో పోసుకోవడమో, లేక ఇంట్లోనే ఏ పెరట్లోనో ఓ తోటలాటిదుంటే, అందులోనే కూరగాయల మొక్కలు నాటుకుని, ఏరోజుకారోజు కూర కోసుకోవడమే… అయినా ఆరోజుల్లో కూరగాయలు కూడా, ఏ సంత నుండైనా తెచ్చినవైనా సరే, ఓ నాలుగు రోజుల పాటు పాడవకుండా ఉండేవి… కానీ ఈ రోజుల్లోనో,   Fertilizers and Pesticides  ధర్మమా అని, బయట నుండి తెచ్చిన కూరగాయలు, మహా అయితే ఓ రోజు తాజాగా ఉంటాయంతే. అలాగని రోజూ కూరలు తెచ్చుకోవడం కూడా కష్టమే…  Refregirators  ఆవిష్కరించిన తరవాత పరిస్థితి బాగు పడింది. ఈ రోజుల్లో ఏ ఇంటిలో చూసినా, ఏదో ఒక సైజుది  Refregirator  లేని ఇల్లు లేదంటే ఆశ్చర్యం లేదు.

అలాగే  పొలాల నుండీ, తోటల నుండీ , కూరగాయలూ, పళ్ళూ, పాలూ  టోకున కొనేసి, చిన్న చిన్న వ్యాపారస్థులకి Supply  చేయడం చూస్తూంటాము.. పెద్ద ఎత్తున వాటిని కొనేయడంతో సరి పోదుగా, అవి పాడవకుండా చూడడానికి  మళ్ళీ  Cold Storage  లు  రంగం లోకి వచ్చాయి…  ఈ రోజుల్లో, కూరగాయలు కాపాడ్డం దగ్గర నుండి,   Hospitals  లో శవాలు ఉంచే దాకా  ఎక్కడ చూసినా  Cold Storage  లే.

ఇన్ని చోట్ల వేడిని తట్టుకోడానికి, ఇన్నేసి సాధనాలుండగా, ప్రయాణ వ్యవస్థ మాటేమిటీ ?  ఇది వరకటి రోజుల్లో ఏ బస్సులోనైనా వెళ్తున్నప్పుడు, కిటికీ తెరిస్తే శుభ్రమైన చల్ల గాలికి నిద్ర పట్టేసేది.. కానీ ఈ రోజుల్లోనో దుమ్మూ ధూళీ తో నిద్ర మాట దేవుడెరుగు రోగాలొస్తున్నాయి… దానితో చిన్న చిన్న కారుల దగ్గర నుండి,  దూర ప్రయాణాలు చేసే పెద్ద పెద్ద బస్సుల దాకా అన్నీ ఎయిర్ కండిషండే.. రైళ్ళ సంగతి సరే సరి. ప్రతీ   Train  కీ కనీసం ఓ నాలుగు  AC Coaches  తప్పనిసరై పోయింది… సినిమా హాళ్ళ సంగతైతే అందరికీ తెలిసిందే..

వీటిల్లో కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి— ఒకానొకప్పుడు  Ventilation  అనేది ఉండడం వలన, మనిషి ఆరోగ్యకరమైన గాలి పీలుస్తాడనే వారు. కానీ ఈ  AC  లవలన, లోపల వారికి ఊపిరాడదేమోనంత దుస్థితి.. అయినా సుఖాలకి అలవాటు పడితే. వాటితో కష్టాలుకూడా అనుభవించాలిగా..

సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
డప్పు గీతాలు.
డప్పు గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు