ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

మా నాన్నగారు..1

నేను ఇప్పటిదాకా చూసిన పిల్లల నాన్నలందరూ గంభీరంగా, పిల్లలు ఏదైనా తప్పుచేస్తే తిట్టడం, కొట్టడంలాంటివి చేస్తుంటారు. పిల్లలకి ఊహ తెలియక ముందు అయితే తండ్రులు సామ, బేధ, దాన, దండోపాయాలు ఉపయోగించి పిల్లలను క్రమశిక్షణలో ఉంచాలి గనక అలా ఉంటే ఓ కే, కాని పిల్లలు పెద్దవుతుంటే మాత్రం సన్నిహితంగా, స్నేహితులుగా మసలాలి.

మా నాన్నగారు కీ.శే. ప్రతాప వెంకట సీతారామ సోమయజులుగారు అలా ఉండేవారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారు నన్నెప్పుడూ తిట్టలేదు, కొట్టలేదు., కనీసం హూంకరించలేదు. అందుచేత నేనెప్పుడూ సెల్ఫ్ డిసిప్లీన్ తో పద్ధతిగా ఉండేవాణ్ని.
మా నాన్నగారంటే నాకెందుకో చాలా జాలి. దానికో కారణం ఆయన మొదట్లో ఎయిర్ ఫోర్స్ లో పోలీస్ గా పనిచేసి, రిజైన్ చేసి బయటకొచ్చి  హెచ్ ఎ ఎల్ ల్లో సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైరయ్యారు.

ఆయన అక్కడ ఎయిర్ ఫోర్స్ లోనూ, ఇక్కడ హెచ్ ఏ ఎల్ ల్లోనూ యూనిఫాం తోటే ఉండేవారు. డ్యూటీ అంటే ప్రాణం. ఎక్కువ సెలవులు పెట్టేవారు కాదు. మూడు షిఫ్ట్ లలోనూ (ఫస్ట్, సెకెండ్ అండ్ థర్డ్) పనిచేసే వారు. ఆయన ‘నాకిది ఇష్టం’ అనడం నేనెప్పుడూ వినలేదు. ఉన్నదానితో సంతృప్తి అనేది ఆయన నుంచే నేర్చుకున్నాను.

సెక్యూరిటీ డ్యూటీ చాలా కష్టతరమైంది. వాళ్లు అహర్నిశం సంస్థని కాపాడుకోవాలి. ఉద్యోగులు సంస్థని మోసం చేయకుండా, కీడు తలపెట్టకుండా చూసుకోవాలి. సంస్థ బయట బంద్ లు జరిగినా, లోపల స్ట్రైక్ లు జరిగినా ఎక్స్ ట్రా డ్యూటీలతో, ఒళ్లంతా కళ్లుచేసుకుని సంస్థ రక్షణ బాధ్యతలో తలమునకలవ్వాలి. ఒకసారి బయట బంద్ జరుగుతున్నప్పుడు, సెక్యూరిటీ గేట్ దగ్గర ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తున్న మా నాన్నగార్ని ’బంద్ నాడు సంస్థ ని ఎందుకు మూసెయ్యలేదని’ ఆయన మీదకి మెటల్ రాడ్ విసిరేశాట్ట ఒక ఆందోళనకారుడు. అది తలకు తగలాల్సిందే, కొద్దిలో ప్రమాదం తప్పిందట. పాపం మూడు షిఫ్ట్ లలో డ్యూటీల వల్ల మా నాన్నకి సరిగా నిద్ర ఉండేదికాదు. సమయానికి తిండి తినేవారు కాదు. మా కోసం అనుక్షణం శ్రమిస్తూ, ఉన్నంతలో మాకేలోటూ లేకుండా చూసుకుంటుంటే జాలెయ్యదూ!

ఒకసారి నాకు పన్నెండేళ్లనుకుంటా మా స్కూల్లో ఒక పిల్లాడు డాన్సింగ్ డాల్ పట్టుకొచ్చాడు. నాకెందుకో అది విపరీతంగా నచ్చేసింది. మా నాన్నని అది తీసుకొచ్చి ఇమ్మని అడిగాను. ‘సరే, అది బల్కంపేట అమ్మవారి గుడి ప్రాంగణంలో ఉన్న షాపుల్లో దొరుకుతుంది. మా ఫ్రెండ్ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాడు. అతని చేత తెప్పిస్తాను’ అన్న మా నాన్నగార్ని రోజూ ఆఫీసునుంచి రాగానే ’తెచ్చావా?’ అని అడిగేవాణ్ని, ‘లేదురా ఆఫీసు పనిలో మర్చిపోయాను, నీకు తెచ్చిపెడతాగా’ అనేవాడు. ఆయన పనితో నాకేం పని? నేనుకున్నది నా చేతిలోకి రావడం లేదు. ఏవిటో తెలియని ఉక్రోషం. ఒకరోజు నాకిప్పటికీ బాగా గుర్తు- ఆకాశమంతా నల్లని మబ్బులు పట్టేసి, బాగా ఈదురుగాలితో ఇహనో ఇప్పుడో వర్షం వచ్చేలాగుంది. ఆయన ఆఫీసు నుంచి ఇంటికి రాగానే , ఇంకా లోపలికి కూడా అడుగు పెట్టకుండానే ’తెచ్చావా?’ అని అడిగాను. ఆయన ’లేదు నాన్నా, రేపు కచ్చితంగా తెస్తాను’ అన్నాడు. ’కుదరదు నాకిప్పుడే కావాలి. మనకు బల్కంపేట దగ్గరేగా, ఇప్పుడే వెళ్లి కొనుక్కురా’ అన్నాను నియంతలా. అప్పుడు మేము ఫతేనగర్ లో ఉండేవాళ్లం. ఆయన ఏమనుకున్నాడో ’సరే’ అని సైకిల్ మీదెక్కి తొక్కుకుంటూ వెళ్లి పోయారు. ఆయనలా వెళ్లారో లేదో జోరున ఉరుములు, పిడుగులతో భయంకరమైన ఈదురుగాలితో వర్షం మొదలైంది. కరెంట్ పోయింది.

ఇంట్లోనూ, ఊళ్లోనూ అంధకారం అలముకుంది. అప్పుడు నేను మనిషినయ్యాను. ’అదేంటి ఆఫీసునుంచి అలసిపోయి వచ్చిన నాన్నను ఇలాంటి వాతావరణంలో, బొమ్మ కొనుక్కు రమ్మని బయటకి పంపించాను. నేను అలా పంపక పోయుంటే మాతో పాటు ఇంట్లో హాయిగా ఉండేవారు కదా!’ ఆలోచిస్తున్న కొద్దీ గుండెలు పిండేస్తున్నట్టు అనిపించింది.

గంటైంది, రెండు గంటలైంది ఆయన రాలేదు. బయట వర్షం ఆగట్లేదు. మా అమ్మ ‘ఆయనేమన్నా చిన్నపిల్లాడా, వర్షానికి ఎక్కడో ఆగి ఉంటాడు లేరా, నువ్వు తడవకుండా లోపలికి రా’ అంటోంది. కానీ నా మనసు కుదురుగా ఉండడం లేదు. ఆయనలా వర్షంలో బయటకి పోవడానికి కారణం నేను. ఆ ఆలోచన మనసును ముక్కలుగా కోస్తోంది. నాకు తెలియకుండానే కళ్లలో నీళ్లు నిండాయి. అలా ఆయన కోసం గుమ్మంలో ఎదురు చూస్తూనే నుంచున్నాను. చాలా సేపటి తర్వాత ఆయన వచ్చారు. నా మనసు ఎంత ఆనందించిందో చెప్పలేను.

"సుబ్బూ ఎంత తిరిగినా దొరకలేదురా, వచ్చే సండే గుళ్లో జాతర చేస్తారుగా, బోలెడంత మంది రోడ్లమీద అమ్ముతారు. అప్పుడు పట్టుకొస్తానే’ అన్నారు నీర్సంగా.

’వద్దు నాన్నా, ఆ బొమ్మ ఇంకొద్దు. ఈ వర్షంలో నువ్వేమయిపోయావో ఒకటే బెంగపడ్డాను’ అన్నాను ఏడ్చేస్తూ.ఆయన  చిన్నగా నవ్వుతూ ’నాకేమవుతుంది నాన్నా?" అని నన్నెత్తుకుని బుగ్గల మీద ముద్దెట్టు కున్నారు. నేనూ ఆయన బుగ్గల మీద పశ్చాత్తాపంతో కూడిన ప్రేమాభిమానాలతో ముద్దుల వర్షం కురిపించాను.

ఆ తర్వాత నుంచి ఆయన్ను అలాంటి కోరికలు కోరడం మానేశాను. నా అంతట నేను ఆయన్ని ఏదీ అడిగి ఇబ్బంది పెట్టలేదు.
ఆరోజు జరిగిన ఆ సంఘటన- నా జీవితంలో ‘నా అవసరాల కోసం, మరొకర్ని ఇబ్బంది పెట్టకూడదన్న’ గొప్ప మార్పుకు కారణమయింది.

మరిన్ని వ్యాసాలు