టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. దాన్ని ఫాలో అయ్యేవారు బాగా పెరిగిపోయారు. పెరిగిన టెక్నాలజీకి కాస్సేపు దూరంగా ఉండడం అంటే, అదేదో జీవితాన్ని కోల్పోయినట్లేనని భావిస్తున్నారు నేటి తరం యువత. యువతే కాదు, ఈ టెక్నాలజీ బానిసలకు వయసుతో సంబంధం లేదు. ఆరేళ్ల చిన్న పిల్లాడి దగ్గర్నుంచీ, ఆరవై ఏళ్ల ముసలాడి వరకూ టెక్నాలజీకి బాగా కనెక్ట్ అయిపోతున్నారు. తద్వారా దాపురించిన మానసిక రోగమే 'స్మార్ట్ రోగం'. దీనికి వెయ్యి కారణాలు. శారీరక రోగం, మానసిక రోగం అని రెండు రకాలే ఇంతవరకూ. కానీ మానసిక రోగంలో కొత్తగా వచ్చి చేరిన పదమే స్మార్ట్ రోగం.
శారీరక రోగాన్ని మందులతో తగ్గించొచ్చు. కానీ మానసిక రోగానికి, అందులోనూ స్మార్ట్ రోగానికి మందు లేదు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ లేదా ఓ కామెంట్ పెట్టడం దానికి లైక్స్ రావడం లేదనీ ఓ రకమైన రోగం. సోషల్ మీడియాలో తనకు ఫాలోవర్స్ లేరంటూ మరో రోగం. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఒత్తిడికి గురవుతున్నారు చాలామంది. ఈ మధ్య మానసిక వైద్యులను సంప్రదించే వారిలో చాలా మంది ఈ స్మార్ట్ రోగ బాధితులే అంటే నమ్మడం కష్టంగానే ఉంది కదా. కానీ అలవాటు చేసుకోవాలి. ఇలాంటి వారికి వైద్యులు తగిన కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. కౌన్సిలింగ్‌తో వీరి రోగానికి ఉపశమనం కలగట్లేదు. మాకు మందులు కావాలి అని అడుగుతున్నారు. ఎక్కడైనా కాసేపు ఫోన్ మర్చిపోతే చాలు. గుండె ఆగినంత పని అవుతోంది. నిజానికి ఓ వ్యక్తికి సంబంధించిన పర్సనల్ డేటాతో సహా ఆర్ధిక లావదేవీలు కూడా ఫోన్‌లోనే నిక్షిప్తం అయి ఉండడం వీరిలో ఓ కేటగిరి వారైతే, స్మార్ట్ టైమ్‌ని మిస్ అయిపోయామే అనే బెంగ రెండో కేటగిరి వారిది. ఫోన్ వచ్చినట్లు, మెసేజ్‌లు పిలిచినట్లు అనిపిస్తూ, అదే భ్రమలో ఉండిపోతున్నారు ఈ రెండో కేటగిరికి చెందినవారు. ఇలాంటి వారే అధిక ఒత్తిడికి గురవుతున్నారు.
ఇలా ఒత్తిడికి గురి కావడంతో నిద్రకు దూరమవుతున్నారు. సగటు నిద్ర లేకపోవడంతో, రకరకాల వ్యధలకు లోనవుతున్నారు. అందుకే నిద్ర పట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. స్లీపింగ్ పిల్స్‌లాంటి తాత్కాలిక ప్రత్యామ్నాయాలన్న మాట. వీటిని తీసుకునే ముందే వైద్యులు హెచ్చరిస్తారు. చాలా తక్కువగా, అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలి అని. కానీ దాన్నో అలవాటుగా మార్చుకుంటున్నారు. దాంతో రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ జీవితం కాదు, జీవితంలో ఓ భాగం మాత్రమే పూర్తి జీవితాన్ని సుఖంగా సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలంటే, దేనికైనా కొన్ని పరిమితులు కంపల్సరీ అనే విషయాన్ని గమనించుకోవాలి. అప్పుడు కానీ ఈ స్మార్ట్ రోగానికి చరమగీతం పాడలేరు.!