చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఇది వరకటి రోజుల్లో, ఏదైనా  అనారోగ్యం కలిగితే, ఆ ఊళ్ళో ఉండే , ఏ డాక్టరుగారో నాడి పట్టుకుని రోగ నిర్ధారణ చేసి, వైద్యం చేసేసేవారు., ఆ డాక్టరు గారు  MBBS  చదివినవారైఉండొచ్చు, ఆయుర్వేదం అయుండొచ్చు,, హొమొపతీ అయినా అయుండొచ్చు. మరీ , ఏ ఆపరేషనో అవసరమయితే, దగ్గరలో ఉండే, ఏ పెద్ద పట్టణానికో, మరీ సీరియస్సైతే ఏ మహానగరానికో వెళ్ళమనేవారు… అయినా రోగాలుకూడా, పాపం, ఎప్పుడో తప్ప, మామూలు వైద్యానికి లొంగేవి కూడా… ఇవికాకుండా, గృహచిట్కాలుకూడా ఉపయోగించేవి… పురుళ్ళైతే ఏ మంత్రసానో చేసేవారు… మరీ పెద్దగా సమస్యలొచ్చేవికావు…ఈ రోగాలు రాకుండా ఉండడానికి, ఆరోజుల్లో తినే తిండీ, పీల్చే గాలీ , ఎటువంటి కల్తీలూ లేకుండా ఉండడంకూడా ఓ కారణమయుండొచ్చు… ఏది ఏమైతేనేం, మొత్తానికి పెద్దగా అనారోగ్యాలు లేకుండా కానిచ్చేసేవారు… అలాగని అసలు మొండిరోగాలే లేవా అనీ కాదూ… ఉండేవి, పుట్టుకతో వచ్చిన లోపాలనండి, వంశపారంపర్యంగా సంక్రమించినవనండి, ఉండేవి, కానీ వాటిని నయంచేయగలిగిన వైద్య సదుపాయాలు అంతగా ఉండేవి కావు… ఏదో మనకలా రాసిపెట్టుందని వదిలేసేవారు… ఈరోజుల్లో వచ్చే రోగాలతో పోల్చిచూస్తే, అసలు అంత పెద్ద రోగం వచ్చినా, అసలు ఎలా బతికి బట్టకట్టాడో అని ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది కూడానూ.. ఏ రోగానికైనా ముఖ్యంగా కావాల్సింది, వైద్యుడిమీద నమ్మకం. అసలు ఆ నమ్మకంతోనే సగం రోగం తగ్గిపోతుంది, రెండోది, ఆ వైద్యుడికి , రోగం నయంచేద్దామనే తప్ప, మరీ రొగిని ఎంతలా దొచుకుందామూ అనే ఉద్దేశ్యం ఉండేది కాదు… డాక్టరుగారి చేతిలో పెట్టేసామూ, అంతా ఆయనే చుసుకుంటారూ అనే ఓ పెద్ద నమ్మకం…

రోజులన్నీ ఒకేలా ఉండవుగా.. వైద్యశాస్త్రంలోనూ, ఎన్నో ఎన్నెన్నో ఆవిష్కరణలు జరిగాయి.  ఎటువంటి ఆరోగ్య సమస్యనైనా  క్షణాల్లో కనిపెట్టే శాస్త్రీయ పరికరాలూ వచ్చాయి రంగంలోకి… కానీ చిత్రం ఏమిటంటే, ఆ శాస్త్ర పరిజ్ఞానంతో పాటు, మనుషుల రోగాలుకూడా పెరిగాయి… కొన్నికొన్ని సమస్యలు, ప్లేగు, పోలియో, స్మాల్ పాక్స్ లాటివైతే , ఈ వైద్యరంగంలో జరిగిన అభివృధ్ధి మూలంగానే, సమూలంగా నిర్మూలింపబడ్డాయి… ఇప్పుడు మన శరీరంలో ఎన్ని భాగాలున్నాయో—అంటే పైన తలనుండి, కింది కాలిగోరుదాకా , ప్రత్యేక నిపుణులే…  ఎలాటి రోగంవచ్చినా దానికి వైద్యం వెంటనే దొరుకుతోంది… వైద్యం ఉందికదా అని, మనుషుల్లో ఈ రోజుల్లో ప్రతీదానికీ , డాక్టరు దగ్గరకి వెళ్ళడం మాత్రం మరీ ఎక్కువైపోయింది. ..

ఉదాహరణకి ముక్కు వంకరగా ఉందని దానికో ఆపరేషనూ, ఓ పన్ను ఎత్తుగా ఉంటే, దంతవైద్యుడూ, చివరకి శరీరం రంగు మార్చుకోడానిక్కూడా ఈరోజుల్లో డాక్టరే.. అయినదానికీ, కానిదానికీ వైద్యాలంటే కొంచం విచిత్రంగా ఉంది… అవతలి వాడిలానో, అంత కంటే అందంగానో కనిపించాలనే, మన కోరికలే ముఖ్యకారణం… అలాగని వికృతంగా ఉన్నా అసలు వైద్యమే వద్దని కాదు..  ప్రపంచంలో ప్రతీవాడూ ఓ నలుడిలా అందంగా ఉండాలని లేదుగా, ఎవడిరాతను బట్టి వాడు పుడతాడు… అలాగని రంగూ రూపంలేని మనుషులకి ఇదివరకటి రోజుల్లో పెళ్ళిళ్ళవలేదా, వాళ్ళూ హాయిగా కాపరాలు చేసికోలేదా? ఈరోజుల్లో ప్రతీవారూ, తాము చూసిన సినిమాలొని హీరోలాగో, హీరోయిన్ లాగో తయారైపోవాలనే యావ… ఆ సినిమా వాళ్ళు కూడా, ఏదో స్వర్గంనుండి దిగివచ్చినవారేమీ కారే…. గంటల తరబడీ మేకప్పులు చేసుకుని, తెరమీద కనిపిస్తారంతే.. వాళ్ళ కష్టాలు వారికీ ఉన్నాయి.. రోజంతా వంటినిండా రంగులు పూసుకుని, జుట్టులేని చోట  విగ్గులు పెట్టుకుని, ఏదో  చూసేవారికి అందంగా కనబడాలనే తప్ప, వాళ్ళూ మనలాటివారే అని మాత్రం గుర్తించరు.

అఛ్ఛా, ఇంక డాక్టర్ల విషయానికొస్తే, ఇదివరకటిరోజుల్లో ఒకసారి నాడి పట్టుకుని  రోగమేమిటో చెప్పగలిగిన డాక్టర్లు  అసలు  అరుదుగా కనిపిస్తారు..  ఈరోజుల్లో ఎక్కడ చూసినా  Corporate Hospitals  ఎక్కువగా కనిపిస్తాయి.. అక్కడ వైద్యమూ ఖర్చుతోకూడిన పనే.. ఒకానొకప్పుడు జనాలకి ఉచితంగానో, లేక నామమాత్రంగా స్వల్ప ఖర్చుతోనో, వైద్యాలు చేసే ప్రభుత్వ  హాస్పీటల్స్ కి వెళ్ళడమే తగ్గిపోయింది..  వైద్య పరికరాలు లేవా, అంటే అదీ కాదూ.. వాటిని సమర్ధంగా  ఉపయోగించే ఇఛ్ఛే  అటకెక్కేసింది… చాలామందిలో నిస్వార్ధంగా వైద్యం చేయాలనే  కోరిక కంటే,  Private Practice  మీదే  ఎక్కువ ఆసక్తి…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు