( పట్టయ )
ఇక్కడ మీకు మరో విషయం చెప్పాలి , పెద్ద హోటలునుంచి అతి చిన్న గెష్ట్ హౌసులో మీరు వున్నా మీ హోటలు వారు మీకు తప్పక చూడవలసిన ప్రదేశాలలో ప్రపంచపు అతిపెద్ద జెమ్స్ గ్యాలరీ చూడాలనే చెప్తారు . ప్రపంచంలో అతిపెద్ద కాదో నాకు తెలీదు , ఇది చూద్దామనుకున్న వారు రిసెప్షనులో చెప్తే వారు జెమ్స్ గ్యాలరీ వారితో మాట్లాడి మీ టూరు సమయం నిర్ధారిస్తారు . ఆ సమయానికి మీరు తయారుగా వుంటే వారి కారు మమ్మల్ని తీసుకు వెళుతుంది . బాగా మైన్టెయిన్ చేస్తున్న వుద్యానవనంలో వున్న పెద్ద బిల్డింగు , లోపలికి వెళ్లగాన థాయి సాంప్రదాయ దుస్తులు ధరించి వున్న స్టాఫ్ నవ్వు ముఖాలతో పలుకరించి మనకు కావలసిన పానీయాలను అతి మర్యాదగా యిస్తారు . తరువాత ఒకదాని వెనుకాల వొకటి కదుల్తున్న కోచ్ లలో యెక్కి కూర్చుంటే అవి కదుల్తూ వెళుతూ వుంటాయి , ఆడియో లో కధనం వినిపిస్తూ వుంటుంది . అన్నీ త్రిడి బొమ్మలతో గనులలో రంగురాళ్ల త్రవ్వకం యెలా జరుగుతుంది , వాటిని మట్టినుంచి యెలా విడదీస్తారు , యెలా సాన పెడతారు లాంటి వివరాలన్నీ వివరిస్తారు . ఆ టూరు అయేక వారి వర్క షాపు చూపిస్తారు . అక్కడ మనం రత్నాలను శాన పెట్టడం చూడొచ్చు . తరువాత వాటిని నగలలో యెలా పొదుగుతారో చూపిస్తారు . దాని తరువాత అసలు కథ మొదలవుతుంది . అదే షాపులోకి తీసుకు వెళతారు . మనవి కొనే ముఖాలలా కనబడకపోతే వారు వేసుకున్న ముసుగులు తొలగిపోయ అసలు రూపు బయట పెడతారు . చాలా అసహ్యంగా ప్రవర్తిస్తారు . ముందు మనదేశం ముఖాలను చూడగానే కొనే ముఖాలు కావని పసిగట్టెస్తారు . విదేశీ ముఖాలకే మర్యాదలు చేస్తారు . ఖరీదులు మాత్రం ఆకాశంలో వుంటాయి . సర్టిఫికేట్ యిస్తాం , యెప్పుడు తెచ్చినా పూర్తి సొమ్ము వాపసు యిస్తాం లాంటి కథలు చెప్పారు . 5,000 రూపాయల కెంపుని 5 లక్షలకి మనకి అమ్మచూపుతారు , కొనకపోతే తిడతారు .
ఇక్కడ మాల్స్ లో పప్పులు , గోధుమ పిండి దొరికేవి కావు , వాటికోసం వాకబు చేస్తూ మేము గురుద్వారా వీధికి వెళ్లేం అక్కడ ఓ రెండు షాపులలో మన మసాలాలు , పప్పులు , గోధుమ పిండి దొరికేయి . వాటితో పాటు గురుద్వారాకి వెళ్లమని సలహా కూడా యిచ్చేరు . గురుద్వారాకి వచ్చిన ప్రతీవారికీ భోజనం పెట్టి పంపుతారు .
పట్టయ నగరంలో చాలా శిక్కులు వున్నారు , యెక్కువగా వీరు దర్జీషాపులు నడుపుతున్నారు .
పట్టయ లో చూడదగ్గ ప్రదేశం “ టైగర్ సఫారి “ . ఇది పట్టయ నగరానికి సుమారు ముఫ్పై కిలోమీటర్ల దూరంలో వున్న ‘ శ్రీ రచ ‘ అనే నగరానికి దగ్గర సుమారు 4 వేల యెకరాల విస్తీర్ణం లో నిర్మించేరు . దీనిని 1990 లో ప్రారంభించినపుడు పులుల పెంపకానికని మాత్రమే వుపయోగపడేట్లు మొదలు పెట్టారు . తరువాత దీనిని జంతుసంరక్షణ శాలగా మార్చారు దీనిని నాలుగు విభాగాలు గా చెప్పుకోవచ్చు . పులుల సంరక్షణ , పెంపకం ఒకటి , మొసళ్ల పెంపకం రెండు , మూడు పులి విన్యాసాలు , నాలుగు యితర జంతువుల కోసం అని చెప్పుకో వచ్చు . మూడు వేల యెకరాల స్థలంలో విచ్చలవిడిగా తిరుగుతున్న పులులను చూడడం ఒక అధ్బుతమే , యిక్కడపులి గోళ్లు , పులి చర్మం అమ్మకానికి వుంటాయి , యిక్కడకొనే వాటికి సర్టిఫికేట్ యిస్తారు . పులి పక్కన కూర్చొని ఫొటోలు తీసుకోవడం పులిపిల్లకి బాటిల్ తో పాలు పట్టడం లాంటివి చెయ్యడానికి వేరుగా రుసుము చెల్లించ వలసివుంటుంది .
మొసళ్ల పెంపక విభాగంలో వందల సంఖ్యలో వున్న చిన్నా పెద్దా మొసళ్లను చూడ్డం కూడా ఆనందంగా వుంటుంద . మొసళ్ల విన్యాసాలలో అందాల భామ మొసలి నోట్లో తల పెట్టడం భయాన్ని కలుగ జేస్తుంది . ఇక్కడ మొసలి చర్మంతో చేసే పర్స్ లు , బెల్టులు అమ్మకానికి వుంటాయ .
థాయ్ లాండులో ఎలిఫెంట్ సఫారీ ఒకటి చూడవలసినది . థాయిలాండులో చాలా నగరాలలో యీ ఎలిఫెంటు సఫారీలు నడపబడుతున్నాయి . ఇవి చాలా మటుకు ప్రైవేటు రంగానికి చెందినవి కావడంతో ప్రవేశ రుసుములు చాలా యెక్కువగ వుంటాయ . ఇక్కడ యేనుగుల పెంపకం వాటికి రోజుకి కావలసిన ఆహారం మొదలయిన వివరాలు చెప్తూ ఆరోగ్యపరంగ యేనుగులకు యిస్తున్న వైద్య సదుపాయాల గురించి వివరిస్తారు , తరువాత ఏనుగు పైన ఓ పది పదిహేను నిముషాలు తిప్పుతారు . సాధారణ యేనుగుల రంగు కన్నా యీ యేనుగులు లైట్ కలర్ లో వుండడం వల్ల వీటిని తెల్ల యేనుగులు అని వ్యవహరిస్తారు . ఇక్కడ యేనుగు దంతాలు , యెముకలతో చేసిన వస్తువుల అమ్మకానికి వుంటాయి .
పట్టయ నగరం లో ఓ ఆరు నెలలు వుండే సరికి నాకు వైరాగ్యం వచ్చి సన్యాసం పుచ్చుకుందామనేంత వుక్రోషం కలగడం తో మేము పట్టయ నగరానికి 40 కిలో మీటర్ల దూరంలో వున్న శ్రీరచ నగరానికి మారిపోయేం . పట్టయ నగరానికి పూర్తిగ విరుద్దం యీ నగరం , ప్రజలు పద్దతిగా వుండేవారు , పట్టయ ప్రజలలో చూసిన విచ్చలవిడితనం యిక్కడలేదు . తాగుడు వ్యభిచారాలు యిక్కడ లేవు .
‘ శ్రీరచ ‘ కూడా సముద్రతీరాన వున్న నగరమే . రోజూ సముద్రతీరాన వాకింగు కి వెళ్లేదాన్ని , సముద్రతీరాన చాలా పెద్ద పార్క్ వుండేది , చాలా మంది నాలాంటి వారు వాకింగ్కి వచ్చేవారు . సాయంత్రం 5 గంటల నుంచి ప్రతీ అరగంటకి ఏరోబిక్ షో వుండేది . ప్రతీ అరగంటకీ ఓ ఏరోబిక్స్ చేసే అతను ( ఆమె ) వచ్చి ఏరోబిక్స్ చేస్తూ వుంటారు అతనిని చూస్తూ మిగతావారు ( వందలలో) చేసేవారు , స్పీకరులో మ్యూజిక్ వస్తూ వుంటుంది , దానికి అనుగుణంగా అందరూ కదులుతూ వుంటారు . నాలా వాక్ చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో వుండేవారు .
అలా వాక్ చేసే సమయంలో దూరంగా సముద్రం మధ్యలో చైనా స్టైల్ లో కట్టిన మందిరం ఆకట్టుకొంది . అంతే ఓ రోజు వాకింగు సమయంలో అక్కడకి వెళ్లేను . థాయి చైనా ల మిశ్రమ కళతో కట్టిన మందిరం . ఎర్ర రంగులతో , చుట్టూర నిప్పులు కక్కుతున్నట్టుగా వున్న డ్రేగను బొమ్మలతో వున్న మందిరం . శ్రీరచ నుండి మందిరం వరకు రోడ్డు వంతెన నిర్మించేరు , ముఖ్య భూ బాగానికి దగ్గరగా వున్న చిన్న ద్వీపం పైన నిర్మించిన యీ మందిరాన్ని ‘ వాట్ ఖొ లోయ్ ‘ అని అంటారు . చాలా స్థంభాలు , మెనతేలిన త్రికోణాకారపు గోపురాలతో వుంటుంది . లోపల యెత్తైన తెల్లని దేవత , యీ దేవతని కరుణా దేవి అని అంటారు . ఈ విగ్రహం సముద్రాన్ని చూస్తూ వుంటుంది . ఈ దేవి తన కరుణాపూరితమైన చూపులతో సముద్రం నుంచి వచ్చే విపత్తుల నుంచి దేశాన్ని కాపాడుతుందని వీరి నమ్మకం .
సముద్రం పైనుంచ వీచే గాలిలో సేద తీరేందుకు చాలా మంది యీ మందిరానికి వస్తూ వుంటారు . వీకెండ్స్ లో యిక్కడ చాలా రద్దీగావుంటుంది .
వచ్చేవారం మరికొన్ని వివరాలతో మీ ముందుంటానని మనవి చేస్తూ అంతవరకు శలవు .