పడకమీద రాజు : మహామంత్రీ, నా జబ్బు నయం కాదు, నాకు మృత్యువు తథ్యం. నా అంతిమ యాత్రకీ, చితిమీద సతీసహగమనానికీ అంతా సిద్ధం చేయండి.
మహామంత్రి : చిత్తం ప్రభూ ! ఇప్పుడే అందిన వార్త.. రాణీగారు అంతఃపురం నుండి తప్పించుకు పారిపోయారు.
రాజు : వెంటనే దండనాయకుడ్ని పంపించి, రాణీగారిని వెతికి పట్టి రమ్మనండి !
ఒక ముఖ్య సేవకుడు మంత్రి చెవిదగ్గరికి జరిగి : దండనాయకుడు కూడా కనిపించుట లేదు మంత్రివర్యా !!
రాజు, రాణితో : ప్రాణేశ్వరీ, నీ వంట అమోఘం...అద్భుతం...
రాణి : మీ పొగడ్తలకేం గానీ, నాకు రోజంతా వంటగదిలోనే సరిపోతోంది.
రాజు : ఔనూ, నా వొక్కడి కోసం రోజంతా వంటగదిలోనే గడపాలా?
రాణి : వంట చేసేది మీ ఒక్కరికే కాదు రాజా, అంతఃపురంలోని తక్కిన వాళ్ళకి కూడానండీ !
రాజు : వాళ్ళకెందుకు నువ్వు వండాలి?
రాణి : మీరు నన్ను మెచ్చుకునే సంగతి, వాళ్ళకెలా చెప్పనూ?
చిప్పమూతి : నువ్వు రాణిగారి అంతరంగిక పరిచారికవటగా ? ఏం పనులు చేస్తావేం?
చుప్పనాతి : నా పని వివరాలు అడిగేవాళ్ళ పేర్లు రాణిగారి చెవిన వేయాలి ! అదే నా పని!!
కొత్తగా వచ్చిన పురవాసి : అంతఃపుర ద్వారం పైన మీ ఇద్దరు భటులూ కూర్చుని పంకాలు విసురుతున్నారే?
ద్వారభటులు : ఇందువల్ల, ద్వారంలో గాలితెర ఏర్పడుతుంది !
పురవాసి : గాలితెర పనేమిటి?
ద్వారభటులు : ఈగలు, దోమలు లోనికి ప్రవేశించకుండా !!
పురవాసి : నాలాంటి వాళ్ళు ప్రవేశించాలంటే?
ద్వారభటులు : విషవాయువును వదిలి, మేం తప్పుకుంటాం..!!
భటుడు పరుగు మీద వచ్చి : మహారాజా, మన యువరాజు, పొరుగు దేశపు యువరాణిని లేపుకు వచ్చేశారు..!!
మహారాజు : మంచి వార్త తెచ్చావ్, ఇంద ఈ ముత్యాల హారం !!
భటుడు : పొరుగు దేశపు రాజు సైన్యాలతో వస్తున్నాడని వార్త !!
మహారాజు : పిల్లని కన్యాదానం చేసి, మన యువరాజుకి కట్టబెట్టడానికా?
భటుడు : కాదు మహారాజా....మన యువరాజుని చితకబాది, పిల్లని విడిపించుకెళ్తారట.....వారిస్తే....యుద్ధమట ప్రభూ!
మహారాజు : అవునా అయితే, ఆ పొరుగు రాజుతో సంధి ప్రకటించు మహామంత్రీ..ఏదైనా...మాట్లాడి తీర్చుకుందాం..!!
మంత్రి : పొరుగు రాజు, సంధికీ, మాటలకి ఒగ్గే రకం కాదు ప్రభూ!
మహారాజు : ఐతే మన యువరాజుని నాలుగు చితకబాదులు బాది ఆ పిల్లని, పొరుగు రాజ్యానికి వెంటనే తిప్పి పంపించేయండి !!
పుల్లన్న : మన రాజు గారు దండయాత్రలు చేసినప్పుడు కొత్త పద్ధతులు అవలంబించి విజయాలు సాధించారు కదా !
మల్లన్న : ఔనులే, మొదట మన కవి గారిని తీసుకు వెళ్ళి, యుద్ధంలో కవితలు చదివించి శతృసైన్యాలని పారద్రోలారు. రెండవసారి మన సంగీతాచార్యుడిని వెంట తీసుకు వెళ్ళి ఆయన చేత పాటలు పాడించి శ్తృరాజుని ఓడించారు..
పుల్లన్న : మరీసారి ఎవర్ని తీసుకెళ్ళారు? ఎందుకు ఓడిపోయారు?
మల్లన్న : ఈసారి మన నాట్యాచార్యుడ్ని యుద్ధంలో ప్రయోగించారు. ఆయన ఆడిన " ఐటెం సాంగ్ " నీ, అమ్మాయిలనీ చూసి శతృసైన్యాలు చొంగలు కార్చి, తరుముకుంటూ మన కోటలోకి దూరేశారు !!
మంత్రి బొమ్మరుసు : దండనాయకా, మనసైన్యంలో అశ్వదళం, గజదళం సంఖ్య గణనీయంగా వుందా?
దండనాయకుడు : ఆ రెండు దళాలతో పాటు , కొత్తగా వృషభ దళం కూడా చేర్చాం మంత్రివర్యా !
మంత్రి : వృషభ దళమా, ఎప్పుడూ వినలేదే?
దండనాయకుడు : వృషభం కొమ్ములకి గుడ్డలు చుట్టి, తగులబెట్టి, తోలితే శత్రువులు చెల్లాచెదురు నాయకా, పూర్వం మాహిష్మతి రాజు బాహుబలి ఇదే దళంతో శత్రువునోడించాడు.!
మంత్రి మారన్న : మహారాజా, రాజ్యంలో అవినీతి, అరాచకాలు ప్రబలిపోతున్నయ్ ప్రభో !
మహారాజు : తెలుసులేవో....! మహారాణి మొన్న గుడికెళ్ళొచ్చారు. ఆమె మెళ్ళో గొలుసునెవరో లాక్కెళ్ళిపోయారు ! ఆమె ఫిర్యాదు చేసింది. మీరేమైనా చర్యలు తీసుకున్నారా...? చెప్పొచ్చారు....హు....!!
రాజు : సేనాధిపతీ...మన నౌకాదళవీరులకి తగిన శిక్షణ ఇస్తున్నారా?
సేనాధిపతి : ఇస్తున్నాం ప్రభూ ! ఐతే పనీ పాటా లేక, చాపలు పట్టి గడుపుతున్నారు ప్రభూ!
రాజు : శభాష్..! వాళ్ళని చాపలమ్ముకోమనండి ! మనం వాళ్ళకి జీతాలివ్వల్సిన పని లేదు!
చక్రవర్తి : మంత్రి మహాశయా...జబ్బు చేసి, నేను మంచమెక్కాను . వెంటనే ఆస్థాన వైద్యుడ్ని పిలిపించండి.
మంత్రివర్యుడు : ఆయనకి జబ్బు చేసి మంచమెక్కాడు మహా ప్రభో ! ఆయన జబ్బు నయం చేయగోరి, వైద్యుడ్ని వెతుకుతున్నారట!!