మీ డబ్బు జాగ్రత్త - భమిడిపాటిఫణిబాబు

take care about your money

ఏదో  చాలా సంవత్సరాల  ముందు, అదేదో  “ బార్టర్ సిస్టం “ అనేది ఉండేదిట.. మనకి కావాల్సిన వస్తువుకి, మన దగ్గర ఉండి , మనకు అంత అవసరం లేనిదీ, అవతలివాడికి అవసరం ఉన్నదీ  , ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునేవారు. ఇద్దరి అవసరాలూ తీరేవి. అప్పటికింకా కరెన్సీ వాడుకలోకి రాని రోజులన్నమాట…  క్రమంగా ద్రవ్యం  వాడుకలోకి వచ్చేసింది. దానితోపాటు ఫలానా వస్తువు ధర ఇంతా అని చెప్పగా, ఆ డబ్బేదో ఇచ్చి కొనుక్కునేవారు..  మొత్తానికి జరిగిందేమిటంటే , చేతిలో డబ్బులు లేకపోతే, మనిషి మనుగడే ఉండదు. దాన్ని సంపాదించడానికి మనుషులు కూడా, వివిధమార్గాలూ వెదుక్కున్నారు. ఒళ్ళు వంచి పనిచేసేవారు కొందరు, తమ పూర్వీకుల వంశపారంపర్యంగా వచ్చిన ఆస్థులను అనుభవించేవారు కొందరూ,, అదేడబ్బుతో ఉన్న ఆస్థిని , పెంచుకునేవారు కొందరూ,  మరొకరిని మోసంచేసి సంపాదించేవారు కొందరూ… మొత్తానికి డబ్బే లోకంగా మారిపోయింది. డబ్బువిషయం దగ్గరకొచ్చేటప్పటికి, బంధుత్వాలుకూడా మర్చిపోయే పరిస్థితి… డబ్బు సంపాదించడానికి ఎంత దూరమైనా వెళ్తారు.

మనదగ్గర డబ్బు ఉంటే సరిపోదుగా, దాన్ని కాపాడుకోవడం కూడా తెలియొద్దూ…  1970 కి పూర్వం,  ప్రభుత్వ బ్యాంకులతో పాటు, ఎన్నో ఎన్నెన్నో  Private  బ్యాంకులు కూడా ఉండేవి… వీటిలో చాలా బ్యాంకులని ఆనాటి ప్రభుత్వం జాతీయం చేసేసింది…  ఏ కారణం చేతైనా ఆ బ్యాంకు దివాళాఎత్తేసినా, అందులో డబ్బులు దాచుకున్నవారికి కాస్తో కూస్తో నష్ట పరిహారం దొరకడానికి అవకాశం ఉంటుంది…దేశంలోని ఏ బ్యాంకైనా,   Reserve Bank of India  పరిధిలోకి రావాల్సిందే..దీనితో ప్రజలు కూడా ఒకవిధంగా కుదుటపడ్డారు…  కాలక్రమేణా రకరకాల  బాంకులూ రంగంలోకి వచ్చాయి… ఎంత ప్రభుత్వ పర్యవేక్షణ ఉన్నా, ప్రతీ బాంకులోనూ ఏదో ఒక రకమైన  నేరాలు జరక్క మానడం లేదు.
 బాంకుల్లో దాచుకున్న డబ్బు తీసుకోవడానికి ఒకానొకప్పుడు , స్వయంగా వెళ్ళాల్సివచ్చెది తరవాత  Cheque  రూపేణా డబ్బు పంపె సదుపాయం వచ్చింది…  చెక్ రూపంగా డబ్బు పంపినా, ఆ డబ్బేదో రావడానికి టైము పట్టేది, అప్పుడు  Demand Drafts  వచ్చాయి… మనం పంపాల్సిన డబ్బుకి ఓ  Draft  తీసుకుని పంపెస్తే, వెంటనే  డబ్బు దొరికిపోయేది… ఇవన్నీ కాకుండా, దేశంలోని మారుమూల  చోట్లకి పంపాలంటే, పోస్టల్ వారి  Money Order  ద్వారా పంపేవారు.  డబ్బు మరో చోటకి పంపడం సరే, ఉన్న ఊళ్ళో, మనక్కావాల్సినప్పుడు తీసుకోడానికి, , వీధివీధికీ,  ATM  లు వచ్చేసాయి… మనకి ఏ బాంకులో ఖాతా ఉందో, ఆ బాంకు వారు, ఓ  Debit Card  ఇస్తారూ, దాన్ని ఉపయోహించుకుని, ఎప్పుడు కావాల్సొస్తే అప్పుడే తీసుకునే సదుపాయం….

డబ్బెక్కడుంటే, అప్పుకూడా నీడలా ఉండొద్దూ?  వాటికి  Credit Cards  వచ్చాయి.. ఒకానొకప్పుడు మనకి పచారీ కొట్లో అరువు దొరికినట్టుగా, ఈ  Credit Card  ఉంటే , ఈరోజుల్లోకూడా అరువులాటిదే.. కావాల్సినదేదో ఈ కార్డు ఉపయోగించి కొనేసుకోవడమూ, మన సావకాశాన్ని బట్టి ఆ అప్పేదో తీర్చుకోవడమూనూ.. వడ్డీ కూడా కట్టాలి… ఆ కంపెనీలవాళ్ళు బతకొద్దూ?

ఒకానొకప్పుడు  ఆర్ధిక లావాదేవీలు జరుపుకోడానికి కొన్ని రోజులు పట్టేది. అలాటిది ఈ రోజుల్లో టెక్నాలజీ  ధర్మమా అని, ఓ  CLICK  తో  క్షణాల్లో జరిగిపోతోంది… ప్రపంచంలో ఏ మూలకైనా డబ్బులు పంపొచ్చు, కొనుక్కున్న సరుక్కి  online payment  ధర్మమా అని   payment  కూడా చేసేయొచ్చు… కావాల్సిందల్లా మన బాంకు ఎకౌంటులో సరిపడా డబ్బు…ఈరోజుల్లో చేతిలో ఉన్న  Mobile  ద్వారాకూడా ఈ లావాదేవీలు చేసుకునే సదుపాయం వచ్చేసింది.

సదుపాయాలతో పాటు, సంబంధిత నష్టాలుకూడా వెన్నంటే ఉంటాయిగా మరి… అవసరాలకి డబ్బు దొరికే,  ATM  లలో ఏవేవో కారణాలవలన డబ్బులుండకపోవడం ఈ మధ్యన తరచుగా కనిపిస్తోంది… ఈ  online payment  ఎంత సౌకర్యంగా ఉందో, అలాగే  Online Frauds  కూడా అంతలా ఉన్నాయి. ఏదో ఫలానా లాటరీలో, కోట్ల రూపాయల   Prize  వచ్చిందని , ఓ సందేశం పంపడమూ, దాన్ని పొందడానికి కొన్నివేలు ఫలానా ఎకౌంటుకి  transfer  చేయమనడమూ, ఆడబ్బేదో  transfer  అయిపోగానే, ఆ  fraudster  బిచాణా ఎత్తేయడమూ, ఈ  Prize  వచ్చినవాడు లబోదిబోమనడమూనూ…

ఏవో సదుపాయాలు వచ్చేసాయి కదా అని సంబరపడిపోవడంతో పాటు, మన జాగ్రత్తలు మనంతీసుకున్నప్పుడే  మనమూ మన డబ్బూ ఆరోగ్యంగా ఉంటాయి….

సర్వేజనా సుఖినోభవంతూ….

మరిన్ని వ్యాసాలు