జోకులు - - డా. ఎస్. జయదేవ్ బాబు

 

సంబారెడ్డి: మన యువరాజా వారు, ఒక పెద్ద జమిందార్ గారమ్మాయిని మోహించారట కదా?
శుంభానాయుడు: ఆ అమ్మాయి మీది తన మోహాన్ని ద్విగుణీకృతం చేయమని ఒక ప్రణయ కవిని తన వెంట తీసుకువెళ్ళారు.
సంబారెడ్డి: ఐతే ఇంకేం , ఆ అమ్మాయి యువరాజా వారిని వరించేసి పెళ్ళికొప్పుకున్నట్లేగా...?
శుంబానాయుడు : అదే జరగలేదు. ఆ అమ్మాయి యువరాజావారిని కాదని, ప్రణయ కవిని వరించి, అతడ్ని పెళ్ళిచేసేసుకుంది తెలీదా...?

పుష్కరాల జన సమూహం లో ఒక వనితామణి, అక్కడ తారసిల్లిన ఒక
పండితుడితో:  అయ్యా, నా భర్త కనిపించడం లేదు. మీరేమైనా చూశారా? నేను పొద్దుట్నుంచి ఆయన్ను వెతుకుతున్నాను!
పండితుడు: ఒక గంట క్రితం  చూసినట్లే గుర్తు.... మీ ఆయన కవి గదా...?
నువ్వేమో నీ కవి భర్తను వెతుకుతూ తిరుగుతున్నావు!
ఆయన కృతి భర్తను వెతుకుతూ తిరుగుతున్నాడు!!

నల్లశాస్త్రి: మన మహారాజుగారు, తన కొడుకుల్లో ఒకర్ని, తన వారసుడిగా ప్రకటించాలి కదా? రాణీ గారు కూడా కల్పించుకోవాలి కదా!
తెల్ల శర్మ: ఇప్పటిదాకా ప్రసక్తే లేదు. రాజుగారికి ఉప్పుచాపంటే చాలా ఇష్టం. రాణిగారికి చాపలకు ఉప్పు రాయించి, ఎండబెట్టడమే పని!
నల్లశాస్త్రి: వారసుడి ప్రకటనకీ, ఉప్పు చాపకీ ఏమిటీ లంకె?
తెల్లశర్మ: రాజు గారికి ఏడుగురు కొడుకులు కదా...! పొద్దుట్నే, చేపలు పట్టడానికి వెళ్ళిపోతారు. గంపెడు  గంపెడు చాపలు పట్టుకొస్తారు. వాళ్ళకి క్షణం తీరికుండదు! దీన్ని బట్టి ఊహించుకో... ఈ రాజ్యం లో  వారసుడి ప్రకటన ఎందుకు జరగలేదో!!

సోమ రాముడు: మీ పక్కింటి కవి పుంగవుడు, మత్తు కవితల ప్రసిద్ధుడటగా! ఆయన కవితలు చదివితే, శ్రోతలు మత్తులో మునిగిపోతారటగా! ఆయన మద్యం  సేవించి కవితలు చదువుతాడా ఏం?
రామసోముడు: కాదు. వినేవాళ్ళకి మద్యం పోసి, కవితలు చదువుతాడు!!

 

 

చక్కరాయుడు: ఈ కోట బురుజు మీద, మా అబ్బాయి, అల్లంత దూరాన ఆ కోట బురుజు మీద మీ అమ్మాయి సైగల ద్వారా సందేశాలు పంపించుకుంటున్నారు. ఆ భాష నీవేమైనా పసిగట్టగలవా?
బక్క వేముడు: మా అమ్మాయి ఏం చెబుతున్నదో తెలీదు గానీ, మీ వాడు, నీ భార్య కాసుల పేరూ, వడ్డాణాలతో, నడిరేయి, పొలిమేర గుడికాడ గుర్రం తో వేచి వుంటాడట. మా అమ్మాయిని బట్టలు సర్దుకుని అక్కడికొచ్చేయమంటున్నాడు!!
చక్కరాయుడు: ఏడిశాడు వెధవ...! సరే మీ అమ్మయేం చెబుతోందో చెప్పి చావయ్యా!
బక్క వేముడు: మీ అబ్బాయి కట్నం అడక్కుండా పెళ్ళిచేసుకుంటాడని మాటిస్తే వొచ్చేస్తానంటోంది!!

భళా తపస్వి: నారీమణి... ఎవరి వీవు? రంభవా... తిలోత్తమవా... మేనకవా...?
నారీమణి: మీ పక్కింటి రత్తాయమ్మ మేనకోడలిని! మీ తపస్సు చెడగొట్టి రమ్మని, మీ ఆవిడ పంపించింది! బయల్దేరు మీ ఇంటికి...! వస్తా!!

 

 

గాబ్రారాజు: విదూషకా... నీ హాస్య గుళికలు మింగుడు పళ్ళేదయ్యా! నవ్వురాకపోగా, కడుపు దేవినట్లవుతోందే?
విదూషకుడు: పొరపాటయింది రాజా... ఇవాళ మన వైద్య శిరోమణి మా వాడికి  బేది గుళికలిచ్చి వెళ్ళారు! అవి , నవ్వు గుళికల్తో కలిసిపోయినట్లున్నాయి!!
మంత్రి.. ఉపమంత్రితో రహస్యంగా: మన రాజుగారి పిచ్చిగానీ గుళికలతో నవ్వులొస్తాయా? ఈ విదూషకుడు అబద్ధాలు చెప్పి, రాజుగార్ని బోల్తా కొట్టించి ఉద్యోగం సంపాదించుకున్నాడు.  


మంత్రి ఎల్లన్న: మహారాజా, మన దండ నాయకుడు నేర శిక్షితుడు. చెరసాలలో తోశాము. ఐతే గుండె నొప్పి రావటం వల్ల , అతడ్ని వైద్య శిబిరం లో చేర్చాము. అక్కడ్నుంచీ తప్పించుకు పారిపోయాడు ప్రభూ!
రాజు రచ్చన్న: ఆ వైద్య శిబిరం లోని ఉన్నతాధికారిని చెరసాలలో తోయండి.
మంత్రి ఎల్లన్న: ఆ ఉన్నతాధికారికి గుండె నొప్పి వచ్చి, వైద్య శిబిరం లో పడుకున్నాడు ప్రభూ.
రాజు రచ్చన్న: ఐతే వెంటనే, మన రాజ్యం లో ఎవడికైనా గుండె నొప్పి వస్తే మరణ శిక్ష - ఇది  నా రాజాజ్ఞ అని ప్రకటించండి పోండి!

మహామంత్రి: మహారాజా, మన ఆస్థాన చిలక జోస్యుడి చిలక, బాగా తినమరిగి కొవ్వెక్కి కదలలేని పరిస్థితిలో వుందండీ!
మహారాజు: తక్షణం ఆ చిలకని తొలగించి వేరే చిలకని నియమించమని చిలక జోస్యుడికి ఆదేశమివ్వండి!
మహా మంత్రి: చిలక జోస్యుడు కూడా బాగా తినమరిగి కొవ్వెక్కి కదలలేని పరిస్థితిలో వున్నాడు మహారాజా!!

రాజు: రాణీ, నిన్న మీరు శయన మందిరానికి రాలేదేమీ?
రాణి: నిన్నటి దినం మౌనవ్రతం కారణం గా రాలేదు నాధా!
రాజు: మౌన వ్రతానికి, ఆయన మందిరానికి గల సంబంధమేమిటీ రాణీ?
రాణి: జోలపాట పాడందే తమరు నిద్దరోరు కదా నాధా!!

మరిన్ని వ్యాసాలు