కాలం ఆగడంలేదు కదూ…. - భమిడిపాటిఫణిబాబు

chamatkaram

మన పురాణాలన్నీ తాటాకుల మీద  “ ఘంటము “ తో రాసారుట., అయినా ఈరోజుకీ , ఆ గ్రంధాలు , పెద్దపెద్ద గ్రంధాలయాలలో చూడగలుగుతున్నాము.. కాలక్రమేణా, కాగితం రంగంలోకి వచ్చింది.  మొదట్లో, ఓ కలం తో, సిరాలో ముంచి రాసేవారు., ఆ కలాలు ఫౌంటెన్ పెన్ లోకీ, బాల్ పాయింట్ పెన్నులలోకీ రూపాంతరం చెందాయి. చదువు మొదలెట్టిన రోజుల్లో, చిన్న పిల్లలకైతే పలకా, బలపం, ఆ తరవాత పెన్సిల్ ( కాగితం మీద రాసుకోడానికి ) ఇచ్చేవారు. దానితోపాటు ఓ రబ్బరూ (  eraser )  , ఎక్కడైనా తప్పురాస్తే , చెరిపేసి సరిదిద్దుకోడానికి. 

ప్రతీదీ కాగితం మీద కలంతో రాసి , ఎన్నో ప్రతులు తయారుచేయడం ఎంతైనా శ్రమతోకూడిన పని కాబట్టి, అచ్చు వేయడం మొదలయింది… ఈ రెండూ  వచ్చేసరికి,   News Paper, Magazines  అచ్చువేసి , దేశంలో అన్నిమూలలకీ పంపడం కూడా సుళువయింది… అలాగే పెద్దపెద్ద పుస్తకాలుకూడా అచ్చువేసేవారు…  న్యూస్ పేపరు అచ్చువేయడానికి, కాగితం ఖరీదు మరీ ఎక్కువైపోతోంది కాబట్టి  వీటికి ప్రత్యేకంగా కాగితం తయారుచేయడం మొదలయింది…  దీనికోసం  Nepanagar  అనే ఊళ్ళో, దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ తయారీ ఫాక్టరీ మొదలయింది..  కాగితం తయారుచేయడానికి , సాధారణంగా, వెదురు గుజ్జునుకానీ, , మరో కర్ర/ చెక్క గుజ్జును కూడా వాడతారు… వీటన్నిటికీ చెట్టూ, చేమా చాలా అవసరం కదా.. అడవులలో పెరిగే చెట్లని నరికి, ఆ గుజ్జుని ఉపయోగించేవారు… ఇన్నిసంవత్సరాలూ గుర్తుకి రాకపోయినా, అకస్మాత్తుగా  మన పర్యావణ రక్షణ కోసం, అడవులలో చెట్లు నరక్కూడదని అందరికీ గుర్తొచ్చేసింది… దీనితో ఏమయిందంటే, కాగితం  స్థానంలో,   e – books   రంగంలోకి వచ్చేసాయి, కొన్ని సంవత్సరాల  ముందర. ఇప్పుడు ఎక్కడచూసినా, అవేవో   Kindle  అని రంగప్రవేశం చేసేసింది.

ఈ రోజుల్లో చదవడానికి పుస్తకాలు కానీ,  Periodicals  కానీ, అంతర్జాలం ద్వారా చదువుకోడానికి వీలౌతోంది…  ఇలా చేయడం వలన ,  ఇదివరకటికంటే, ఈరోజుల్లో పాఠకుల సంఖ్యకూడా పెరిగినట్టే కనిపిస్తోంది. పైగా అంతర్జాలం (  Internet )  కూడా అందరికీ అందుబాట్లోకి వచ్చినట్టే.. పైగా ఖర్చుకూడా తక్కువే… వీటన్నిటికీ ముఖ్య కారణం సాంకేతిక పరిజ్ఞానం అభివృధ్ధి చెందడమే..

కానీ ఈ అభివృధ్ధి తో పాటు, మనం కొన్ని మధుర క్షణాలుకూడా పోగొట్టుకున్నామనడం లో సందేహం లేదు… గుర్తుండే ఉంటుంది చాలామందికి---- ఒకానొకప్పుడు మార్కెట్ లోకి ఏదైనా కొత్తగా పుస్తకం రావడం తరవాయి, మరొకరు ఆ పుస్తకం కొనే లోపలే, తామే ముందుకొనాలనే తపనతో , పుస్తకాల దుకాణాల ఎదుట  క్యూలు కట్టేవారు… కొత్తపుస్తకం చేతిలో పట్టుకుని చదవడంలో ఉండే అలౌకికానందం వేరు.. కొత్తపుస్తకం అవడంతో, అందులోంచి వచ్చే  అదో రకమైన  సువాసన,  ఈ  e- books  చదివితే వస్తుందనుకోను… వాకిలిలో ఓ  పడక్కుర్చీ వేసుకుని, పక్కనే ఓ స్టూల్ మీద కాఫీకప్పు లోంచి, ఆరారగా గుక్కవేస్తూ, ఆ పుస్తకంలోని  ప్రతీ పేజీ ఆస్వాదించే, ఆనందం మాత్రం మిస్సవుతున్నాము… అలాగే బజారులో ఆ వారందో, నెలదో కొత్తది రాగానే, వెంటనే కొనేసి, ఇంటికొచ్చేలోపలే కథలు చదివేసే ఆనందం మాటేమిటి? మనం చదవడం పూర్తయేదాకా, ఇంకోరిచేతిలో పడకుండా, ఏ పరుపుకిందో, తలగడ కిందో దాచేసే , చిలిపిపనుల మాటేమిటి? అంతదాకా ఎందుకూ, కొన్నిసంవత్సరాల  ముందు, కొన్ని  పండగ ప్రత్యేక సంచికలు, అదో తమాషా సెంటు ( కునేగా) సువాసనతో వచ్చేవి… అదో మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది…

స్కూళ్ళలో చదువుకునే పిల్లల సంగతే తీసుకోండి—ఒకానొకప్పుడు, ఒక క్లాసులోంచి, పైక్లాసులోకి వెళ్తున్నామంటే, కొత్త పుస్తకాలు కొనుక్కోవచ్చనే ఉత్సాహమే ఎక్కువగా ఉండేది. ఆర్ధిక పరిస్థితి అంతగా బాగోలేనివారైతే, సెకెండ్ హాండ్ పుస్తకాలే కొనేవారనుకోండి, అది వేరే విషయం.

ఒకానొకప్పుడు నాన్నగారికో, అమ్మకో ఓ కార్డుమీదో, ఓ ఇన్లాండ్ లెటర్ మీదో రాస్తే వచ్చే ఆనందం, సంతృప్తి, ఈరోజుల్లో క్షణాల్లో టైపు చేసే,  emails  లో ఉందంటారా?..

కాగితంతయారీలో అడవులు కొట్టేయడం, పర్యావరణానికి క్షేమంకాదూ అనే వంకతో, కాగితం వాడకం తగ్గించారుకానీ, అలాగని చెట్టూ చేమా కొట్టకుండానే పనులవుతున్నాయంటారా? ఏదో రోడ్డు వెడల్పుచేయాలని, రోడ్ల పక్కనే , ఎన్నో సంవత్సరాలనుండీ, నీడనిస్తున్న పెద్ద పెద్ద చెట్లని,, చీకట్లో కొట్టేయడం లేదూ? అయినా కాలం ఆగడంలేదు కదూ….

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు