మీరిచ్చుకోగలిగిన ఒకే ఒక విషయం - ..

only one thing

మీరు, మీ జీవితంలో ఎవరికైనా ఏదైనా ఇవ్వచ్చు. అది డబ్బు, ఆహారం, విద్య నివ్వడం కానివ్వండి లేదా మరేదైనా సరే, ఇవన్నీకూడా మీకు చెందినవి కావు. ఇప్పుడు మీ శరీరంతో సహా మీ దగ్గర ఉన్నవన్నీ, మీరు ఈ భూమి నుంచి సేకరించినవే..! మీరు వెళ్ళిపోవలసిన సమయం వచ్చినప్పుడు, ఇవన్నీ తిరిగి ఇచ్చేసి వెళ్ళాల్సిందే. మీ శరీరంలో ఒక్క కణం కూడా మీరిక్కడి నుంచి తీసుకువెళ్ళలేరు, అవునా ? ఇప్పుడు మీ దగ్గర ఉన్నవన్నీ కూడా మీరు ఈ భూమి నుంచి అప్పుగా తీసుకున్నారు. నిజానికి, ఇవన్నీ మీవి కావు. మీరు వీటిని ఉపయోగించుకోవచ్చు, ఆస్వాదించవచ్చు. కానీ, మీరు వాటిని సొంతం చేసుకోలేరు. ఈ విషయం మీరు గ్రహించాలి. సొంత ఇల్లు లేదా బట్టలు, మీ పిల్లలు, మీ భర్త, మీ భార్య ఇంకా ఎంతో మంది మనుషులు కూడా మీ సొంతం అనుకుంటున్నారు. కానీ, నిజానికి ఏదీ మీ సొంతం కాదు. అవి మీకొసం ఇక్కడ ఉన్నాయి. మీరు వాటిని ఆస్వాదించవచ్చు. మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. కానీ, సమయం వచ్చినప్పుడు, మీరు వదిలిపెట్టి వెళ్ళవలసిందే..!

మీరిచ్చుకోగలిగిన ఒకే ఒక విషయం -  మిమ్మల్ని మీరు మాత్రమే!! ఇందుకు సుముఖంగా మీరు మారకపోతే, ఇది ఎంతో కష్టమైన ప్రక్రియ అవుతుంది.

నిజానికి ఏదీ మీకు చెందినది కాదు. మరి, మీకు చెందని దానిని మీరు మరొకరికి ఎలా ఇవ్వగలరు? నిజానికి ఇవ్వడం అన్నది ఏదీ లేదు. మరెవ్వరికో చెందిన ఆస్తిని నేను తీసుకొని మీకిస్తే, అందులో పెద్ద విశేషం ఏముంది..? దానికేమైనా విలువ ఉందా..? అందుకే, మీరు అర్పించడానికి లేదా ఇవ్వడానికి ఏదో ఒక మార్గం కావాలి. నిజానికి మీరు చేయగలిగినది మిమ్మల్ని మీరు అర్పించుకోవడం మాత్రమే. కానీ, మీకు అది ఎలా చెయ్యాలో తెలియదు. అందుకని మీరు డబ్బులో, ఆహారమో, మరేదో మీరు సాధనలుగా ఉపయోగిస్తున్నారు. లేదా, మీరు ఏదైనా ఒక పని చెయ్యడం ద్వారా మిమ్మల్ని మీరు సమర్పించుకొనే సాధనంగా వాడుతున్నారు.

ఈ విషయం కనుక మీ ఎరుకలో లేకపోతే, ఏది ఇవ్వాలన్నా, ఇవ్వడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. మీరిచ్చుకోగలిగినది  మిమ్మల్ని మాత్రమే!! ఇందుకు సుముఖంగా మీరు మారకపోతే, ఇది ఎంతో కష్టమైన ప్రక్రియ అవుతుంది. మీరు ఇవ్వడం అనగానే, ఏవో వస్తువులనివ్వడం అని ఊహించినప్పుడు, సహజంగానే మీలో భయం పుడుతుంది. ఎందుకంటే, దీనిని ఇచ్చేస్తే, అప్పుడు నా సంగతేమిటి?? అని మీరనుకుంటారు. మనం ఇలా అర్థం చేసుకుంటున్నాం కాబట్టే, ఏమైనా ఇవ్వాలంటే మనకు భయం కలుగుతుంది. అందుకే ప్రజలు తమ ప్రేమలోనూ, ఆనందంలోనూ పిసినారితనాన్ని చూపిస్తున్నారు. ఇవ్వడం అంటే అవి వస్తువులను ఇవ్వడం అనుకుంటున్నారు. కానీ, మీరు ఎన్ని వస్తువులని ఇవ్వగలరు..? మీరు చాలా వస్తువులను ఇచ్చేస్తే, రేపు ఏమీ ఉండవని లెక్ఖలు వేస్తున్నారు. ఇలా ఆలొచించడం ద్వారా మెల్లిమెల్లిగా మీ ప్రేమ, సంతోషం, ప్రశాంతత అన్నీ తగ్గిపోతున్నాయి. ఎందుకంటే, మనం ఇవ్వడానికి భయపడుతున్నాం కాబట్టి..! మీరు ఇవ్వడం అంటే వస్తువులు ఇవ్వడం అనుకుంటున్నారు కాని మిమ్మల్ని ఎలా అర్పించుకోవాలో మీరు ఆలోచించరు. మీరు ఏమి చేస్తున్నారో దాని ద్వారా మిమ్మల్ని మీరు ఎలా అర్పించుకోగలరు. అందుకని వాలంటీరింగ్ అనేది మిమ్మల్ని మీరు అర్పించుకునే ఒక ప్రక్రియ. ఇది మిమ్మల్ని మీరు అర్పించుకునేటందుకు ఒక అవకాశం. మీరు ఇక్కడ ఊరికే అలా కళ్ళుమూసుకుని కూర్చొని ఈ ప్రపంచానికి మిమ్మల్ని మీరు అర్పించుకోవచ్చు. అది సాధ్యమే. కానీ, అటువంటి స్థాయి, ఎరుక ఇంకా చాలామంది మానవులలో లేదు. వారికి, ఏదో ఒక పని ఉంటే తప్పితే, అందులో వారు ఎలా నిమగ్నమవ్వాలో వారికి తెలియదు. వారికి, చెయ్యడానికి ఏదో ఒకటి కావాలి. మిమ్మల్ని మీరు అర్పించుకునేటందుకు వాలంటీరింగ్ అనేది ఒక అద్భుత అవకాశం. మీరు చేస్తున్న పని ద్వారా మిమ్మల్ని మీరు అర్పించుకోవచ్చు.

వాలంటీర్ అంటే సుముఖంగా ఉన్న వారని అర్థం. ఇదో-అదో చేసే వారు, అని కాదు.  అతను కేవలం సుముఖంగానే ఉన్నాడు. అతనే సుముఖత.

సహజంగా, మనం ఏ పని చేసినా సరే, మనం లెక్ఖలు కడతాం. నేనెంత చెయ్యాలి..? ఏం చెయ్యాలి..? దీన్నుంచి నాకేం వస్తుంది..? అని. ఈ లెక్కలు వెయ్యడం వల్ల మనం చేస్తున్నదాని అందం అంతా పోతుంది. అలా జీవితం అంద విహీనంగా తయారౌతుంది. జీవితంలో మీరు ప్రస్తుతం చేస్తున్న విషయాలు మీరు ఎంపిక చేసుకున్నవే. అయినప్పటికీ, రోజువారీ చేస్తున్న చిన్న పనులలో మనం ఎంత కష్టపడుతున్నాం.? ఎందుకంటే, మనం ఇవ్వడానికి సుముఖంగా లేము కాబట్టి. మీరు ఇదంతా కూడా సుముఖంగా మొదలు పెట్టాం అన్న విషయం మరిచిపోయారు. అది మీ ఉద్యోగం అవ్వనివ్వండి, మీ వివాహం, మీ కుటుంబం మరేదైనా సరే, ఇవన్నీ కూడా మీరు సుముఖంగా మొదలు పెట్టారు. ఎందుకంటే ఇవన్నీ మీరు మీ జీవితంలో కావాలనుకున్నారు.

అది ఇదని కాదు - ఏదైనా పూర్తి లగ్నతతో చేయాలి

ఒకసారి మొదలు పెట్టిన తరువాత, మీరు ఎందుకు మొదలు పెట్టారో మరిచిపోయారు. ఇప్పుడు, మనం అయిష్టంగా లేదా విముఖంగా ఇవ్వడం మొదలు పెట్టాం. ఇప్పుడు, అదొక బాధాకరమైన ప్రక్రియగా మారిపోయింది. అందుకని, వాలంటీరింగ్ అనేది మనల్ని మనం ఎలా అర్పించుకోవచ్చు -  అనేది తెలుసుకోవడానికి ఒక సాధనం. వాలంటీర్ అంటే సుముఖంగా ఉన్నవారని అర్థం. ఇదో-అదో చేసేవారు, అని కాదు. అతను కేవలం సుముఖంగానే ఉన్నాడు. అతనే సుముఖత. ఆ విధంగా అయితే తప్ప, మీకు ఆధ్యాత్మిక ప్రక్రియ జరిగే అవకాశమే లేదు. ఏ మనిషైనా సుముఖంగా లేకపోతే ఎటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియా జరుగదు. అందుకని వాలంటీరింగ్ అనేది ఇలాంటి అవకాశం కలిగించేటందుకు ఒక అద్భుతమైన సాధనం. ఇక్కడ కూర్చొని, మనం సుముఖంగానే ఉన్నాం అని ఆలోచించవచ్చు. కానీ మనం దానిని పరీక్షకు పెట్టినప్పుడు, మనకు మనలో ఎంత ఘర్షణ ఉందో తెలుస్తుంది. మన జీవితంలో ప్రతీదాని గురించీ మనలో ఎంత ఘర్షణ ఉన్నదో మనం ఒక పని చెయ్యడం మొదలుపెట్టినప్పుడు మనకు తెలుస్తుంది.

అందుకని, వాలంటీరింగ్ అంటే నూరుశాతం సుముఖంగా తయారుకావడానికి మీకు మీరు శిక్షణని ఇచ్చుకోవడం. ఇది ఎదో ఒక పని చెయ్యడానికి సుముఖం అని కాదు. నా విధానమే ఒక సుముఖత. ఇంకో విధంగా చెప్పాలంటే, నాకు అన్నిటిపట్ల లోతైన అంగీకారం ఉంది, నాలో ఎటువంటి ఘర్షణా లేదు. వాలంటీర్ అంటే ఎవరికైతే తమలో ఎటువంటి ఘర్షణా లేదో అతడే. మీరు ఇది చెయ్యలీ అని చెబితే, అతను చేస్తాడు. అది చెయ్యమని చెబితే అదీ చేస్తాడు. అతనికి ఏది సరైనదీ, ఏది సరైనది కాదు, ఏది చెయ్యాలీ, ఏది చెయ్యకూడదు అన్న ఆలోచన లేదు. ఏదైతే చెప్పారో అది చేసేటందుకు అతను సుముఖంగా  ఉన్నాడు. తానే సుముఖతగా మారిపోయాడు. ఇది మొదలుపెట్టడానికి కొంత అనువైన వాతావరణం, ఒక సురక్షితమైన వాతావరణం ఉంటే మంచిది.

అందుకే ఈశాలో ఈ ప్రక్రియ అంతా కూడా వాలంటీరింగ్ ద్వారా జరుగుతుంది. నన్ను ఉపయోగించుకుంటారేమో అన్న భయం లేకుండా. ఇదే మీ ఆఫీస్ లో ఇలా ఉండమని చెప్పాను అనుకోండి, ఎవరైనా మిమ్మల్ని వాడుకుంటారేమో అన్న భయం మీకు ఉంటుంది. అది జరగవచ్చు కూడా. అందుకని, మీరు ఎప్పుడూ దీనిని ఒక సురక్షితమైన ప్రదేశంలో మొదలు పెడితే మంచిది. అందుకే మేము ఎప్పుడూ వాలంటీరింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాం. మీరు సుముఖంగా మారేందుకు దీనిని ఉపయోగించుకోవాలి. దీనిని మీ నిత్య జీవితంలోనికి కూడా తీసుకురాగలగాలి. అన్నిటినీ మించి ఓ జీవంగా మీరు సుముఖంగా మారాలి.

(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో...)

మరిన్ని వ్యాసాలు