పాపం ప్రకృతి కాదు… మనమే.. - భమిడిపాటిఫణిబాబు

is not nature ... we are ..

ఒకానొకప్పుడు, అంటే మరీ ఏ ఇక్ష్వాకుల కాలంలోనో కాదు, దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాతి మాటే… మనంరోజూ తినే ఆహారపదార్ధాలనండి, కూరగాయలనండి, వాటన్నిటినీ, పెద్దమొత్తాలలో అయితే, బయట పెద్దపెద్ద పొలాల్లో పండించేవారు.. కూరగాయలైతే, ఇళ్ళల్లో ఉండే ఖాళీ స్థలంలో కూడా పండించేవారు. పొలాల్లో పండించేవాటికి, భూమి సారవంతంగా ఉండడమే కాకుండా, అవి పెరగడానికి , ప్రకృతిసిధ్ధమైన వాటితో పనైపోయేది. టైముకి వర్షాలూ వచ్చేవి, అవేకాకుండా పంటకాలవల్లాటివి కూడా ఉండేవి… గుర్తుండే ఉంటుంది--- కొత్త తోటో, పంటో వేసేముందర, మేకల మందలని వాటిలో తిరగనిచ్చేవారు—కారణం  ఆ మేకలు వేసే పెంటికలు భూమిలో కలిసి, ఆ భూమి సారవంతమౌతుందనీ, అలాగే  పాడీ, పశువూ ఉన్నచోట్ల, వాటి పేడనుకూడా, ఎరువుగా వాడేవారు. అలాగే చెట్లనుండి రాలిన ఆకులను కూడా ఉపయోగించేవారు… ఇళ్ళల్లో అయితే కూరలు తరగ్గా వచ్చిన తొక్కలూ, దేవుడికి పెట్టిన పువ్వుల నిర్మాల్యం, ఏ మొక్క మొదట్లోనో వేసేవారు… చెప్పొచ్చేదేమిటంటే, అప్పటికి ఇంకా రసాయనపదార్ధాలు, వాటితో తయారయే ఎరువులూ, ఉండకపోవడం మూలాన, సహజసిధ్ధంగా పెరిగిన ఆహారపదార్ధాలు తినే, పెరిగిపెద్దయారు. అంతగా అనారోగ్య సమస్యలుకూడా ఉండేవి కావు. ఏడాదికి రెండో మూడో పంటలూ వచ్చేవి, అలాగే  Season  ని బట్టి పువ్వులూ, పళ్ళూ వచ్చేవి.

రోజులన్నీ ఒకేలా ఉండవుగా.. మనిషికి  తక్కువ టైములో ఎక్కువ సంపాదించేయాలనే యావ ఎక్కువైపోయింది. మరి వాటికి మార్గాలుకూడా శోధించొద్దూ? అప్పుడే రసాయన ఎరువులు రంగ ప్రవేశం చేసాయి..  దేశవిదేశీ కంపెనీలన్నీ, ఈ ఎరువులతయారీ లాభసాటిగా ఉంటుందని  గమనించి, ఎడా పెడా ఎరువుల తయారీ కర్మాగారాలు  తెరిచేసారు… ఈ ఎరువుల ధర్మమా అని జరిగిందేమిటంటే, పంట  ఉత్పత్తి పెరిగింది. మరి మందులాటిది వేస్తే పెరక్క మానుతుందా?

ఇదివరకు ప్రకృతిసిధ్ధమైన వాటితో పండే పంటకి ఉత్పత్తి రెండుమూడింతలదాకా పెరగడమైతే పెరిగింది… కానీ, వీటితో పాటు, ఆ పంటలను స్వాహాచేసే, పురుగులుకూడా పెరిగిపోయాయి… వీళ్ళు  Chemical fertilizers  వేసి పంట పెంచడం ఎంత వేగవంతం చేసేరో, అదే వేగంతో పురుగులుకూడా పెరిగిపోయాయి. దీనితో  Pesticides  రంగంలోకి వచ్చాయి. ఆ పంట తినేసే పురుగులని సంహరించడానికి, మరో విషపదార్ధమే కదా వాడాల్సిందీ, దానితో ప్రపంచంలో ఉండే విషపదార్ధాలన్నీ చాలామట్టుకి వాడుకలోకి వచ్చేసాయి.. ఈ  Pesticide  పురుగులకి విరుగుడు కానీ, మనుషులకి ప్రమాదకరమే కదా మరి… 1984  లో భోపాల్  Union Carbide  కర్మాగారం లో జరిగిన ప్రమాదం గుర్తుండే ఉంటుంది, అదేదో  పేలి, విషవాయువులు గాలిలోకి ప్రసరించి,  ఆ గాలి పీలవడంమూలాన భోపాల్ లో ఎంతో మంది  చనిపోవడమో, అంగవైకల్యం కలగడమో జరిగింది.

ఇలాటి ప్రమాదాలైతే ఉంటూనే ఉంటాయి, కానీ ఈ ఆహారపదార్ధాలు తినడం వలన, మనుషుల్లో రోగనిరోధక శక్తీ క్షీణించిందీ, కొత్త కొత్తరోగాలొస్తున్నాయి. బాగుపడ్డదెవరయ్యా అంటే, డాక్టర్లూ, మందులు తయారుచేసే కంపెనీలూనూ..

పంట ఎంత పండిందీ, లాభం ఎంతొచ్చిందీ, మన ఆస్థి ఎంత పెరిగిందీ అనే చూసుకుంటారుకానీ, అసలు ఆ ఎరువులూ, ఆ pesticides  వలన ఎంత  నష్టం జరుగుతోందీ, ఎంతమంది చనిపోతున్నారూ అనే విషయం ఎవరూ పట్టించుకోవడం లేదు…ఎక్కడైనా ప్రమాదంజరిగి మనుషులు చనిపోతే, ఏదో నష్టపరిహారం ఇచ్చేస్తే సరిపోతుంది అనే మన ప్రభుత్వాల  ఆలోచన.

ఈ   artificial  పధ్ధతుల్లో  పండే ఆహారపదార్ధాల్లో ఉండే కష్టనష్టాలు, కొంతకాలంనుండీ, కొంతమందికి అవగాహనలోకి వచ్చింది… “ భూమి గుండ్రంగా ఉంది “ అన్నట్టు, మళ్ళీ పాతపధ్ధతుల్లోకి వెళ్ళి,  అవేవో   Otganic Products  అని మొదలెట్టారు… చిత్రం ఏమిటంటే, వీటి ఖరీదులు , ప్రస్తుతం దొరికే వాటికంటే చాలా ఎక్కువగా ఉండడం… పైసా ఖర్చుపెట్టకుండా, ప్రకృతివనరులతో పుష్కలంగా పండిన పంటకే, ఈరోజుల్లో వేలకువేలు ఖర్చుపెట్టాల్సిరావడం… కారణం మనుషుల్లాగే ప్రకృతి కూడా , తను ఒకనాడు ఉచితంగా ప్రసాదించే వనరులకి కూడా ఓ లెక్క కట్టడం… కారణం కూడా, పాపం ప్రకృతి కాదు… మనమే.. విషపదార్ధాలతో భూమీ, నీళ్ళూ కలుషితం చేసిందెవరంటా.. మనమే కదా.. స్వఛ్ఛమైన నీళ్ళూ, భూమీ దొరకాలంటే, మరి మూల్యంకూడా చెల్లించుకోవద్దూ?

ఒకానొకప్పుడు పళ్ళని స్వతసిధ్ధంగా పండనిచ్చేవారు.. ఈరోజుల్లోనో, అవేవో  Carbide  లు వాడి, క్షణాల్లో , కాయకి , పండు రంగు తెప్పించేసి, మార్కెట్ లో పెట్టి అమ్మేస్తున్నారు… మనమేమో ఎగబడి కొనేస్తున్నాము..  పండడం మాట దేవుడెరుగు, అసలు ఈ రోజుల్లో వచ్చే ఏ కూరకైనా, పళ్ళకైనా ఓ రుచీ పచీ ఉంటోందా …

సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి