లంబు: లడ్డూలు పళ్ళెం లో పెట్టి, నోరు తెరిచి కూచున్నాను. అవి నోట్లోకి వెళ్ళలేదు గురువా?
చిన్నమయ: ఓరి సన్నాసి... నువ్వేం ఘటోత్కచులవారనుకున్నావా? నువ్వే లడ్డూల్ని చేత్తో పట్టి నోట్లో వేసుకోవాలి! ఫో
కిన్నెర పురుషులు: నారద మునీంద్రా నేను లఘు మిత్రుడు, ఇతను భృగుశత్రుడు. మేమిద్దరం విడువని జంట స్నేహితులం. మా ఇద్దరి మధ్య ఎంత ప్రయత్నించినా , కలహాలు రావటం లేదు!
నారదముని: (స్వగతంలో ఒక మంత్రం ఉఛ్ఛరించి, అందమైన అప్సరసగా
మారిపోతాడు)
లఘుమిత్రుడు: ఈ అందగత్తెను చూడగానే మోహించాను. ఈమె నా భార్య!
భృగుశత్రుడు: నేనూ మోహించాను, ఈమె నాకే కావాలి.
(ఇద్దరూ ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని పోట్లాడుకుంటారు)
నారదముని: ఇద్దరి మధ్యా కలహాలొచ్చాయిగా..కొట్టుకోండి..
తిట్టుకోండి.. నేను వస్తా... నారాయణ!
ఒక ఆడచేప, ఇంకో ఆడ చేపతో: ఇక్కడ ఒక్క మగ చేపైనా కనిపించదేం?
ఇంకో ఆడ చేప: ఇక్కడ ఒక్క మగ పురుగు వుంటానికి వీల్లేదు. ఈ ప్రత్యేక కొలనులో రాణివాసం స్త్రీలు స్నానం చేస్తారు, తెల్సుగా?
ఊరికి కొత్త: రాజుగారికి సలాం కొట్టే వాళ్ళ తలలు నరికి కోట గుమ్మానికి వేలాడించారటగా?
ఊరికి పాత: ఆ తలలతో పాటు ఇంకో తల వేలాడుతోంది చూడు!
ఊరికి కొత్త: ఔనూ! అదెవరి తలా?
ఊరికి పాత: (రహస్యంగా) రాజుగారిది! ఇప్పుడు మనల్ని ఏలేది, సైన్యాధిపతి!!
రాజు రంపారెడ్డి: మహామంత్రీ... మీరు క్షుద్రశక్తులు నేర్చారటగా?
మంత్రి మల్లప్ప: ఔను ప్రభూ... నా మంత్ర శక్తితో మీ సిం హాసనాన్ని ముక్కలు చెక్కలు చేయగలను!
రాజు రంపారెడ్డి: మరి ఆగారేం? కానివ్వండీ!
మంత్రి మల్లప్ప: మీరు నా తల నరికిస్తారుగా!
రాజు రంపారెడ్డి: మీ మంత్ర శక్తితో, అతికించుకోవచ్చుగా?
మంత్రి మల్లన్న: ఆ ఒక్క మంత్రం తెలుసుంటే , ఇప్పటి దాకా ఆగే వాడినా ప్రభో!?
రాజా సోమప్ప: శతృ బారి నుండి తప్పించుకు పారిపోవడానికి, రహస్య సొరంగం తవ్వించాము కదా, మంత్రి మల్లప్పా?
మంత్రిమల్లప్ప: సొరంగం తవ్వించడానికి, కారాగార శిక్షితులను నియమించమన్నారు గదా ప్రభూ?
రాజా సోమప్ప: ఔను, పనిపూర్తయిందా?
మంత్రి మల్లప్ప: అరకొరగా పూర్తి చేసి , కారాగార శిక్షితులు తప్పించుకు పారిపోయారు ప్రభూ!!
పుష్పమోహన చక్రవర్తి: అమాత్యా... ఏమీ ఈ విపరీతము? ఘోర తపస్సు చేసి వరుణ భగవానుని మెప్పించి వరం పొందానే... మన రాజ్యం లో ఈ అతివృష్టికి కారణమేమి?
అమాత్యుడు: మహాప్రభూ.. తమరు వరం కోరడం లో తప్పు చేశారు! నెలకు మూడు రోజుల వర్షానికి బదులూ, సంవత్సరానికి మూడు నెలల పాటు వర్షం కోరుకున్నారు. దాని ఫలితమే ఈ అతివృష్టి ప్రభూ!!
మంత్రి తెలివి నాయుడు: మహా ప్రభూ... ఈ యువకుడు భలే శక్తి
సంపన్నుడు. చిన్న యువరాణీ మనసు మార్పించి,
మీరు నిర్ణయించిన రాకుమారుడినే పెళ్ళిచేసుకునేలా, చేయగలడు!
రాజు: చాలు చాల్లేవయ్య! క్రితం సారీ ఇలాంటి వాడినే
తీసుకొచ్చావ్! పెద్ద యువరాణి, వాడితో లేచిపోయింది..హు!!
మంత్రి తెలివి నాయుడు: (రహస్యంగా) ప్రభూ... ఈ యువకుడు,
మీరు నిర్ణయించిన రాకుమారుడే... మారు వేషం లో తీసుకువచ్చాను!!
రాజు: శభాష్ మంత్రి!!
భటుడు: మహారాజా, రాణీగారి వడ్డాణం దొంగలెత్తుకు పోయారని కబురొచ్చింది...!
మహారాజు: రాణీగారు వడ్డాణాన్నెప్పుడూ తీసిపెట్టరే... ఎప్పుడూ అలంకరించుకునే వుంటారే?
భటుడు: అదే చెప్పొచ్చాను ప్రభో! రాణీ గారితో సహా నట!!
ధూమశాసనుడు: సభ పొగమండలం లో మునిగి కనిపిస్తున్నది. సభికులు కళ్ళు మండుతున్నాయంటున్నారు. దగ్గుతున్నారు...
కారణమేమి మంత్రివర్యా?
మంత్రి: ధూమపానం వల్ల ప్రభూ!
ధూమశాసనుడు: సభలో ధూమపానం నిషేధించాము కదా...?
మంత్రి: క్షమించాలి ప్రభో... ఈ పొగ తమరు కాల్చే చుట్ట నుంచి వచ్చి సభనల్లుకుంది!!