మనుషులు అస్తమానూ, ఏదో ఆలోచిస్తూ, ఏవేవో ఊహించేసికుంటూ, ఉంటే, ఏవేవో చేద్దామని, కాకపోతే , తన స్థితిని చూసి, ఒకసారి నిరుత్సాహపడిపోవడం, లాటివి కాకుండా, మనసుని ఉల్లాస పరిచే వినోదంకూడా ఉండాలని, రంగం లోకి సినిమాలు వచ్చాయి.. కనీసం ఆ సినిమా చూసైనా, మనసుని కుదుటబరుచుకుంటాడూ అనే సదుద్దేశ్యంతో.. మనదేశం లో 1913 లో దాదాసాహెబ్ ఫాల్కే గారి ధర్మమా అని , “ రాజా హరిశ్చంద్ర “ అనే మొదటి సినిమా నిర్మించారు. అంతకుముందే 1903 లో సినిమా నిర్మాణం పూర్తయిందనుకోండి. మొదట్లో మాట లేకుండా, కదిలే బొమ్మలూ, దానిచుట్టూ ఓ కథా ఉండేవి. కాలక్రమేణా, ఆ బొమ్మకి కదలికతో పాటు, మాట కూడా జోడించారు.
వీటిని ప్రదర్శించడానికి ఓ జాగా కూడా కావాలిగా మరి, మొదట్లో ఓ డేరా వేసి దాంట్లో చూపించేవారు. జనాలు ఈ వింత చూడ్డానికి వెళ్ళేవారు. మొదట్లో సినిమా తెలుపు, నలుపుల్లో మాత్రమే ఉండేది.. తరవాత్తరవాత వాటికి రంగులొచ్చాయి… ఒకానొకప్పుడు, స్టూడియోల్లోనే నిర్మించే సినిమాలు, మెల్లమెల్లగా బయట ( Outdoor ) లో కూడా నిర్మించడం, మొదట్లో దేశంలోనూ, కాలక్రమేణా విదేశాలకు వెళ్ళి, అక్కడ కూడా తీయడం మొదలయింది.
సినిమాలు ప్రదర్శించడానికి మొదట్లో, టూరీంగ్ టాకీసులు—దాంట్లో ఒకటే Projector ఉండేది. సినిమా రీళ్ళరూపంలో తీసి, ఆ రీళ్ళని డబ్బాల్లో అన్నిచోట్లకీ పంపిణీ చేసేవారు. తరవాత ఈ టూరింగ్ టాకీసుల స్థానంలో, శాస్వత సినిమా హాళ్ళొచ్చాయి.. రోజులు గడిచేకొద్దీ, అవి కూడా పెద్దపెద్ద నగరాల్లో మూతబడి Multiplex లొచ్చాయి. ఒకే థియేటర్లో, ఓ అరడజను Screens అన్నమాట. మొదట్లో వచ్చిన సినిమాలు, 16 mm, 32mm నిడివిలో ఉండేవల్లా, 70 mm కూడా వచ్చాయి.. ఈరోజుల్లో అయితే 3D, 4 D కూడా వచ్చేసాయి…
ఈ రోజుల్లో నగరాల్లో సినిమా చూడ్డమయితే ఖర్చుతోకూడిన పనే, అవడంతో, చాలామంది, TV ల్లో, చూడ్డానికి వీలుగా, ఏ VCD, DVD లో కొనుక్కుంటున్నారు. మళ్ళీ వీటిలో Pirated Cd లోటీ.. దొంగతనంగా, కొత్తగా తీసిన సినిమాకి, లోపాయికారీగా ఓ విడియో తీసేసి, తక్కువ ధరలో అమ్ముకోవడం…
ఈ టీవీలూ అవీ రాకపూర్వం, రేడియోల్లో ఆదివారం మధ్యాహ్నం, రేడియో సంక్షిప్త శబ్ద చిత్ర్ లు వచ్చేవి.. వాటిలో మాట, పాట వినిపించేవి… ఒకానొకప్పుడు ఓ సినిమా తీసారంటే, అందులో ఓ కథ, కొంత నీతి, లాటివి ఉండేవి. కాలక్రమేణా, వీక్షకులని ఆకర్షించుకోడానికి, మసాళా జోడించడం మొదలెట్టారు. ఎప్పుడో ఏడాదికి ఓ పదో, పదిహేనో మంచి కథావస్తువున్న, సినిమాలు తప్పించి, మిగిలినవన్నీ , ఈ మసాళా సినిమాలే… ఓ కథ ఉండదు, ఓ అర్ధం ఉండదు.. వాళ్ళిష్టం.
ఇంక ఈ సినిమాల్లో నటించే పెద్దపెద్ద హీరోలకి అభిమాన సంఘాలూ, వాళ్ళ హీరో ఎంత చెత్త సినిమా చేసినా, వారికి జైజైలు కొట్టడం. ఒకానొకప్పుడు ఏదో లక్షల్లో తీయగలిగే సినిమాలకి ఇప్పుడు, కోట్లలో ఖర్చవుతోంది.. ఈ ఖర్చురాబట్టుకోడానికి థియేటర్లలో టికెట్ ఖరీదులు విపరీతంగా పెంచేయడం.
ఇది వరకటి రోజుల్లో కొత్తగా ఓ సినిమా వచ్చిందంటే, టీవీ లో రావడానికి చాలా టైము పట్టేది.. ఒకానొకప్పుడు, శతదినోత్సవాలూ వగైరా చేసుకునే సినిమాలు వచ్చేవి. ఈ రోజుల్లో మహా అయితే ఓ నాలుగు వారాలు ఆడినా పెద్దమాటే. నాలుగువారాల్లో ఖర్చుపెట్టిన డబ్బు తిరిగిరావడానికి, సినిమాని, ప్రపంచ వ్యాప్తిగా విడుదల చేయడం ఓ కొత్తపధ్ధతి. దానికి సాయం, Sattelite Rights, Digital Rights అమ్మేసుకుని , వీలైనంత త్వరలో డబ్బు రాబట్టుకుంటున్నారు… ఒకానొకప్పుడు సినిమాని ఓ కళనేవారు, ఇప్పుడు అదే సినిమా, మిగిలినవాటిలాగే ఓ వ్యాపారమయిపోయింది…. ఓసారి వ్యాపారాత్మకమైపోయిన తరువాత, డబ్బు ఏదో విధంగా సంపాదించాలేకదా, అందుకోసమని, ఆకర్షించడమే ముఖ్యోద్దేశం గా పెట్టుకుని, మిగిలినవన్నీ అటకెక్కించేసారు.
ఒకానొకప్పుడు ఓ సినిమా చూడాలంటే, సినిమా హాళ్ళకి వెళ్ళి, క్యూల్లో నిలబడి, టిక్కెట్టు కొనుక్కునేవారు. అలాటిది ఈ రోజుల్లో, కంప్యూటర్ లో ఓ నొక్కు నొక్కితే, టిక్కెట్టు ప్రత్యక్షం… టీవీలూ వగైరాలూ కూడా అవసరం లేకుండా, చేతిలో ఉండే మొబైల్ లోనే చూడడం సాధ్యమవుతోందంటే, సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృధ్ధి చెందిందో అర్ధమవుతోంది…
కానీ ఈ అభివృధ్ధితో పాటు, నిర్మించే సినిమాల క్వాలిటీ కూడా పెరిగితే , అడిగేదేముందీ?
సర్వేజనా సుఖినోభవంతూ…