కలశ పూజ ఎందుకు? - గుమ్మా రామలింగ స్వామి

Why do we do Kalasa Pooja?

ఒక రాగి ఇత్తడి వెండి లేక మట్టి పాత్రను తీసుకుని నిండా నీరుపోసి దానికి పసుపు కుంకుమ రాసి అందులో నాలుగు మావిడి ఆకులు ఒక కొబ్బరికాయ ఉంచి దాని చుట్టూ పసుపు దారం చుట్టి మంత్రపూర్వకముగా భగవదారాధన చేసి నిలిపిన దేవతా మూర్తి కలశము. దక్షణగా దానిలో నవరత్నములు వేయు సాంప్రదాయమున్ననూ నేటికాలమున చిల్లరనాణెములను ఉంచుట ఆచారముగా మిగిలినది. దీనిని పూర్ణకలశగాను, పూర్ణకుంభము గాను వ్యవహరించుచున్నారు. భగవదారధన చేసి దేవతా స్వరూపముగా శుభ సూచికముగా భావించు ఈ కలశమునకు హిందూ మతమున విశేష ప్రాధాన్యత ఉన్నది.

హిందువుల గృహమున సకల శుభకార్యములకూ అనగా గృహప్రవేశ, ఉపనయన వివాహ గృహారంభములకు ఈ కలశ స్థాపన ప్రారంభ సూచకముగా దోషములూ అవాంతరములూ కలుగకుండా నిరోధించు దైవశక్తి గా భావింతురు. ఈ పూర్ణ కుంభమును పెద్దలు పీఠాధిపతులు పూజనీయులకు స్వాగతము పలుకుటకునూ ప్రధానముగా శాస్త్రమున చెప్పబడినది.

ఈకలశ పూజ ఎందుకు చెయ్యాలి? సృష్ఠికి పూర్వం శ్రీ మహా విష్ణువు పాల సముద్రము మీద శయనించు చున్న తరుణములో అతని నాభినుండి ఒక కలువ పువ్వు ఉద్భవించినది. దాని మీద కూర్చునివున్న బ్రహ్మ గోచరించెను. అంతా జలమయి వున్న విశ్వములో బ్రహ్మ సృష్ఠి ప్రారంభించెను. ఈ సృష్ఠికి పూర్వమంతయూ జలమయము. ఆ జల మండలము నుండియే సృష్ఠి ప్రారంభమయినది. నీటిని పవిత్రమయినది సృష్ఠికి మూలమయినది గాభావించి దీనికీ ప్రాధాన్య మీయబడినది. సమస్త జీవులకు అధారమయినది ఈ జగత్తు మనుగడకు ప్రధానమైనదీ, నీరని మనకందరకూ తెలుసు. అంత పూజనీయమయినదీ ముఖ్యమయినదీ ప్రదానమయినదీ అను సంకేతము నిచ్చునటుల కలశములో ఉదకము పోయుట సాంప్రదాయమయినది.

దానిపై ఉంచిన కొబ్బరికాయ, మరియూ ఆకులు పరిపూర్ణత్వమునకు సంకేతము. దానిచుట్టు చుట్టిన దారము ప్రేమానురాగాల బంధమునకు సంకేతము. కలశమునకు పూసిన పసుపు కుంకుమలు సౌభాగ్యమునకు సంకేతము ఇంత అంతరార్ధమున్న కలశము అన్ని శుభములకూ ఆదియూ, మంగళకరము అను భావమున కలశస్థాపన పూజ ముందు చెయ్యవలెను.

ఈకలశములోని నీరు సమస్థ పుణ్య నదులనుండి వచ్చినదనీ, సమస్త వేద వేదాంగ ముల,మంత్రముల సారమని సకల దేవతలూ అందులో చేరివున్నారను భావముతో మంత్రపూర్వకముగా వారిని ఆహ్వానించుట జరుగును. ఈ కలశమును పూజించుట విశ్వమునందలి సకల దేవతాముర్తులను పూజించుటయే అను భావము కలుగును. ఇంత పవిత్రమయిన జలము సకల అభిషేకములకూ దైవకార్యములకూ వాడదగినదని భావము. ఈ మహాభిషేకమూ కుంభాభిషకమూ సలక దేవతలకూ ప్రీతిపాత్రమయినదని హిందువుల విశ్వాసము.

క్షీరసాగర మధనము జరిగినపుడు పరమాత్మ ఒక కలశముతో ఉద్భవించి అందులోని అమృతమును దేవతలకు పంచెను. దానివలన వారు మరణమూ వార్ధక్యమూ నాశనములేనివారని హిందువుల నమ్మకము. ఈ జలము అనంతమయినది అని హిందువుల విస్వాసము.ఇట్టి పుణ్యజలముతోను,పూర్ణత్వమునకు సంకేతము కొబ్బరికాయ, పవిత్రతకు సంకేతమయిన మామిడాకులు శౌభాగ్య చిహ్నములు. పసుపు కుంకుమ వేదమంత్ర మిళితమయిన ఈ కలశము పూజనీయము పవిత్రము.

 

శుభం భూయాత్

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు