చివరకి మిగిలేది ఓ మచ్చ… - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

గుర్తుండే ఉంటుంది,  శాస్త్రాల్లో   సౌందర్య సాధనాల గురించి ఎన్నెన్నో వర్ణనలు చదివాము. ఎవరి స్థోమతని బట్టి వారు వాడుకుని, తమ సౌందర్య పోషణ చేసుకునేవారు. స్త్రీలూ, సౌందర్యమూ,  hand in hand  వెళ్ళాల్సిందే. భగవంతుడు స్త్రీలకే ఆ వరం ఇచ్చినట్టున్నాడు.. ఫలానా స్త్రీ చాలా అందంగా ఉందీ, అన్నట్టు, ఏ పురుషుడిగురించీ అంతగా వర్ణనలు వినలేదు.. ఏదో అక్కడక్కడ తప్పించి..
 పురాణాల విషయం పక్కకుపెట్టి, మన చిన్నప్పుడు అంటే ఓ నలభై యాభై ఏళ్ళ పూర్వం, మన ఇంట్లో ఉండే ఆడవారు, అమ్మమ్మో, మామ్మో, అమ్మో, అక్కో, చెల్లెలో , మరి అంత అందంగా ఎలా ఉండేవారో, అదీ ఈరోజుల్లో దొరుకుతున్న  సౌందర్య సాధనాలు అందుబాట్లో లేనప్పుడు, అని ఆలోచిస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది.. అలాగని ఆర్ధికంగా అంత పెద్దస్థాయిలో లేనివారుకూడా, అందంగానే ఉండేవారు. అందం అనేది ఎంత relative term  అయినా, ప్రతీ స్త్రీలోనూ ఏదో ఒక అందం, అదీ సహజసిధ్ధమైనది తప్పకుండా కనిపించేది…  అంతంత మాత్రం సంపాదనతో, అసలు అంత అందంగా ఎలా ఉండేవారో ఆలోచిస్తే తెలుస్తుంది. ప్రత్యేకంగా ఈ సౌందర్య పోషణకి, ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టేవారు కారు. ఈరొజుల్లో వీధివీధికీ వెలిసిన “ బ్యూటీ పార్లర్లు “ ఆరోజుల్లో ఎప్పుడైనా విన్నామా, చూసామా? ఏదో నాటకాల్లోనూ, సినిమాల్లోనూ  నటించేవారి గురించి వదిలేయండి.. సామాన్య గృహిణులగురించి మాట్టాడుకుందాం.

ఇది వరకటి రోజుల్లో  స్నానం చేసేటప్పుడు ఒంటికి సున్నిపిండి అని ఒకటి పట్టించుకునే వాళ్ళు. ఈ సున్నిపిండి తో ఒళ్ళు తోముకోవడం వలన శరీరం మృదువుగా ఉండడమే కాకుండా సువాసనకూడా ఉండేది. ఈరోజుల్లోనో..  సున్నిపిండి మాట దేవుడెరుగు, అసలు స్నానాలు చేయడానికే టైముండడం లేదు.. ఏదో ఒళ్ళు ఓసారి తడుపుకుని, బజారులో దొరికే  ఏ  deodrant  తోనో ఓసారి పుస్ పుస్ మనిపించేసి ఆఫీసుకి వెళ్ళిపోవడమే. అలాగే శుభ్రంగా ఇంట్లో రోటిలో కొట్టుకున్న శుధ్ధమైన పసుపు ,  ఒంటినిండా రాసుకునేవారు.. దీనితో ఒంటిమీద అవాంఛిత రోమాల గొడవుండకపోవడమే కాకుండా, మొహం నిగనిగలాడుతూ ఉండేది.. కానీ ఈ రొజుల్లో చూస్తూన్నదేమిటీ, రకరకాల   creams  తో ఇల్లంతా నింపేయడం… పైగా వీటికి అదేదో ఫౌండేషనోటీ..  వీటన్నిటినీ ఏదో ఒక రసాయనపదార్ధంతోనే తయారుచేయాలి. ఇలాటివన్నీ వాడివాడి  ఏదో ఒక చర్మరోగాన పడ్డం.. ఒక్కోప్పుడైతే క్యాన్సరు బారిన కూడా పడ్డవారిని చూసాము.

అలాగే ఆ రోజుల్లో వయసులో పెద్దవారు, దగ్గరలో ఉండే ఏ కాలవకో వెళ్ళి స్నానం చేసేవారు.. ఆరోజుల్లో సబ్బూ, సింగినాదం ఉండేవి కావు.. హాయిగా ఆ కాలవలోని  మట్టినే ఒళ్ళంతా పట్టించేసేవారు.. శరీరం నిగనిగలాడుతూ ఉండేది… ఆ మట్టినే ఈ రోజుల్లో మార్కెట్ లో “ ముల్తానీ మిట్టీ “ అని ఓ పేరుపెట్టి డబ్బుచేసుకుంటున్నారు. అంతదాకా ఎందుకూ, ఆడవారికి  కళ్ళే అందం,, ఆ కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోడానికి, “ కాటుక “ వాడేవారు.. ఆ కాటుక ఎలా తయారుచేసేవారూ? ఓ ఆముదం దీపం వెలిగించి, ఓ  పెద్దపళ్ళెం దానిమీద బోర్లించేవారు..   దీపంపొగవలన పళ్ళానికి పేరుకున్న నల్లటి నుసిని సుతారంగా ఓ డిబ్బీలో పెట్టి, ఓ నూనెచుక్క వేలికి రాసుకుని, కళ్ళకి పెట్టుకునేవారు. మరి ఇప్పుడో.. సింగార్ లు, ఐటెక్స్ లూనూ.. వాటిని దేనితో తయారుచేస్తారో ఆ దేవుడికే తెలియాలి, తీరా పెట్టుకుంటే కళ్ళేమౌతాయో అని భయం.. దానితో అసలు పెట్టుకోవడమే మానేసారు. అలాగే నుదుటన పెట్టుకునే కుంకం తీసికోండి,  అసలు నుదుట కుంకం బొట్టు పెట్టుకునేవాళ్ళే తక్కువ.. ఒకానొకప్పుడు నుదుట కుంకం ఉన్నవారిని చూస్తే పునిస్త్రీయా, వితంతువా అని గుర్తుపట్టగలిగేవారు… ఇప్పుడు కుంకం స్థానంలో , వేసుకున్న వేషానికి మాచింగ్ గా స్టిక్కర్లు. ఏరంగు బట్ట కట్టుకుంటే ఆరంగు స్టిక్కర్… వాటిని వాడగా వాడగా, చివరకి మిగిలేది ఆ నుదుటన ఓ మచ్చ…

ఇవన్నీ ఒక ఎత్తూ, కేశసంపద ఓ ఎత్తూ.. నల్లటి తాచుపాములా వేళ్ళాడెది జడ. ఈరోజుల్లో అసలు జడ అనేదే కనిపించదూ.. మహా అయితే, ఏ బాపుగారి సినిమాల్లోనో, అదీ ఏ విగ్గో ధరిస్తే మాత్రమే..ఇదంతా ఏదో విమర్శించడానికి కాదు రాస్తూంట.. జీవన విధానంలో ఎన్నెన్ని మార్పులు చోటుచేసుకున్నాయో చెప్పడానికి మాత్రమే…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి