లేనిపోని పెద్దరికాలు... - భమిడిపాటి ఫణిబాబు

leni poni peddarikaalu

ఈరోజుల్లో ఎవరిని చూసినా, తామేదో వయస్సులో తక్కువైనట్టూ, అవతలివారు వయోవృధ్ధులూ అన్నట్టు, ఆ అవతలివారికి లేనిపోని "పెద్దరికం" ఒకటి అంటగట్టేస్తూంటారు. మొట్టమొదటిగా, కనిపించిన ఆడవారిని "ఆంటీ" అనీ, మగవారిని "అంకుల్" అనీ పిలిచేయడం, ఆ అవతలివాడు అప్పుడే ఓ డిగ్రీ సంపాదించి ఉద్యోగంలో చేరినవాడైనా సరే, పోనీ ఏ చిన్నపిల్లలచేతో అలా పిలిపించేడనుకుందాం, కానీ ఆ పిల్లాడి తండ్రికేం రోగం? పైగా అలా పిలిచేవాడు, అప్పటికే ఓ బిడ్డ తండ్రికూడానూ, అయినా సరే, అవతలివాడిని వయస్సుతో నిమిత్తం లేకుండగా , అంకులేమిటీ, పెంకులూ, అని సంబోధించడంలో ఓ పైశాచికానందం వస్తుందనుకుంటాను. ఎవడో తిరగబడి వాడిని అంకులూ అంటే మాత్రం ఎక్కడలేని ఉడుకుమోత్తనమూ వచ్చేస్తుంది. " అదేమిటండీ, మొన్ననే పెళ్ళయి, ఈమధ్యనే తండ్రి అయానూ, అప్పుడే అంకులయిపోయానా ఏమిటీ, ఇంకా ఎంతా... ముఫై ఏళ్ళే కదండీ... ". మరి అవతలవాడి ఫీలింగులు కూడా అదే పధ్ధతిలో ఉంటాయేమో అని ఆలోచించొద్దూ, వెధవ్వేషాలు కాపోతే.

ఇంక ఆడవారి విషయం అడగనే అఖ్ఖర్లేదూ, అవతలి వారిని ఏ "అన్నయ్యో.... " అనేస్తే ఓ గొడవొదిలిపోతుంది. కానీ అలా పిలవబడ్డప్పుడు, ఈ పిలవబడినాయన ఇల్లాలుకి మాత్రం పొడుచుకొచ్చేస్తుంది." వేషాలు కాపోతే ఏమిటండీ, మీరు ఆవిడకి అన్నయ్యా, క్రిందటేడాదే ఆవిడ షష్ఠిపూర్తికి అక్కడెక్కడికో వెళ్ళారనికూడా చెప్పిందీ, ఆవిడకేమో మీరు రిటైరయ్యేముందరే అరవైఏళ్ళూ నిండేయికదా, ఇప్పుడీ కొత్త చుట్టరికం ఏమిటంట? " అని ధాంధూం అనేస్తుంది. నిజమే కదా, ఎందుకొచ్చిన గొడవలు చెప్పండీ, ఇప్పుడు ఉన్నవాళ్ళు చాలకా ఏమిటీ ఈ కొత్త చుట్టరికాలు? అనుకుంటాం కానీ, వాళ్ళు పిలవకా మానరూ, నోరులేనివాళ్ళు ఊరికే గింజుకోవడం తప్ప పిలిపించుకోకా మానరు.

ఓ ఆడపిల్లకి పెళ్ళయిందంటే చాలు పాపం " ఆంటీ" అయిపోతుంది. ఏదో ఇంట్లోవాళ్ళూ, చుట్టాలూ ఓ అక్క అనో, వదినా అనో, అత్తా అనో పిలిస్తే బాగుంటుందికానీ, ఈ మాయదారి " ఆంటీ" శబ్దానికి బలైపోవడం బాగోలేదు. చివరకి ఇలా ప్రతీవారిచేతా పిలవబడి నిరాశా నిస్పృహలకి లోనై, పాపం తనూ తిరగబడి కనిపించిన ప్రతీవారినీ ఇలా అంకుల్, అన్నయ్యగారూ, ఫలానాగారూ , ఆంటీ, అని పిలిచి తన "కసి" తీర్చుకుంటూంటుంది. పాపం స్వతసిధ్ధంగా మనసు మంచిదే కానీ, ఎన్నాళ్ళు ఈ చిత్రహింస భరిస్తుందీ? అందుకని అలా పిలిచేవాళ్ళ అంతరంగం ఏమిటో కూడా అర్ధం చేసికుంటూండాలి, పాపం వెర్రితల్లి ఒంటిమీద ఓణీ వచ్చినప్పటినుండీ , అక్కా అనీ, మెడలో మంగళసూత్రం పడినప్పటినుండీ ఆంటీ గా అయిపోయిందేమో అని, ఓ benefit of doubt ఇవ్వాలి తప్పకుండా.

ఓ తల్లి అయినతరువాతో, తండ్రయిన తరవాతో, పాపం అన్నీ పిల్లలకోసమే చేస్తూంటారు. ఇంట్లోకి ఏదైనా తినుబండారమో, తెస్తే ఆ తల్లి ముట్టనైనా ముట్టదు, పాపం పిల్లలు తింటారులే అనుకుని, ఇంక తండ్రంటారా, ప్రేమలమాటలెలా ఉన్నా, ఇంట్లోవాళ్ళందరికీ తెచ్చే స్థోమతా, ఓపికా లేక, ఏదో పిల్లలు తినలేక వదిలేసినదానిని నోట్లో పడేసికుని సరిపెట్టేసికుంటాడు. కానీ, ఈ "సద్దుకుపోవడం" అనేదుందే, జీవితాంతం నీడలా వెంటాడి, ప్రాణం మీదకి తెస్తుంది. పిల్లలు పెద్దవారైన తరువాత, తమ పిల్లలతో ఏ హొటల్ కో వెళ్ళారనుకోండి, అకస్మాత్తుగా వీడికి అంటే ఆ హొటల్ కి తీసికెళ్ళి తనపెళ్ళాం పిల్లలకి ఏ ట్రీట్టో ఇస్తూన్నవాడికన్నమాట, గుర్తుకొస్తుంది. అరే అమ్మకి ఫలానాది ఇష్టంలేదూ, డాడీ కి ఫలానాది ఇష్టం ఉండదూ అని, ఏ ఫుల్కాలో, చపాతీలో తెప్పించి ఊరుకుంటాడు. వీటికి సాయం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, కాఫీ, చాయి లలో ఈ వయోవృధ్ధుల మొహం చూడ్డంతోనే తెలిసిపోతుందనుకుంటా, రోగం ఉన్నా లేకపోయినా సరే, పంచదారమాత్రం వేయరు. అదేదో కషాయం లాగానే త్రాగాలి. పైగా " సుగరాండీ" అని , మనకి డయాబెటీస్ ఉందని అడుగుతున్నారో, లేక కాఫీ, చాయి లలో పంచదార వేయొచ్చా అని అడుగుతున్నారో ఛస్తే తెలియదు. అదృష్టంకొద్దీ, మనకు సుగర్ వ్యాధి లేదనుకోండి, పోనీ " లేదండీ" అని జవాబిచ్చినా, వారు మాత్రం అయ్యో పాపం అనే పరామర్సిస్తారు కానీ, పోనీ ఈయన ఆరోగ్యంగానే ఉన్నాడేమో అని మాత్రం ఆలోచించరు. దీన్నే అంటారు ఈ జన్మలో చేసికున్న పాపాలకి శిక్ష ఈ జన్మలోనే అనుభవించాలని! అందుకే లేనిపోని త్యాగాలకి వెళ్ళకుండా హాయిగా కావాల్సినవేవో ఢంకా బజాయించి తినేయడమే.

ఇక రిటైరయేరనగానే వచ్చే కష్టాలు ఇంకోరకం. అన్నిటిలోకీ ముఖ్యమైనది ఈ రిటైరయినవాళ్ళకి ఏ అరుగుమీదో మడతమంచమే దిక్కు. చుట్టాల్లో మన సంబంధభాందవ్యాలని బట్టి, బతికే ఉన్నాడు కాబట్టి, ఎవరింట్లో పెళ్ళిలాటిదో, ఏ శుభకార్యమో జరిగిందంటే ఓ పిలుపు వస్తుంది. ఉన్న ఒక్క పెళ్ళాన్నీ తీసికుని ఆ పెళ్ళికి వెళ్ళడం, ఇంక అక్కడ చుట్టాలందరూ " అబ్బ పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు పిన్నీ... " అంటూ మొదలెట్టి, వీళ్ళకి లేనిపోని పెద్దరికం ఒకటి ఆపాదించేస్తారు. పాపం ఆయనేమీ పెద్ద వయస్సులో ఉన్నవాడుకాకపోయినా సరే, క్రిందటేడాదే రిటైరయ్యాడు, అలాగని పీపీఓ, లాస్ట్ పే సర్టిఫికెట్టూ తీసికుని బయలుదేరడుకదా, కర్మకాలి జుట్టు తెల్లబడిపోయింది. ఈరోజుల్లో చాలామందిలాగ డయ్యింగూ అదీ చేసికోకపోవడంవల్ల వచ్చిన అనర్ధం అన్నమాట, సీనియర్ సిటిజెన్ లెఖ్ఖల్లోకి వచ్చేశాడు. ఇంక చూడండి ఎక్కడలేని మర్యాదలూ, పురోహితుడు కూడా మన చేతిలో అక్షింతలు ముందుగా పెడతాడు. నూతన వధూవరులని పిలిచి, కాళ్ళకి దండాలు పెట్టించడమూ, ఆ నవదంపతులు అప్పటికే కనిపించిన ప్రతీ చుట్టానికి దండాలు పెట్టి పెట్టి, విసుగేసి, మన కాళ్ళు లాగేస్తాడేమో అని భయం ఒకటీ. ఏదో దండాలవరకూ అయితే ఫరవాలేదు, భోజనం విషయానికొచ్చేసరికే అసలు గొడవంతానూ. ఒకవైపున డైనింగు హాల్లో అందరూ ఓ పళ్ళెం చేతిలో పట్టుకుని, అక్కడ పెట్టిన ప్రతీ కౌంటరులోకీ వెళ్ళి, కావాల్సినవేవో తీసికోవడమూ, ఈ " పెద్దరికం" ఆపాదించిన వాళ్ళని ఎక్కడకీ కదలనీయకుండగా, ఓ చిన్న పిల్లాడిని కాపలాగా పెట్టడం" తాతయ్యని జాగ్రత్తగా చూసుకోరా బాబీ... " అంటూ. ఇంక ఆ బాబిగాడికేమో ఎక్కడలేనీ ఉత్సాహం వచ్చేస్తుంది. ఏ కూల్ డ్రింకులువాడొచ్చినా సరే, "తాతగారికి ఇలాటివి పడవూ... " అనేసి వాడిని పంపించేయడం. ఏదో అందరిలాగే తనూ షడ్రసోపేతమైన విందులో, తనక్కావాల్సినవేవో తిననీయకుండగా, ఓ టేబులోటి విడిగా వేసి, పథ్యం భోజనంలాటిదోటి పెట్టడం. పెద్దాయనకదా ఓపుకోలేడేమో పాపం అంటూ.

అన్నిటిలోకీ అసలు శిక్ష ఏమిటంటే, వెళ్ళిపోతూండగా పెట్టే బట్టలవిషయంలో. పెద్దవారుకదా అని ఓ పంచలచాపు, జామారూ పెట్టి దండం పెట్టడం. ఇలా పెళ్ళిళ్లకి వెళ్ళి వెళ్ళి, బీరువానిండా మిగిలేవేమిటంటే ఈ పంచలచాపులు. అసలు పెట్టమని ఎవడడిగాడూ? పోనీ ఇవేమైనా కట్టుకుంటాడా అంటే, అదీ లేదూ. ఇదివరకటి రోజుల్లో మన పెద్దవారు, ఓ పంచా లాల్చీ తోటే ఉండేవారుకనుక పరవాలేదు కానీ, ఈరోజుల్లో క్యాప్రీలూ, నిక్కర్లూ, టీషర్టులూ వేసికొనే ఈ " తరపు" పెద్దవారిని ఇలా ఇరుకులో పెట్టడం ఎందుకో?

ఇలా చెప్పుకుంటూ పోతే లేనిపోని " పెద్దరికాల" వలన అన్నీ నష్టాలే అని కాదూ, ఒక్కొక్కప్పుడు " లాభాలూ" ఉంటాయి. ఏ రిజర్వేషన్ క్యూలోనో విడిగా నుంచోనిస్తారు, ఏ బస్సులోనో, రైల్లోనో ఏ వయస్సులోనో ఉండే ఆడవారు, వీళ్ళ ప్రక్కన కూర్చోడానికి ఏమీ సందేహించరు. ఇలాటివన్నీ perks లోకి వస్తాయి. ఏదో అప్పుడప్పుడు వస్తూంటాయికదా అని ఈ " లాభాల" ప్రలోభంలో పడతారా ఏమిటీ? అయినా కట్టుకున్న పెళ్ళాం భరిస్తోంది చాలదూ... "ఏవండీ" లోంచి " ఏమయ్యోయ్. . " లోకి వచ్చినప్పుడే అసలు గొడవంతానూ...




భమిడిపాటి ఫణిబాబు

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు