యువరాణి : తండ్రి గారూ, నేను వివాహమాడితే పొరుగు రాజ్యం యువరాజుని కాదు, ఒక సామాన్య కవిని !
రాజు : ఎందుకమ్మా ఈ నిర్ణయం?
యువరాణి : నేను దుఃఖం నటించి కన్నీరు కారాచాను, ఆ యువరాజు, నా కన్నీటి బిందువులు రక్తబిందువులుగా కనిపిస్తున్నాయన్నాడు. ! కవి, నా కన్నీటి బిందువులు, ఇంధ్రధనుస్సు రంగులను వెదజల్లుతున్నాయన్నాడు. ! నాకు కవి నచ్చాడు. !
మంత్రి యాదన్న : మహారాజా, వ్యవసాయదారులు రుణాలు మాఫీ చేయమంటున్నారు !
రాజు రచ్చన్న : చేసేద్దాం !
మంత్రి యాదన్న : కోశాగారంలో నిధులు లేవు ప్రభూ !
రాజు రచ్చన్న : మనం వ్యాపారస్తులకి పెద్ద ఎత్తున నిధులిచ్చాము కదా ? ఆ ధనాన్ని వాళ్ళనుండి వెంటనే వసూలు చెయ్యండి !!
మంత్రియాదన్న : వాళ్ళందరూ పొరుగు రాజ్యాలకి వెళ్ళిపోయి, అక్కడ స్థిరపడిపోయారని తెలిసింది ప్రభూ!!
రాజు కోపరాజు : మహామంత్రీ, మన రాజ్యంలో విద్యావిధానం భ్రష్టుపట్టిందటగా?
మంత్రి కొమ్మన్న : ఔను ప్రభో...ఉన్నతాధికారులూ, ఉపాధ్యాయులూ, పరీక్షలకి ముందే ప్రశ్నాపత్రాలు రహస్యంగా విడుదల చేసి, సొమ్ము చేసుకుంటున్నారు !
రాజు కోపరాజు : వాళ్ళని చెరపట్టి, సున్నపు పాతరలలో తోయకపోయారా ?
మంత్రి కొమ్మన్న : ( రహస్యంగా) వాళ్ళవెనక, చిన్నరాణిగారి అండ వుందని తెలిసింది రాజా!!
రాజుకోపరాజు : ( స్వగతంలో) చిన్నరాణి, తాను కొన్న వెలలేని రత్నాలహారం చూపించింది...! అంతడబ్బు ఆమెకెక్కడిదీ? అనుకున్నాను!!
పొట్టిశెట్టి : భార్యామణీ...నేను కాననలకి వెళ్ళిపోయి, నా శేష జీవితాన్ని కందమూలాలు తింటూ గడపదలచుకొన్నాను !
భార్యామణి : మధుమేహంతో ఇప్పుడు మాత్రం ఏం తింటున్నారూ? అవేగా??
మంత్రి మారన్న : మహారాజా, మన పొరుగురాజ్యం నుండి మన వేపు పారేనదికి, సరిహద్దులలో, ఆ రాజ్యం వాళ్ళు, ఆనకట్ట కట్టారు ప్రభూ!
రాజు శూరన్న : వెంటనే ఆ ప్రదేశం ముట్టడి చేసి, ఆనకట్ట పడగొట్టండి !
మంత్రి మారన్న : ముప్పు మనకే ప్రభూ ! నది నీళ్ళు మన వూళ్ళని ముంచేస్తాయి. పైగా, మనమే ఈ వ్యూహాన్ని పొరుగు రాజ్యానికి నేర్పినవాళ్ళమవుతాము.
రాజు శూరన్న : అంటే?
మంత్రి మారన్న : వాళ్ళు మనమీద దాడి చేయాలనుకొంటే, ఆనకట్ట, వాళ్ళే పగలగొట్టి, మనవూళ్ళని ముంచి, మన రాజ్యంలో ప్రవేశించవచ్చు
మంత్రి మారన్న : పొరుగు రాజ్యంతో స్నేహంగా వుండి, మనకి కావలసినంత నీళ్ళు రప్పించుకుందాం ప్రభూ!
మహారాజు : మహామంత్రీ, రాజ్యపాలన అంతా మీరే ఘనంగా నిర్వహిస్తున్నారు. మీ నుంచి అశేష గౌరవం కారణంగా మీరు, నా పక్కన, ఈ సిమ్హాసనం మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాను.
మహామంత్రి : నాకభ్యంతరం లేదు ప్రభూ! ఐతే, నా భార్య, రాణీగారి పక్కన కూర్చోవాలని ఆశపడితే, అదెలా కుదురుతుంది మహారాజా...?
ఒక భటుడు : ఇంతమంది కన్యలు, తలా ఒక వింజామర చేతబట్టుకుని వరుసగా నించుని ఉన్నారే?
రెండవ భటుడు : లోపల రాజుగారు వింజామర కన్యల ఎంపిక జరుపుతున్నారు !
మూడవ భటుడు : ఈ వరుస ముందుకు జరగడము లేదే ?
నాలుగవ భటుడు : ఒక కన్య వింజామర వీచిన గాలికి, నిద్ర పట్టి రాజుగారు సిమ్హాసనం మీద గురక పెడుతున్నారు....గురక వినిపించడం లేదాఆ...?
మంత్రి : సేనాధిపతీ...మన సైన్యాన్ని జొన్నకంకుల సైన్యం అని జనం ఆడిపోసుకుంటున్నారే? అపహాస్యం చేస్తున్నారే?
సేనాధిపతి : మనం సైనికులకి సకాలానికి వేతనాలివ్వనందున, వరి ధాన్యం కొనుక్కోలేక జొన్నచేల మీద పడి కంకులు తిని పొట్ట పోసుకుంటున్నారు !
మంత్రి : ఇప్పుడు వేతనాలు క్రమం తప్పక ఇస్తున్నాం కదా ?
సేనాధిపతి : జొన్నకంకులకి సైనికులు అలవాటుపడి పోయారు మంత్రివర్యా !
రాజు సొంపన్న : నీ అందచందాలకి నేను ముగ్ధుడనయ్యాను రాణీ !
రాణీరత్నమ్మ : ఇదేమాట ప్రతి రాణితో పలికీ కడుపులు చేస్తున్నారు !
రాజు సొంపన్న : సంతానాభివృద్ధి శ్రేయస్కరమే కదా ?
రాణి రత్నమ్మ : (మొహం తిప్పుకుంటూ) అంతఃపురంలో అంతా కాంపులే., మంత్రసానులు కరువయ్యారు !! హు!!
సేనాధిపతి : ( పరుగుమీద వచ్చి), రాజా, మనం రామాయణకాలం యుద్ధాన్ని చవిచూడబోతున్నాం !
రాజు : అంటే, అస్త్రాలూ, శస్త్రాలుతోనా?
సేనాధిపతి : శత్రురాజు, కోతుల సేనతో దాడి చేయబోతున్నాడట!!
...