తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu

చెన్నై లో ముఖ్య ప్రదేశాల గురించి తెలుసుకున్న తరువాత చెన్నై నగరానికి దగ్గరగా వున్న నగరాలలోని పర్యాటక స్థలాల గురించి తెలుసుకుందాం .

ముందుగా చెన్నై కి సుమారు 140 కిలోమీటర్ల దూరం లో వున్న వెల్లూరు గురించి తెలుసుకుందాం .

చెన్నై బెంగుళూరు రైలు మార్గం ద్వారా వెళితే కాట్పాడి రైల్వేస్టేషను లో దిగి సుమారు పది కిలోమీటర్లు రోడ్డు మార్గం లో ప్రయాణించి వెల్లూరు చేరుకోవచ్చు , రోడ్డుమార్గం లో అయితే చెన్నై బెంగుళూరు రోడ్డు మార్గం లో వుంది వెల్లూరు .

బ్రిటిష్ కాలంలో సౌత్ ఆర్కాటు జిల్లా గా పిలువబడేది , యిప్పుడు వెల్లూుర జిల్లాగా పిలువబడుతోంది . 

       చరిత్రలోకి వెళితే వెల్లూరు చోళ , పల్లవ , రాష్టకూట , విజయనగర , మరాఠ , కర్నాటక నవాబుల పరిపాలనలో వుండి బ్రిటిషు వారి చేతులలోకి వెళ్లింది . 

         వెల్లూరు క్రిష్టియన్ మెడికల్ కాలేజి మన దేశంలో బాగా పేరు పొందింది . వైద్యరంగంలో  బాగా పేరుతెచ్చుకున్న మొదటి సంస్థ యిది . ఇప్పటికీ యీ ఆసుపత్రికి మనదేశంలోనే కాదు యిరుగుపొరుగు దేశాలనుంచి యెంతోమంది రోగులువచ్చి ఆరోగ్యవంతులై వెళుతూవుంటారు . 1960 లలో బ్రెయిన్ ట్యూమర్ లాంటి ప్రమాదకరమైన రోగాలకి యిక్కడ మాత్రమే వైద్యం అందుబాటులో వుండేది . వెల్లూరు యిన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో చేరి యింజనీర్లు కావాలని యెందరో విద్యార్ధుల కల . మనదేశంలో గల యేకైక అరబిక్ యూనివర్సిటీ కూడా యిక్కడే వుంది .

             వెల్లూరు యిప్పుడేకాదు కొన్ని శతాబ్దాలకు ముందునుంచి విద్యా వైద్య రాజకీయ పరంగా పేరుపొందింది .

          వెల్లూరులో ముఖ్యంగ చూడవలసినది యిక్కడి కోట . ఈ కోటకు కొన్ని శతాబ్దాల చరిత్రవుంది . 

         విజయనగర రాజుల కాలంలో అంటే సుమారు 1520 లలో కోటనిర్మాణం గావించేరు . సుమారు 17 వ శతాబ్దం లో జరిగిన కర్నాటకయుధ్దంలో యీ కోట అంత్యంత పటిష్ఠమైనదిగా గుర్తించేరు . బ్రిటష్ పాలనలో కూడ యీకోట అంత్యంత ప్రాధాన్యతని పొందింది . యెన్నో యుధ్దాలను చూసిన యీకోట విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తిశ్రీరంగరాయ పరివారపు వూచకోతకు ప్రత్యక్షసాక్షిగా నిలిచింది . టిప్పుసుల్తానుని , ఆఖరు శ్రీలంక రాజుని యీ కోటలో రాజకీయ బందీలుగ నిర్భందించేరు . 1806 లో సిపాయిల తిరుగుబాటుకు బీజం పడ్డది యిక్కడే , 1857 లో సిపాయిల తిరుగుబాటు సమయంలో ముఖ్యపాత్ర పోషించింది యీ కోటే . రెండు ప్రపంచయుద్ధాలలో వెల్లూరు సైనికులు పాల్గొన్నారు . మొదటి ప్రపంచయుద్ధంలో వీరమరణం పొందిన సుమారు 300 మంది వీరుల జ్ఞాపకార్ధం 1920 లో యిక్కడ గంటస్థంబం నిర్మించేరు . 

            ఈ కోట యెన్నో యుధ్దాలను చూసింది , అయితే శిధిలమవలేదు . ఈ కోటలో హైదర్ మహలు , టిప్పుమహలు , కాండి మహలు , బాద్షా మహలు , బేగం మహలు వున్నాయి . 

       ఈ కోటలో వున్న జలకంఠేశ్వర ఆలయం మరో విశేషం . 1550 ల ప్రాంతాలలో విజయనగర పరిపాలనలో వున్నప్పుడు కోటలోని కొలనులో మధ్యన , కొలనులో నీళ్లు లేనప్పుడ పెద్ద చీమలపుట్ట పెట్టిందట . ఓ రోజు రాత్రి విజయనగర వంశానికి చెందిన రాజు సదాశివ మహారాయ గారికలలో ఈశ్వరుడు కనిపించి చీమలపుట్ట స్థానంలో  శివలింగాన్ని ప్రతిష్టించమని చెప్పగా అక్కడ శివలింగాన్ని ప్రతిష్టించినట్లుగా చెప్తారు . శివలింగం వున్న కొలను సుమారు 8 వేల చదరుపు అడుగులు , శివలింగానికి చుట్టూర కొలను నీరు వుండడంతో శివుని కంఠానికి అమర్చిన మాలలా కనిపించడం వల్ల యిక్కడ శివుని జలకంఠేశ్వరుడు అని అంటారు . ఈ మందిరం లో యేనుగలు , గుర్రాలు , సింహంలాంటి ఆకారాలు చెక్కబడివున్నాయి , అమ్మవారు అఖిలాండేశ్వరిగా పూజలందుకుంటోంది . వంద అడుగుల యెత్తైన రాతి గోపురం యిప్పటికీ చెక్కుచెదరక వుంది . జలకంఠేశ్వరునుకి ప్రతీరోజూ అభిషేకాదులు నిర్వహిస్తూ వుంటారు . జలకంఠేశ్వరుని అభిషేకానికి వుపయోగించే నీరు కోటలో వున్న బావిలోంచి తెస్తారు , ఆ బావిని గంగా గౌరీ తీర్థం అని అంటారు .

           గర్భగుడికి యెదురు వున్న నంది కి వెనుకవైపు వున్న దీపానికి చాలా శక్తులు వున్నాయట , మేం వెళ్లినప్పుడు మాకు తెలియలేదు , తెలిసుంటే నిజనిజాలు తెలుసుకొని వుందును . భక్తులు మనసులో కోరిక కోరుకొని యీ దీపం మీద చెయ్యపెడితే కోరిక తీరేట్టైతే దీపం గుడ్రంగా తిరుగుతుందట , దీపం తిరగలేదు అంటే కోరిక తీరదని భక్తుల నమ్మకం  . ఈ మందిరంలో కాలసర్ప దోషనివారణార్ధం వెండి బంగారు బల్లులు , పాములను సమర్పిస్తారు .

        ముస్లిం రాజుల కాలంలో చాలా హిందూదేవాలయాలు పడగొట్టబడ్డాయి , ఆ క్రమంలోనే యీ కోవెలలోని విగ్రహాలు కూడా చాలా దెబ్బతిన్నాయి . ముస్లిం పాలకులనుంచి అమ్మవారి విగ్రహాన్ని రక్షించి వినాయకుడి మందిరంలో దాచేరు . మధుర , అయోధ్య లలో లాగే యిక్కడకూడా అమ్మవారి ఆలయాన్ని ఆనుకొని మసీదునిర్మాణం చేసేరు . బ్రిటిష్ పరిపాలనలో అమ్మవారి మందిరాన్ని  ఆయుధాగారంగా మార్చేరు . 1981 వరకు అమ్మవారికి పూజాదులు వినాయకుడి మందిరంలోనే జరిపేవారు . స్థానిక భక్తుల చొరవతో 1981 లో అమ్మవారిని మరల అమ్మవారి మందిరానికి తరలించి పూజారులు నిర్వహిస్తున్నారు . ఈ కోట ఆర్కియాలజీ వారి ఆద్వైర్యంలో వుంది మందిరం మాత్రం తమిళనాడు ప్రభుత్వం ఆధీనంలో వుంది .

            వెల్లూరు కోటలో 150 సంవత్సరాలక పూర్వం నిర్మించిన సైంట్ జాన్స్ చర్చ్ కూడా వుంది . 

         వెల్లూరు తోలుపరిశ్రమకి కూడా పేరుపొందింది , దేశంలోని మొత్తం తోలుపరిశ్రమలో యిక్కడ 80 శాతం వున్నట్లు అంచనా . అయితే యివి చాలా మటికి విదేశాలలో మత్రమే అమ్మకాలు చేస్తాయి . 

         వెల్లూరులో యింకా చూడదగ్గ ప్రదేశాలు ఆర్ట్ గేలరీ , టిప్పు కుటుంబ సభ్యుల సమాధి కూడా వున్నాయి .

          వచ్చేవారం శ్రీపురం గురించి చదువుదాం , అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు