అందమైన అమ్మాయిలకు అంతకన్నా అందం నీలాలలాంటి కురులే. నడుమొంపు వరకూ జాలువారే కురులు అమ్మాయిల అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అయితే ఈ జనరేషన్ అమ్మాయిల్లో ఎంతమంది తమ కురులను జాగ్రత్తగా చూసుకుంటున్నారు.? లెక్క వేసి చెప్పడం కూసింత కష్టమే. ఎందుకంటే ట్రెండీ పేరు చెప్పి తమ లాంగ్ లాంగ్ హెయిర్‌ని అమ్మాయిలు పాడు చేసుకుంటున్నారు. యూ కట్స్, వీ కట్స్, షార్ట్ కట్స్ అంటూ ఏవేవో పేర్లు చెప్పి, పొడవాటి జుట్టును కత్తెర్ల పాలు చేస్తున్నారు. సహజంగా వచ్చిన కర్లింగ్ హెయిర్‌ని స్ట్రెయిటినింగ్ పేరుతో హింస పెడుతున్నారు. స్ట్రెయిట్ హెయిర్‌ని రకరకాల మిషన్స్ సాయంతో కర్లింగ్ చేస్తున్నారు. ఇలా చేయడంతో జుట్టు తన సహజత్వాన్ని కోల్పోయి, ధృడత్వం తగ్గిపోతోంది. తద్వారా కాని వయసులోనే వైట్ హెయిర్ రావడం, విపరీతంగా ఊడిపోవడం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి.
ఈ ట్రెండీ ఫ్యాషన్ జుట్టు పాడవడానికి ఓ కారణం అయితే, మరో ముఖ్య కారణం ఒత్తిడి. ఈ ఒడిదుడుకుల జీవన శైలిలో భాగంగా అధిక ఒత్తిడికి లోనవుతోంది యువత. కేవలం ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకూ ఈ మధ్య జుట్టు సమస్య తీరని సమస్యగా మారిపోయింది. డాండ్రఫ్, వైట్ హెయిర్ తదితర సమస్యలు అమ్మాయిలతో పాటు, అబ్బాయిలను వేధిస్తున్నాయి. ఇదివరకట్లో అరవై ఏళ్లు పైబడిన వారికే తెల్ల జుట్టు వచ్చేది. దాన్ని బట్టే వయసు లెక్క వేసేవారు. కానీ ఇప్పుడు పదేళ్ల వయసు పిల్లల్లోనే తెల్లజుట్టు సమస్య వేధిస్తోంది. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? చెప్పండి. మనం తినే ఆహారపు అలవాట్లు. కాలుష్యం తదితర ప్రతికూల వాతావరణ సమస్యలు జుట్టు రాలిపోవడానికి, ఊడిపోవడానికి ముఖ్య కారణాలు అవుతున్నాయి.
జుట్టు సమస్యను చిన్న సమస్యగా భావించకూడదు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్లో విరివిగా లభించే హెయిర్ డైల వాడకం ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. వీటి తయారీలో వాడే హైలీ కాన్‌సన్‌ట్రేడెడ్ కెమికల్స్ కారణంగా క్యాన్సర్ తదితర తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. మార్కెట్లో ఎక్కువగా లభించే షాంపూలు కూడా ఈ జుట్టు సమస్యకు కారణమవుతున్నాయి. పూర్తిగా మానేయడం సాధ్యం కాదు కానీ, వీలైనంతవరకూ హెయిర్ డైల జోలికి యువత పోకుండా ఉండడం మంచిది. అలాగూ ఆల్మండ్స్‌ని ఎక్కువగా తీసుకోవాలి. ఆల్మండ్స్‌ని ఎక్కువగా తినే వారిలో జుట్టు సమస్యలు తక్కువగా వస్తున్నాయనీ ఓ సర్వే ద్వారా తెలిసింది. అలాగే ఆకుకూరలు, ఫ్రూట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా జుట్టు సమస్యల్ని కొంతవరకూ పరిష్కరించుకోవచ్చని వైద్యులు చెబుతున్న సలహా.