ప్రతాప భావాలు! - -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

ఈవారం విషయం రాసే ముందు, వాస్తవంగా జరిగిన  ఒక కథ చెబుతాను. ఒకసారి మాచుట్టాలమందరం మంగళగిరికి దగ్గరగా ఉండే మా పెద్దమ్మా వాళ్లింట్లో వాళ్ల మనవడి ఒడుగు ఉంటే వెళ్లాం.

ఆ రోజు సాయంత్రం మా మావయ్యాఅత్తయ్య వాళ్ల పిల్లలతో మంగళగిరి పానకాలస్వామి దర్శనానికి వెళ్లాను. అందరం ముందు నడుస్తుంటే వెనక మా అత్తయ్యొక్కత్తీ చిన్నగా రావడం చూసి, జాలిపడి నేను వెనక్కెళ్లి ఆవిడతో కబుర్లు చెబుతూ నడవసాగాను.

కొద్దిగా నడిచాక అక్కడున్నపుస్తకాల షాపు చూపించి "ఒరే సుబ్బూ, ఒకసారి లోపలికి వెళ్లి చూసొద్దాం పద"అంది.

నేనూ ఆవిడతో లోపలికి నడిచాను.

అక్కడున్న పుస్తకాలు చూస్తూన్న మా అత్తయ్య ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేస్తూ"ఈ కార్తీక పురాణం ఎక్కడా దొరకలేదురా, ఈ పుస్తకం కోసమే షాపుకు వచ్చాను, దొరికింది" నాతో ఆనందంగా అని "బాబూ ఎంత" షాపతన్ని అడిగింది.

అతను ‘ఐదు రూపాయలు’ అన్నాడు.

"మామయ్యావాళ్లూ ముందుకెళ్లిపోయినట్టున్నారు. నీ దగ్గరుంటే ఇవ్వరా"అంది.

నేను ఆనందంగా ఇచ్చాను.

స్వామి దర్శనం చేసుకుని, తర్వాత అందరం హైదరాబాదు (మామయ్యావాళ్లు హైదరాబాదులోని కూకట్ పల్లి లో ఉంటారు)వచ్చేశాం.
ఇది జరిగిన కొంతకాలానికి ‘ఆదివారం బండ్లగూడలో ఉన్న వాళ్లమ్మాయిని చూడడానికి వెళుతున్నానని, దారిలోనే కాబట్టి మా ఇంటికీ వస్తానని’ మా అత్తయ్య నాకు ఫోన్ చేసి చెప్పింది.

మా ఇంటికి రాగానే అత్తయ్య మొట్టమొదటగా చేసిన పని "ఇదిగోరా సుబ్బూ, ఆ రోజు పానకాల స్వామి గుడిలో నువ్వు నాకోసం కొన్న పుస్తకం ఖరీదు.."అని ఇచ్చింది.

నేను తీసుకోకుండా"అదేంటత్తయ్యా, అదేమంత పెద్ద మొత్తమని, అత్తయ్యకి నేను ఆ మాత్రం పెట్టుకోకూడదా?" అన్నాను కాస్త కినుకుగా.
ఆవిడ నింపాదిగా నాతో "ఎవ్వరి రుణం ఉంచుకోకూడదురా, ఎంత మొత్తమని కాదు, అణాపైసా అయినా సరే, ఒకరి కష్టార్జీతం అప్పనంగా తీసుకోకూడదు" అంటూ నా చేతిలో పెట్టింది.

మా అత్తయ్య ప్రవచనాలు చెప్పే మాత కాదు. సాదారణ గృహిణి. పూజలు మాత్రం బాగా చేస్తుంది. ఎంత గొప్ప వ్యక్తిత్వం.
చేబదులుగా,  అప్పుగా, చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా డబ్బు ఎలా తీసుకున్నా, ఎగ్గొట్టాలనే చూస్తారు. ఇచ్చినవాళ్లకి గుర్తురాకూడదని, అస్సలు అడగకూడదని కోరుకుంటారు. కొంతమందైతే పెద్దమొత్తంలో ఎగ్గొడతారు. ముఖం చాటేస్తారు. అవతలివారికి ఎంతో మానసిక క్షోభ కలిగిస్తారు. నాకు తెలిసి అంతకంటే పాపం ఉండదు.

మనం ఎన్నో ధర్మాలు మాట్లాడతాం. నీతి, నిజాయితి లు జీవన విధానంలో ఎంత అవసరమో సమయం దొరికినప్పుడల్లా ఎదుటివాళ్లకి  క్లాసులు తీసుకుంటాం. పూజలు పునస్కారాలతో మనను మనం పునీతులుగా చేసుకోవడానికి ఉవ్విళ్లూరతాం. కాని డబ్బు తిరిగి ఇచ్చే విషయంలో మరుగుజ్జు మనస్కులమయిపోతాం. విచిత్రమేమిటంటే అది ఒక్క రూపాయైనా సరే!

అప్పు చెయ్యకూడదు. విధిలేక చేసిన పక్షంలో వెంటనే కృతజ్ఞతాపూర్వకంగా తిరిగి ఇచ్చేయాలి. డబ్బు ఇచ్చి ఆపదలో ఆదుకున్నవాడు సాక్షాత్తు నారాయణ అంశ.

ఇచ్చి పుచ్చుకోవడమనేదే లేకపోతే మానవత్వం  చిరునామా కోల్పోయినట్టే!

*****

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి