ప్రతాప భావాలు - -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

ఎంతో చిన్నది జీవితం

జీవితం అంటే వడ్దించిన విస్తరికాదు. అలా అని ముళ్లబాటా కాదు. కొంతమందిని చూస్తే అలా అనిపించడం సహజం!ఉన్నదానితో తృప్తి పడడం మనిషికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. మనసులో కోరికలు పరుగులెడుతున్నంత కాలం అది సాధ్యం కాదు. నిజానికి కోరికలు లేకపోతే ప్రగతి ఆగి పోతుంది. మనకూ జీవితం బోర్ కొడుతుంది. కోరికలు మరీ ఆకాశాన్నంటేలా ఉండకూడదు. మన పరిథిలోనే ఉండాలి. అప్పుడైతేనే సాధనార్హతనొందుతాయి.

లేచినప్పటి నుంచి మనిషి ఎన్నో పనుల్లో తల మునకలవుతాడు. బిజీ బిజీ మనిషిని మెలేసేంత బిజీ. తినడం, తాగడం అంతా హడావుడే, గజిబిజే!

జీవితాన్ని అనుభుతీస్తూ అనుకున్నది సాధించడంలోనే సంతృప్తి ఉంటుంది. ఆఫీసుకి అంకితమైపోయి పగలూ రాత్రీ పనిచేస్తూ కోట్లు సంపాదించినా ఉపయోగం ఏమిటి? భార్యకి మూరెడు పూలు కొని తీసుకెళ్లిచ్చింది లేదు. పిల్లల్ని అలా పార్కులకీ, షికార్లకి తీసుకెళ్లి దగ్గరయ్యిందీ లేదు. పిల్లలు ఎదగడంలోని దశలు ఎంతో ముచ్చటగొలుపుతాయి. అవి చూడడానికి జీవితం చాలదనిపిస్తుంది. పిల్లల ఎదుగుదలని అనుభూతించని తల్లిదండ్రులు జస్ట్ రోబోలు అంతే! జీవితం మనకు అదృష్టం కొద్దీ లభించిన అయాచిత వరం. దాన్ని ఎంత బాగా జీవించి ముగిస్తే అంత గొప్ప.

రుచిలో మధుర్యాన్ని, చూడ్డంలో అలౌకికానుభూతినందడం, వినడంలో తాదాత్మ్యతనొందడం ఇప్పుడు ఎక్కడున్నాయి.
పనులు తరుముతున్నాయి. వేగం శ్రుతి మించుతోంది. సమతుల్యత దెబ్బతింటోంది.

ఒకప్పుడు రాగయుక్తంగా పద్యాలు పాడేవారు, సంగీతం కూడ రాగాలతో అలరించేది. పదాలను సాగదీసినట్టుగా ఉండేవాటిని ఇప్పుడు విన్నా, చూసినా నవ్వుతాం. అయితే అవి ఎదుటి వారి మనసును ఆకర్షించి విషయం మీద ఏకాగ్రత పెంచేవి. నాటకంలోని ’బావా ఎప్పుడు వచ్చితీవు.." అనే పద్యం ఆ కోవకి చెందిందే.

ఏదేమైనా కళాత్మకతను వేగం కబళించకూడదు. సృజనాత్మకతను సమయంతో నిర్దేశించలేము. అది స్వేచ్ఛగా ప్రవహించే నది పాయ లాంటిది. అది అలాగే అలవోకగా ఒంపు సొంపులతో ప్రవహించాలి. ఏ మాత్రం మన చేతులు పడినా, కృత్రిమమైపోతుంది. కృతకభావన కలిగిస్తుంది.
సమయం తీసుకుని మనసులోని భావాలకు రూపమివ్వడంలోనే ‘మాస్టర్ పీస్’ లు ఉద్బవిస్తాయి. ఎంతో మందిని సేదదీరుస్తాయి. ఊరట పరుస్తాయి.

బిజీకి లోనవకుండా, మనదైన జీవితం శ్రద్ధగా, పనిలో ఏకాగ్రతను పెంచుకుంటూ జీవించడంలోనే ఆనందం ఉంటుందన్నది యదార్థం.
డబ్బును సాధించడానికి కాలాన్ని పణంగా పెడితే మానవ జీవితం లోని మాధూర్యం మృగ్యం అవుతుంది. ఇంత చిన్న విషయం తెలుసుకోవడానికి మనం జ్ఞానులమవనక్కర్లేదు. సత్సంగాలకి వెళ్లనక్కర్లేదు.

మన జీవితం. మన రోజు. మనం గడపడం. ఈ సైకిల్ ను కక్ష్య నుంచి వేరుచేసినా, నిర్దేశిత కక్ష్యలో తిరగడంలో వేగం పెంచినా జీవితాలు ఛిన్నాభిన్నమే.

ఎంతో చిన్నది జీవితం..అనుభవించరా (పాజిటివ్ గా) అన్న కవి వాక్యం ఎంతో విలువైనది. దాన్ని ఆచరిండమే, మనం సింపుల్ గా చేయవలసింది.

***

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి