జయజయదేవం జోకులు - - డా. ఎస్. జయదేవ్ బాబు

 

రాజు గారి దర్బారులో ఒక భటుడు: ఉన్నట్లుండి, రాణి గారూ, రాణి వాసమూ, వింజామర కన్యలు లేచి వెళ్ళిపోయారేం?
రెండో భటుడు: కొలువు లోకి కొత్తగా వచ్చిన కవి, చౌడప్ప కవి గారి శృంగార కవితలు చదవడం ప్రారంభించాడు గమనించలేదా?   

 

 

ఊళ్ళోకొచ్చిన కొత్త శాల్తీ: ఈ ఊళ్ళో , అప్పిచ్చువాడు వైద్యుడూ వున్నారా?
పాతశాల్తీ: ఈ ఊళ్ళో, ఎడతెగక పారే ఏరుంది. ఆ ఏటి నీళ్ళు తాగితే రోగాలొస్తాయి. రోగాలు నయం చేయడానికి వైద్యులున్నారు.పెద్ద రొక్కం యిస్తే గాని మందులివ్వరు. డబ్బులు కావాలంటే అప్పులు చేయాల్సిందే! అప్పులిచ్చేవాళ్ళున్నారు. ఐతే పెద్దశాతం వడ్డీలు ముక్కుపిండి వసూలు చేస్తారు. అప్పులు తీర్చలేక, ప్రజలు ఏట్లో దూకి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఏటి నీరు కల్మషం చేస్తారు.. ఆ నీరు తాగి...జనం..
కొత్త శాల్తీ: ఆపు బాబూ వొస్తా..!

 

భర్త: (అన్నం కలుపుతూ), ఏమిటీ కూరలో ఏదో కొత్త వాసనొస్తోందే?
భార్య: ఔనా... సర్దుకోరూ, ఉప్పూ, కర్పూరం జాడీలు పక్కపక్కనే వుంటం చేత, ఒక దానికొకటి కూరలో వేసేశానేమోనండీ..!

 

 

మిత్రుడు: కాలెందుకు విరుచుకున్నావు విక్రమా?
విక్రం: యువరాణిని కలుసుకోడానికి కోటగోడనెక్కానా?
మిత్రుడు: పట్టుతప్పి కిందపడ్డావా?
విక్రం: లేదు, యువరాణిని కలిసి, కోటగోడకి తిరిగొచ్చి, గుర్రానికోసం ఈల వేశాను.
మిత్రుడు: గుర్రం రాలేదా?
విక్రం: వచ్చింది... దాని మీదికి దూకేలోగా అది దౌడు తీసింది!!

 

 

సేవకుడు ఒకడు: యువరాజుగారు, తమ చెలికాడి నియామకాన్ని నిషేధించారటగా?
సేవకుడు రెండు: యువరాజుగారు పంతలదేశపు యువరాణీని ప్రెమించారు గదా... ఆ యువరాణి , యువరాజు గారి చెలికాడిని వలిచి అతడితో లేచిపోయింది.
సేవకుడు మూడు: యువ రాజు గారు మరో చెలికాడిని తీసుకున్నారు కదా?
సేవకుడు నాలుగు: తర్వాత యువరాజు గారు వింతలదేశపు యువరాణిని ప్రేమించారు. ఆ అమ్మాయి , యువరాజు గారి రెండో చెలికాడితో పారిపోయింది!
సేవకుడు ఐదు: యువరాజు గారు ప్రస్తుతం సొంతల దేశపు యువరాణిని ప్రేమిస్తున్నారు! చెలికాడు లేకుండా, ఒంటరిగా వెళ్ళారు.  

 

మంత్రి మహోదయుడు: దండనాయకా, నీ చెల్లెల్ని యువరాజుకి కట్టబెట్టి, రాజ్యాధికారం దక్కించుకోవాలంటున్నావ్... ఎలా?
దండనాయకుడు: రాజు, రాణీలని, విషం తినిపించి చంపేస్తాను.
మంత్రి: యువరాజు పట్టాభిషిక్తుడవుతాడు సరే. నీకు అధికారమెలా వస్తుంది!
దండనాయకుడు: నా వద్ద ఒక ప్రత్యేక వనమూలిక వుంది. అది తింటే పిచ్చివాడ్ని చేసి , నా చెల్లెల్ని సిం హాసనం మీద కూచోబెడతాను!
మంత్రి: ప్రణామములు, భావి మహారాజా!!


చిన్నరాణి చింతక్క: నాథా... మన అంత: పుర ఖజానాల్లో, నగలకీ, ఆభరణాలకీ ప్రత్యేక ఖజానా వుందటగా?
రాజు రొంపనాథుడు: ఔను!
చిన్నరాణి చింతక్క: ఆ ఖజానా తాళాలెక్కడున్నాయో.. చెప్పరా?  
రాజు రొంప నాథుడు: తాళాల్లేవు. మంత్రం జపిస్తే, ఖజానా తలుపులు తెరుచుకుంటాయి!
చిన్నరాణి చింతక్క: ఆ మంత్రం నాకు చెప్పరా?
రాజు రొంప నాథుడు: ఆ మంత్రం మట్టి బుర్రలు పఠిస్తే ఫలించదు!!

 


స్త్రీ భటులు: మహారాణీ... మన రాజ్యం లో ఎవరో మగ పురుషుడు ప్రవేశించాడు
మహారాణి: వెంటనే అతడ్ని బందీ చేసి పట్టుకురండి!
స్త్రీ భటులు: ఆ పనే చేయబోయాము... కానీ , అతడు భలే అందగాడు! స్త్రీ భటులు అతని అందానికి ముగ్దులై, మూర్చబోయారు!
మహారాణి: ఐతే వెంటనే ముసలి స్త్రీ భటుల్ని పంపించి, అతడ్ని పట్టుకురండి. ( రహస్యంగా) ఆ లోగా, వైద్యుల్ని కలిసి, మూర్చరాకుండా వుంటానికి, మందుల్ని తక్షణం పట్టుకురాండి.. పోండి.

 

 

మంత్రి మబ్బురాయుడు:  ( ఖంగారుగా) రాజా, మన యుద్ధ రహస్యాల భాండాగారం తగలబడి, బూడిదైపోయింది!
రాజు రోషాలన్న: ఏం ఫరవాలేదు! ఆ రహస్యాలన్నీ పదిలంగా, నా మస్తిష్కం లో వున్నాయి.
మంత్రి మబ్బురాయుడు: మీరు మరిచిపోయేలోగా, ఆ రహస్యాలని నాకు వివరించండి రాజా. పునర్రచన చేసి, ఆ పత్రాలని భద్రపరుస్తాను!
రాజు రోషాలన్న: ఇంతగా ప్రాధేయపడుతున్నారు... కారణమేమిటో..! తమరు, యుద్ధ రహస్యాలని వెలకట్టి శతృరాజులకు అమ్మబోతున్నారని తెలిసి, భాండాగారాన్ని నేనే నిప్పంటించి తగలబెట్టాను!! ఏమిటి మీ సంజాయిషీ?
మంత్రి మబ్బురాయుడు: ఆ(!!

 

పూలు కట్టే పిల్ల: రాజుగారు, పేదరాసి పెద్దమ్మని కలవడానికొచ్చారే?
ఇల్లూడ్చే పిల్ల: అంతరంగిక విషయాలు చర్చించి సలహాలు పొందడానికొస్తారు.
పూలుకట్టే పిల్ల: ఏం సలహాకోసం వొచ్చారో?
ఇల్లూడ్చే పిల్ల: రహస్యంగా) రాణీ గారికి మీసాలు మొలుస్తాన్నాయట! రాజు గారికి భయం పట్టుకుంది!!...

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి