ప్లాస్టిక్ ఓ భూతం - భమిడిపాటిఫణిబాబు

Plastic is a demon

రోజులు గడిచేకొద్దీ ఎన్నో ఎన్నెన్నో మార్పులు జరుగుతూంటాయి… అది మనుషుల ప్రవర్తనలో కావొచ్చు, మనస్థత్వం లో కావొచ్చు, వాతావరణం లో కావొచ్చు, ఉపయోగించే వస్తువులలో కావొచ్చు, పనిచేసే పధ్ధతుల్లో కావొచ్చు…  మార్పుని కొంతమంది స్వాగతించి, కొత్తమార్గంలో వెళ్తారు. కానీ కొందరు , వారి నమ్మకాలనుబట్టో, మరోకారణం చేతో వచ్చిన మార్పుని అంత త్వరగా జీర్ణించుకోలేరు… అలాగని వచ్చిన మార్పు వలన అంతా మంచే జరుగుతుందని గ్యారెంటీ కూడా లేదు.  చిత్రం ఏమిటంటే, ప్రతీ మార్పులోనూ, మంచీ చెడూ కూడా జంటగానే ఉంటాయి. గమత్తేమిటంటే, మొదట్లో మార్పనేది బాగానే ఉన్నా, క్రమక్రమంగా, చెడు కూడా రంగంలోకి వచ్చేసి, అప్పటిదాకా రాజ్యమేలుతున్న “ మంచి “ ని పక్కకు తోసేయడమే కాక, అసలు జరిగిన మంచినికూడా మర్చిపోయేటట్టు చేసేస్తుంది.
 ఉదాహరణకి మనం నిత్యం వాడుకునే వస్తువులనే తీసుకుందాం…

ఏదో రాతియుగంలో, ప్రతీదీ రాయితోనే చేసేవారుట.  అవి మనిషి నిత్యం ఉపయోగించుకునే వంటసాగ్రవొచ్చు,, భూమిని తవ్వుకునే పరికరాలవొచ్చు, చివరాఖరికి ఒకర్నొకరు చంపుకునే మారణాస్త్రాలు కత్తి లాటివికూడా అవొచ్చు… కాలక్రమేణా మనిషి మేధాశక్తి అభివృధ్ధి చెంది, లోహాల్లోకి దిగారు.. ఆ లోహం తయారుచేయడానికి, భూమిలో నిక్షిప్తమైన గనులు తవ్వడం లాటివి మొదలయ్యాయి. మళ్ళీ ఇందులో అత్యంత విలువైన  బంగారం లాటివి వచ్చాయి.. అలాగే ప్లాటినం… వీటిని మరీ  నిత్యౌపయోగాల్లోకి కాకుండా, ఆస్థులరూపంలోకి మాత్రమే ఉపయోగించేవారు. ఓ మనిషి ఆర్ధికస్తోమతని అంచనా వేయాలంటే, వాడిదగ్గర బంగారం ఎంతుందోనని చెప్పుకునేవారూ, ఇప్పటికీ చెప్పుకుంటున్నారు కూడా.

మిగిలిన అన్నిటికీ లోహాలు వాడ్డం మొదలయింది.. రాగితో చేసిన పాత్రలైతే ఆరోగ్యానికి మంచిదన్నారు.. ఇనుము/ ఉక్కు అయితే దృఢంగా ఉంటుందన్నారు. ఈలోహాలన్నీ తయారుచేయడానికి ఎడాపెడా కర్మాగారాలు వచ్చేసాయి. .. ఇత్తడి, సత్తు, లాటిలోహాలతో ఇళ్ళల్లో ఉండే వంటసామగ్రి తయారీ మొదలయింది.. ఈమధ్యలో  Stainless steel  అని ఒకటొచ్చింది. మిగిలిన లోహాలతో తయారు చేసిన పాత్రలు మంటమీద పెడితే, మచ్చలలాటివొచ్చేవి.. తరవాత వాటిని తోముకోవడం ఓ పెద్ద పనైపోయేది. రంగంలోకి  ఈ  Stainless steel  వచ్చాక, అందరూ దీంట్లోకి మారిపోయారు.  ఎంత వేడిచేసినా ఎటువంటి మచ్చా పడకపోవడం దీనికున్న సుగుణం మూలాన… ఆర్ధిక స్థోమతతో పనిలేకుండా, ఎక్కడ చూసినా ఈ స్టైన్ లెస్ స్టీలే కనిపించేది. ఇంక రోడ్లమీద నడిచే వాహనాలనండి, కర్మాగారాల్లో వాడే పెద్దపెద్ద బాయిలర్లనండి, విద్యుచ్చక్తి ఉత్పాదనకి వాడే Turbines  అనండి… ఎక్కడచూసినా ఈ  Stainless steel  తోనే తయారీ..కారణం దీనికున్న మన్నిక… ఎంత మచ్చలు పడకపోయినా, వంటలకి ఉపయోగించే పాత్రలు తోముకోవాలిగా, అదికూడా ఓ పెద్ద పనిగా భావించడం మొదలయింది కాలక్రమేణా..

ఈ సమయంలో వైజ్ఞానిక అభివృధ్ధి ధర్మమా అని  ప్లాస్టిక్ వాడకంలోకి వచ్చేసింది. ఈ ప్లాస్టిక్ కొత్తగా వచ్చినప్పుడు, దీనివాడకంలో ఉండే సుఖాలకి అలవాటుపడ్డారు జనం.  ఒకటి, దీనితో తయారుచేసిన ఏ వస్తువైనా పెద్ద బరువుండదూ, శుభ్రపరుచుకోవడం తేలిక, కుళాయి కింద పెట్టేస్తే చాలు నిగనిగలాడిపోతుంది.. పైగా రంగురంగుల్లో దొరుకుతాయి. ఇదేకాకుండా, ఖరీదులుకూడా అందుబాటులో ఉండడం ఓ సౌలభ్యం… ఇలా ఇన్ని ఉపయోగాల ధర్మమా అని ప్లాస్టిక్ వాడకానికి  అంతులేకుండా పోయింది.  ఎక్కడదాకావచ్చిందంటే చివరకి సరుకుల పాకేజింగు నుండి, వర్షాలకి వాడుకునే గొడుగులనండి, వర్షపుబారినుండి రక్షించుకోడానికి , ఒకానొకప్పుడు వాడే టార్పులీన్లు బదులుగా, ఈ ప్లాస్టిక్ షీట్లదాకా.. ఒకానొకప్పుడు కాగితం  పొట్లాల స్థానంలో , ఏ కొట్లో చూసినా, ఈ ప్లాస్టిక్ కారీ బ్యాగ్గులే… ఒకానొకప్పుడు కూరలకోసమో, నిత్యావసరవస్తువులకోసమో, ఓ చేతిసంచీ తీసికుని వెళ్ళే జనాలు, చేతులూపుకుంటూ వెళ్ళడం మొదలయింది. కారణం—కూరలుకానీ, సరుకులు కానీ, కొట్లవాళ్ళు ఎలాగూ ఓ ప్లాస్టిక్ కారీబ్యాగ్గులోనే ఇస్తాడూ, వీటన్నిటినీ ఓ పేద్ద ప్లస్టిక్ సంచీ లో వేసేసుకుంటే గొడవుండదూ అనే మనస్థితి లోకి  వచ్చేసారు..

నిజమే ఈ ప్లాస్టిక్ వాడకం మానవజీవితాల్లో పెద్దమార్పే తెచ్చింది… వచ్చిన గొడవల్లా ఎక్కడంటే, ఇదే ప్లాస్టిక్ మనకి  శాపంగా మారడం… ఈరోజుల్లో ఏనది చూసినా ప్లాస్టిక్ మయమే.. పూజలూ పునస్కారాలూ చేయడానికి ఓ ప్లాస్టిక్ బాగ్ లో, పసుపూ,కుంకం, పళ్ళూ పువ్వులూ, తీసికెళ్ళి , పనైపోయిన తరవాత , ఎవడుచూసినా, ఆ ప్లాస్టిక్ సంచీలని ఆ నదిలోకే పారేయడం… అలాగే మురుగుకాలవల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు పారేయడం. వర్షాలు వచ్చినప్పుడు ఈ మురుక్కాలవల్లో , వర్షపునీరు ప్రవహించే అవకాశం లేక, ఇళ్ళల్లోకి ప్రవహించడం.. ఇలా చెప్పుకుంటూపోతే, మన అజాగ్రత్తనండి, అలసత్వమనండి, అశ్రధ్ధనండి—వీటివలన మనుషుల సదుపాయంకోసం కనిపెట్టిన ప్లాస్టిక్ కాస్తా, ఇప్పుడు ఓ భూతంలా తయారయింది..

ఇప్పటికైనా మనం  ప్లాస్టిక్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే, మన మనుగడే దూరం అయే రోజు దగ్గరలోనే ఉంది…
సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి