ప్రతాప భావాలు - -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

అసహనం

మనిషికి అసహనం ఎక్కువైపోయిందన్నది వాస్తవం. చిన్న చిన్న వాటికి కూడా చిరాకు పడిపోతున్నాడు. సాటి మనిషి మీద నోరెట్టుకు పడుతున్నాడు. చేయి చేసుకుంటున్నాడు. పిల్లల పట్ల అయితే మరీను. ఎందుకంటే వాళ్లు శారీరకంగా బలహీనులు కాబట్టి.
శాంతంగా ఉండడం స్వామీజీలు చెప్పినంత సులభం కాదు. దానికి ఎంతో మానసిక పరిణతి కావాలి.

న్యూటన్ ప్రయోగాలు చేస్తూ, తను సాధించిన విజ్ఞానాన్ని కాగితాలపై పెట్టి టేబుల మీద ఉంచేవాడు. ఒకరాత్రి ఆయన పెంచుకునే డైమండ్ అనే కుక్క అదే టేబుల్ పై ఉన్న దీపంపై దూకి ఆ దీపం కాగితాలపై పడేందుకు కారణమవుతుంది. దాంతో అవి బూడిదై పోతాయి. తమ శ్రమంతా బూడిదైపోతే ఎవరికైనా కోపం నషాళానికి అంటి దుడ్డుకర్రతో ఆ కుక్కపిల్ల నడ్డి విరగ్గొట్టేవారు. కాని న్యూటన్ అలా చేయలేదు. పాపం దానికేం తెలియదుకాబట్టి, క్షమించేశాడు. కనీసం జరిగిందానికి బాధ కూడా పడలేదు.

న్యూటన్ లా ఉండడం అందరికీ సాధ్యం కాదు.

నేను మాత్రం ‘రాతలు అలా రాస్తారు కాని, అంతలాంటి శాంతం ఎవరికీ సాధ్యంకాదని’ అనుకునేవాణ్ని. మన చుట్టూ ఉన్న సమాజం అలాంటివన్నీ కల్పిత భావాలే అన్న స్పృహ కలిగేలా చేస్తుందన్నది వాస్తవం.

అయితే మా ఇంట్లో ఒక సంఘటన జరగకపోయుంటే నా ఆలోచనలు అలాగే ఉండేవి. నేను అధమ స్థితిలోనే ఉండేవాణ్ని.

మా పెద్దబ్బాయి తనకున్న ల్యాప్ టాప్ ను ప్రాణప్రదంగా చూసుకుంటాడు. దానికి కారణం ఉంది. అందులో వాడికి సంబంధించిన పర్సనల్ డేటా, ప్రొఫేషన్ కి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫో స్టోర్ అయి ఉండేది. అందుచేత వాడు దాన్ని అపురూపంగా చూసుకునేవాడు. మేము పొరబాట్న ముట్టుకున్నా విలవిల్లాడిపోయేవాడు.

అలాంటిది ఒకనాటి సాయంకాలం టేబుల్ మీద కూర్చుని ఏదో రాసుకుంటూంటే, మా చిన్నాడు హఠాత్తుగా చేయి కదిపాడు. అంతే టేబుల్ మీద ఉన్న చెంబు ల్యాప్ టాప్ మీద పడి దాన్లోని నీళ్లు ఒలికిపోయాయి. తెరచి ఉన్న ల్యాప్ టాప్ కీ బోర్డ్ మీద అన్నీ నీళ్లే. ల్యాప్ టాప్ ఆఫ్ అయిపోయింది. మాకు పై ప్రాణాలు పైనే పోయాయి. వాలీ సుగ్రీవుల గొడవ, రామ రావణ యుద్ధం కళ్లారా చూస్తామన్న భావం కలిగింది.
కాని విచిత్రం మా పెద్దాడి నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు.

"అదేంట్రా. ల్యాప్ టాప్ అంటే నీకు ప్రాణం కదా! చిన్నాడిని ఏమనకపోవడం మంచిదే కాని. కనీసం వీసమెత్తు కోపం కూడా చూపించలేదు. నువ్వు గ్రేట్ రా"మనస్ఫూర్తిగా వాణ్ని అభినందించాను.

మా పెద్దాడు "ఏం చేస్తాం నాన్నా, వాడు కావాలని చేయలేదు. అలా జరిగిపోయింది. తిట్టినా, కొట్టినా అదెలాగూ బాగవదు. వాడి మనసును హర్ట్ చేయడం ఎందుకనిపించింది"అన్నాడు.

నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కొన్ని విషయాల్లో నాకూ విసుగు, చిరాకు, కోపం వస్తూంటాయి. వాటిని ప్రదర్శిస్తుంటాను కూడా. కాని వాడి ఆనాటి ప్రవర్తన నన్ను ఆలోచింపజేసింది. మార్చేసింది. వాడు మా అబ్బాయి, నా కన్నా చిన్న. అయితేనేం నాలో మార్పుకు కారనమయ్యాడు. ఒక చిన్న మార్పు చాలదూ మనిషిని చేయడానికి!

***

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి