రోబోకీ జై బోలో.! - ..

robo jai bolo

రజనీకాంత్‌ హీరోగా వచ్చిన 'రోబో' సినిమా చూశాం కదా. అప్పటికి ఆ కాన్సెప్ట్‌ జనానికి కొంచెం కొత్త. కానీ ఇప్పుడు బాగా అలవాటైపోయింది. హాస్పిటల్‌ నుండి హాస్పిటాలిటీ దాకా, పోలీస్‌, ఆర్మీ ఇలా అన్నింట్లోనూ రోబోటిక్‌ సిస్టమ్‌ని ఉపయోగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్నామధ్య ఇండియాకి వచ్చిన సోఫియా రోబోని చూశాక ఈ ఆశక్తి మరింత పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కి ప్రాధాన్యత బాగా ఎక్కువైపోయింది. ఏదైనా పని చేయాలంటే ఇదివరకటి రోజుల్లో పది మంది జనం కావాలి. కానీ వందలు, వేలు మంది చేసే పనిని ఒక్క రోబో చిటికెలో చేసేస్తోందిప్పుడు. అదే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అన్నమాట. దాన్ని ఆపరేట్‌ చేసేది మనిషే అయినా అది చేసే పని సులభతరంగానూ, వచ్చే ఫలితం సమర్ధవంతంగానూ ఉండడంతో వీటి వైపే ఎక్కువగా దృష్టి పెడుతోంది ప్రస్తుతం యువత. 
వైద్య శాస్త్రంలో ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విషయానికి వస్తే, క్యాన్సర్‌ వంటి వ్యాధులకు శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో రోబోటిక్‌ సిస్టమ్‌ మెరుగైన పనితీరు కనబరుస్తుండడంతో రోబోటిక్‌ శస్త్ర చికిత్సల వైపే ఇటు వైద్యులు, అటు రోగులు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. అప్పుడే చాలా కాలం నుండే ఈ రోబోటిక్‌ శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చేశాయి. విదేశాల్లో అయితే తరచూ జరుగుతున్నాయి. మన ఇండియాలోనూ ఈ మధ్య ఈ తరహా శస్త్ర చికిత్సల గురించి ఎక్కువగా వింటున్నాం. ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ శస్త్ర చికిత్సల్లో నెగిటివ్‌ రిజల్ట్‌ తక్కువగా ఉంటోంది. ఆపరేటింగ్‌ డాక్టర్‌దే అయినా కానీ ప్రిస్‌క్రైబ్డ్‌ సర్జరీ నిర్వహించడంలో రోబోలు సమర్ధవంతంగా పని చేయడంతో పాటు, అనుకున్న మేరకు, మెరుగైన రిజల్ట్‌ రాబట్టడం జరుగుతోంది.

ఇక పోలీస్‌ వ్యవస్థను తీసుకుంటే, సామాన్య కార్యకలాపాలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ, అసాంఘిక శక్తుల్ని కనిపెట్టడంలో రోబోటిక్‌ ఇంటెలిజెన్స్‌ని ఆల్రెడీ వినియోగిస్తున్నారు. ఈ వినియోగాన్ని మరింత మెరుగు పరిచే యోచనలో మన కేంద్ర ప్రభుత్వాలున్నాయి. అందుకే ప్రపంచ దేశాలు ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ని మరింత డెవలప్‌ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. రోబో సోఫియాని చూశాం కదా. మానవ మేథస్సుకు మించిన మేధస్సును పుణికి పుచ్చేసుకుంది ఆ సోఫియా. రెస్పాన్స్‌ కావడం, ప్రశ్నలకు సమాధానాలివ్వడం, కోప్పడడం, నవ్వడం ఇలా మనిషి ఫీలింగ్స్‌ అన్నింటినీ ఈ రోబోలో చూసేశాం. ఇవే ఇంకా డెవలప్‌ అయితే ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పటికే ప్రతీ పనీ మేగ్జిమమ్‌ మెషిన్‌ మేడ్‌ అయిపోయింది. మనుషులతో పని తక్కువైపోయింది. ఇక ఉన్న ఆ కాస్త మనిషి స్థానాన్ని రోబో ఆక్యుపై చేస్తే ఇంకెలా ఉంటుంది.? అంటే ముందున్న భవిష్యత్‌ అంతా రోబోటిక్‌ నాలెడ్జ్‌ పైనే ఆధారపడుతుందనడం అతిశయోక్తి కాదు, సరే ఈ విషయం పక్కన పెడితే, ప్రపంచంతో పాటు పరుగులు తీస్తేనే కదా యువతకు అసలు సిసలు మజా. అందుకే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగం వైపు యువత ఎక్కువగా ఫోకస్‌ పెడుతోంది.

ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కి కావాల్సిందల్లా ఆ రంగం పట్ల ఆశక్తి. ఆ ఆశక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా దాంట్లో రాణించవచ్చు. భవిష్యత్‌ ప్రపంచం ఎలాగూ రోబోల మయం కాబోతోందని అర్ధమైపోయింది. కాబట్టి ఆ వైపుగా యువత పరుగులు పెడుతోందంతే.!

మరిన్ని వ్యాసాలు