పురాణకాలంలో పెళ్ళిళ్ళు స్వయంవరాలతో చేసుకునేవారు.. వధువుకి వచ్చిన వారిలో, ఎవరు నచ్చితే వాళ్ళమెడలో ఓ దండవేసేసేది.. ఒక్కోచోట అవేవో పరీక్షలలాటివికూడా ఉండెవనుకోండి, అర్జునుడు, శ్రీరామచంద్రమూర్తి ల వివాహాల్లోలాగ.. ఏదైతేనేం, సుఖంగా కాపరాలుచేసుకునేవారు.. ఏదో రామాయణంలో పాపం సీతమ్మతల్లి కష్టాలు పడడం , ఉందనుకోండి…చెప్పొచ్చేదేమిటంటే, అమ్మాయికి తన వరుడుని ఎంచుకునే సదుపాయం ఉండేది….
కాలక్రమేణా, పెళ్ళిళ్ళల్లో “ కన్యాశుల్కం “ అనే ఓ సాంప్రదాయం మొదలయింది., దానికి సాయం బాల్యవివాహాలుకూడా ఎక్కువగానే జరిగేవి… ఈ కన్యాశుల్కంలో , మగాడు, తన వయసుతో సంబంధం లేకుండా, తమ తమ ఆర్ధిక స్థోమతనుబట్టి, ఆ శుల్కమేదో అవబోయే మామగారికి చెల్లించేసి, పెళ్ళిచేసుకునేవాడు… ఒకలా తీసుకుంటే, ఈ బాల్యవివాహాలూ, కన్యాశుల్కాలు సాంఘిక దురాచారాల్లోకి రావడంతో, సంఘసంస్కర్తలు , ఎన్నో పోరాటాలు చేసి, మొత్తానికి వీటిని ఆపగలిగారు.. కన్యాశుల్కం అంటే ఆగిపోయింది కానీ, బాల్యవివాహాలు దేశంలోని కొన్నిచోట్ల ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఏమైనా అంటే, మా సాంప్రదాయం అంటారు… ఇవి చట్టవిరుధ్ధం అవడంతో, ఇలాటివి ఎక్కడైనా జరుగుతూంటే, పోలీసులకి ఫిర్యాదు చేస్తే, వీటిని అరికట్టే సదుపాయం ఒకటుంది.
రోజులు గడిచేకొద్దీ సమాజంలో ఎన్నోఎన్నెన్నో మార్పులొచ్చేసాయి. ఒకానొకప్పుడు వధువును తెచ్చుకోడానికి , శుల్కం తెచ్చుకునేరోజులు పోయి, వరకట్నం పేరిట , వివాహానికి కట్నకానుకలు ఇవ్వాల్సిన రోజులొచ్చాయి. వీటికి సాయం, నానారకాల లాంఛనాల పేరిట, ఓ ఆడపిల్లకి పెళ్ళిచేయాలంటే, లక్షల్లోకీ, ఒక్కోచోట కోట్లలోకి ఖర్చవుతోంది… ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి లక్ష్మికళ వచ్చిందనేవారు.. అలాటిది ఈ రోజుల్లో కొన్ని కొన్ని చోట్ల, ఆడపిల్ల పుట్టడమే ఓ పెద్ద ఉపద్రవంగా భావిస్తున్నారు… కారణం—ఆ పిల్లకి పెళ్ళిచేయడానికి అయే ఖర్చు ఊహించుకుని భయపడిపోయి. ప్రభుత్వాలు ఎన్ని సదుపాయాలు కల్పించినా జనాల్లో , మార్పుమాత్రం రావడంలేదు.
ఇంక ఈ పెళ్ళి సంబంధాలు వెదుక్కోవడం ఓ పెద్ద కార్యక్రమంగా ఉండేది ఒకప్పుడు.. కుటుంబంలోనే , ఏదో వరసైనవాడు, ఏ మేనత్తకొడుకో, మేనమామ కూతురో ఉంటే, ఇద్దరికీ కట్టబెట్టేసేవారు..
ఆస్థులూ కుంటుంబం బయటకి వెళ్ళకుండా కాపాడుకునేవారు… అందుకనే ఏమో, పెళ్ళిసంబంధాలు వెదుక్కునేటప్పుదు, ముందుగా ఆ పిల్లకో పిల్లాడికో వారికుటుంబంలోనే వరసైనవారున్నారేమో తెలుసుకుని మరీ, ముందుకెళ్ళేవారు… ఈ పెళ్ళిసంబంధాలు వెదికేవారిని “ పెళ్ళిళ్ళ పేరయ్య “ అనేవారు.. వీళ్ళదగ్గర పెళ్ళికావాల్సిన వారి చిఠ్ఠా అంతా ఉండేది… అబ్బాయికో అమ్మాయికో పెళ్ళిచేయాలని ఉద్దేశం రావడమేమిటి, వీళ్ళు ప్రత్యక్షమయేవారు… వీళ్ళు మధ్యవర్తుల్లాటి వాళ్ళన్నమాట… సాధారణంగా ఇరుపక్షాలవారూ వీరికి పరిచయస్థులే అవడం ఓ సదుపాయం… ఇరుపక్షాల్లోనూ కట్నకానుకల విషయంలో ఏదైనా అంగీకారం కుదరనప్పుడు వీళ్ళే ఏదో సద్దిచెప్పేవారు.. ఇప్పటికీ దేశంలోని చాలాచోట్ల వీరిద్వారానే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి.
తరవాత్తరవాత News Papers లో Matrimomilas లో ఓ ప్రకటన ఇచ్చేస్తే, కావాల్సిన పెళ్ళిసంబంధాలు కనిపించేవి… ప్రతీవారూ ఈ ప్రకటనలెక్కడ చూస్తారూ.. దీనితో మారేజ్ బ్యూరో ( Marriage Bureau) లు చాలా చోట్ల ఆఫీసులు తెరిచాయి… వాళ్ళకి కట్టాల్సిన రుసుమేదో కట్టేసి, రిజిస్టర్ చేసుకుని , వివరాలు ఇచ్చేస్తే, తగిన సంబంధం వచ్చినప్పుడు, ఆ బ్యూరోవారే తెలియచేసేవారు.. కాలక్రమేణా, అంతర్జాలం ( Internet ) వాడుక ఎక్కువయేసరికి, ఇప్పుడు కంప్యూటర్ లో ఓ నొక్కునొక్కితే చాలు, రకరకాల పెళ్ళిసంబంధాల వివరాలు క్షణాల్లో తెలుస్తాయి.
ఇదే కాకుండా, ఎవరిఅభిరుచికి కావాల్సిన సంబంధాలుకూడా తెలుస్తాయి.. దేశవిదేశీ వధూవరుల వివరాలు తెలుస్తాయి. ఒకానొకప్పుడు పెళ్ళిసంబంధం చూడాలంటే, చెప్పులరిగేలా తిరిగేవారనేవారు.. అలాటిది ఈరోజుల్లో ఎంత సులభమైపోయిందో కదా… వీటిలో కూడా అక్కడక్కడ లోటుపాట్లు కనిపిస్తూంటాయి.. ఉదాహరణకి, పెళ్ళికొడుకు / కూతురు కి సంబంధించిన వివరాలన్నీ, ఫొటో తో సహా పెడతారు కానీ, వారి background గురించి మాత్రం మాటెత్తరు… ఇరుపక్షాల వారినీ ఒకరితో ఒకరికి పరిచయంచేయడం వరకే వీరి బాధ్యతట… ఇక్కడే కొన్నికొన్ని సందర్భాల్లో పెళ్ళి అయిన తరువాత, కాపరాలు చెడిన ఉదాహరణలు పేపర్లలో చదువుతూంటాం…
మరి వీటికి నివారణోపాయం ఏమిటీ అంటే… ప్రభుత్వ ఉద్యోగాల్లో చూడండి, నియమించేముందర పోలీసు వెరిఫికేషన్ ( Police Verification Report ) రిపోర్టని ఒకటుంటుంది.. అలాటిదేదో చేసేస్తే, కొంతలోకొంతైనా , వివాహసంబంధిత నేరాలు తగ్గించడానికి వీలౌతుందేమో….
సర్వేజనాసుఖినోభవంతూ…