ఆకాశంలో సగం అన్నింటా సగం. దేంట్లోనూ మేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు అమ్మాయిలు. ఎక్స్‌పోజింగ్‌లోనే కాదు, అబ్బాయిలతో పాటు అన్నిరకాల కసరత్తుల్లోనూ ముందుంటున్నారు. ఆఖరికి మగవారికి మాత్రమే అనే సిక్స్‌ప్యాక్‌లో కూడా అమ్మాయిలు అబ్బాయిలతో పోటీ పడుతున్నారంటే నమ్మశక్యంగా ఉందా? కానీ నమ్మి తీరాలి. ఎందుకంటే ఇది నిజం. ఇదివరకట్లో అమ్మాయిలు జీరోసైజ్ అంటూ ఎగబడేవారు. కొన్నాళ్లు ఆ జీరోసైజ్ బోర్ కొట్టి, బొద్దుతనమే ముద్దన్నారు. కానీ ఇప్పుడు అబ్బాయిలతో పాటు సిక్స్‌ప్యాక్‌కి మేం కూడా సై అంటున్నారు. ఆ వివరాలేంటో మనం కూడా తెలుసుకుందాం రండి.
పొట్టభాగం పలకలుదేరి కనిపించడమే సిక్స్ ప్యాక్. ఎయిట్ ప్యాక్ కూడా కొంతమంది హీరోలు చేసేశారు. సిక్స్‌ప్యాక్‌ని తెలుగు సినిమాల్లో అల్లు అర్జున్ 'దేశముదురు' సినిమాతో పాపులర్ చేస్తే ఎయిట్ ప్యాక్‌ని ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం హీరో నితిన్. కండలు తిరిగిన శరీరంతో హీరో, విలన్‌ని చితక్కొడుతుంటే ఆ కిక్కే వేరప్పా. మరి హీరోయిన్స్ మాటేంటి.? కాస్త కండ పట్టి ఉంటే ఆ హీరోయిన్స్‌లో సెక్సప్పీల్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. సన్నగా మెరుపుతీగలా ఉంటేనే అసలైన సెక్సప్పీల్ అని మరికొందరు అభిప్రాయపడుతుంటారు. ఇవేవీ కాదు, బక్క పలచగా ఉన్నా అందులోనూ సెక్సప్పీల్ ఉందని కరీనాకపూర్ నిరూపించింది. కరీనా దెబ్బకి బాలీవుడ్ హీరోయిన్స్ అంతా జీరోసైజ్ ఫిజిక్‌లోకి మారిపోయారు కొన్నాళ్లు. అయితే ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. తేడా వస్తే ప్రాణాలు పోతాయ్. జీరోసైజ్ ఫిజిక్, సిక్స్ ప్యాక్ ఫిజిక్‌కీ ఇది వర్తిస్తుంది.
ట్రెండ్ ఇంకొంచెం మారింది. జీరోసైజ్ ఫిజిక్‌తో వదలట్లేదు. కొంచెం బొద్దుగా ఉంటూనే పొట్ట మీద నాలుగో, ఆరో పలకలు చూపించాలని కొంతమంది అందాల భామలు కష్టపడుతున్నారు. వీరిలో ఫస్ట్ ప్లేస్ నటాషా దోషికే దక్కుతుందేమో. బాలకృష్ణ నటించిన 'జై సింహా' సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించింది నటాషా. బాడీని ఫిట్‌గా ఉంచుకోవడమే కాదు, కొంచెం కొత్తగా ఆలోచించి, యాబ్స్‌తో తన ప్రత్యేకతను చాటుకుంది నటాషా. మరో ముద్దుగుమ్మ రితికా సింగ్ కూడా తాజాగా యాబ్స్ ట్రై చేసింది. సాధించింది. కవులు, సౌందర్య ఆరాధకులు అమ్మాయిల నడుము మీద ఎన్నో ఎన్నెన్నో కవితలు, పాటలు, మాటలు రచించారు. అందరూ నాజూకు నడుము గురించే మాట్లాడారు కానీ, ఆ నడుముకి ఇన్ని కష్టాలొస్తాయని ఎవరూ ఊహించి ఉండరు.