తమిళనాడు తీర్థయాత్రలు - కర్రానాగలక్ష్మి

 ( కాంచీపురం లోని దివ్యదేశాలు )

శ్రీ వైకుంఠ పెరుమాళ్ కోవెల

ఈ కోవెల కాంచీపురం రైల్వేస్టేషన్ కి సుమారు అరకిలోమీటర దూరంలో వుంది . ఈ మందిరం చుట్టూ రాతిగోడలు , కోవెల శిఖరం మిగతా మందిరాల వలె కాకుండా మెట్లుమెట్లుగా వుండి బౌద్దవిహారాన్ని గుర్తుచేస్తుంది . రెండు పుష్కరిణిలు , మందిరం రాతిగోడల ప్రాకారం లోపలే వున్నాయి . బయట ద్వారం నుంచి లోపలి వరకు చక్కగా పెంచుతున్న చిన్న వుద్యానవనం .

ఈ మందిరం చిన్నదే కాని యీ మందిర నిర్మాణం మన దేశంలో వున్న మందిర నిర్మాణాలకన్నా విభిన్నమైనది . ఈ మందిర నిర్మాణంలో ప్రయోగించిన శిల్పకళను ద్రవిడ శిల్ప కళలో ప్రముఖంగా చెప్పుకొనే ‘ పరమేశ్వర విన్నగారం ‘ తో నిర్మింప బడింది . ఈ మందిరం 8వ శతాబ్దానికి చెందిన పల్లవ వంశ రాజైన నరసింహవర్మ -2 చే నిర్మింపబడింది . చోళరాజులు విజయనగరరాజులు వెయ్యి స్థంబాల మంటపం మొదలయినవి కట్టించేరు .

దివ్యదేశ మందిరాలలో గర్భగుడి వెనుక గోడకు నృసింహవతార విగ్రహం వుండడం కనిపిస్తుంది . కొన్ని కట్టడాలు మహాబలిపురం మందిరాలను పోలివుండడం కనిపిస్తుంది . మందిరంలో  ధర్మరాజు , భీముడు , అర్జనుడు , కుంతి , ద్రౌపతి మొదలయిన మహాభారత పాత్రలయొక్క విగ్రహాలు కనిపిస్తాయి .

ఈ మందిరం మూడంస్థులలో కట్టబడింది . క్రింద అంతస్థులో విష్ణుమూర్తి కూర్చుని వున్న విగ్రహం మాత్రమే భక్తుల కొరకు తెరిచి వుంటుంది , మొదటి అంతస్థులో వున్న శయన విష్ణుమూర్తి దర్శనం ఒక్క వైకుంఠ ఏకాదశికి మాత్రమే భక్తులకు లభిస్తుంది . పై అంతస్తులో నిలుచొన వున్న విష్ణుమూర్తి దర్శనం నిత్యపూజలు చేసే పూజారులకు తప్ప మరెవరికీ లేదు .

పక్కగా వున్న ఉప మందిరంలో అమ్మవారు వైకుంఠవల్లిగా పూజలందుకుంటోంది .

ఈ మందిరంలో వైఖాయన ఆగమ పద్దతిలో నిత్యం ఆరుపూజలు నిర్వహిస్తున్నారు , వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు .

స్థలపురాణం —-

విదర్భ రాజైన వీరోచనుడికి పూర్వకర్మ ఫలవసాన సంతతి లేకపోవటంతో వీరోచనుడు కాంచీపురంలోని కైలాశనాథ మందిరంలో తపస్సుచేసుకోగా కైలాశనాథుడు కరుణించి వీరోచనునికి సంతతిగా విష్ణమూర్తి ద్వారపాలకులు జన్మిస్తారని వారివల్ల రాజు అఖండమైన కీర్తి పొందుతాడని శలవిస్తాడు . కొద్ది కాలానికి రాజుకి యిద్దరు మగబిడ్డల కలుగుతారు .వారికి పల్లవనుడు , విల్లలనుడు అని నామకరణం చేస్తాడు . పిల్లలు పెద్దవారైన తరువాత విష్ణుమూర్తి ప్రీతికొరకు అశ్వమేథయాగం చేస్తారు , ప్రసన్నుడైన విష్ణుమూర్తి వీరిని యీ ప్రదేశంలో కరుణించి వారిని వైకుంఠప్రాప్తిని కలుగజేస్తాడు . ఈ కథకు నిదర్శనంగా గర్భగుడికి ద్వారపాలకులుగా పల్లవనుడు , విల్లలనుడు విగ్రహాలు వుంటాయి .

ఈ మందిర దర్శనం తరువాత ప్రతీమానవడూ తెలుసుకొన వలసిన విషయం యేమిటంటే వైష్ణవం , శైవం అనే తేడాలు లేవని భగవంతుడొక్కడే అని , యీ కథలో చూడండి రాజు శివభక్తుడు సంతతి కొరకు శివుణ్ని ప్రార్ధిస్తాడు కాని అతనికి విష్ణు ద్వారపాలకులు పిల్లలుగా పుడతారని , వారు విష్ణు భక్తులు అవుతారని స్వయంగా శివుడే సెలవిస్తాడు .

8)తిరుపావలవన్నం ——-

కోవెల పేరు యేదో తమిళం లో గజిబిజిగా వుందికదా ? జాగ్రత్తగా పేరుని పరిశీలిస్తే తిరు ప్రవళ వన్నె అని తెలుస్తుంది . ప్రజల నోళ్లల్లో పడి తిరుపావలవన్నం గా మారిపోయింది . అంటే యిక్కడ విష్ణుమూర్తి ‘ ప్రవాళము ( పచ్చ , ఎమరాల్డ్ ) రంగులో వున్నాడని స్వామికి ఆ పేరు వచ్చింది  . కృతయుగంలో ప్రజలు సత్వగుణం కలవారగుటచే విష్ణుమూర్తి తెల్లనిరంగులో అంటే శ్వేతవర్ణం లో వుండేవాట , త్రేతాయుగం లో ‘ ప్రవాళం ‘ రంగు తేలికగా చెప్పాలంటే లేత పచ్చిక రంగు ( ఎమరాల్డ్ ని పోల్చుకోడానికి యీ రంగు ఒక కొలబద్ద , ముదురాకు పచ్చ రంగు వుంటే జెమ్మాలజిస్ట్లు వెంటనే ఆ రాయ ప్రవాళం కాదు అని చెప్పెస్తారు , నేనుకూడా జెమ్మాలజిస్ట్ ని లెండి , నాకు తెలిసినదిచెప్పేను ) . ద్వాపరయుగంలో విష్ణుమూర్తిరంగు ముదురాకు పచ్చగాను , కలియుగంలో నీలవర్ణంగా మారుతుందని తెలియజెప్పేరు .

కోవెల చుట్టూర రాతిగోడ , యేడంతస్తుల రాజగోపురం తో వున్న మందిరం . మందిరం ద్రవిడ శిల్పకళానిర్మితం .

ఆళ్వారుల ప్రకారం యీ మందిరం 6వ శతాబ్దం నుంచి 9 వ శతాబ్దం మధ్యలో నిర్మించినట్లుగా చెప్పబడింది . కోవెల లో వున్న శిలా శాసనాల ప్రకారం యీ మందిరం 10 శతాబ్దానికి చెందిన రాజేంద్ర చోళుడు , కొన్ని కట్టడాలు 11 వ శతాబ్దానికి చెందిన కుళోత్తుంగ చోళుడు 2 కట్టించినట్లుగా వుంది .

శాపవశాన భూలోకంలో జన్మించిన అశ్వనీదేవతలకు ప్రవాళం రంగులో యిక్కడ దర్శనమిచ్చి శాపవిమోచన చేసేడట విష్ణుమూర్తి , అంటే త్రేతాయుగంలో దర్శనమిచ్చివుంటాడని మనం ఊహించుకోవచ్చు .

ఇక్కడ అమ్మవారు ప్రవాళవల్లి గా పూజలందుకుంటోంది , స్థానిక భక్తులు పావలవల్లి అని కూడా పిలుస్తారు .

శ్రీ నీల తింగళ్ తుండథన్ పెరుమాళ్లు ——-

ఈ మందిరం ఏంకాంబరేశ్వర కోవెలలో వున్న దివ్యదేశం .ఇక్కడ స్వామిని చంద్రచూడ పెరుమాళ్ అని కూడా అంటారు . సాధారణంగా శివకోవెల పూజలు శివాచారులు , వైష్ణవ కోవెళ్లలో వైష్ణవాచార్యులు చేస్తూ వుంటారు కాని యీ కోవెల శివకోవెలలో వున్న అంతరాలయం కావడంతో యిక్క విష్ణుమూర్తికి కూడా శివాచార్యులే పూజలు చేస్తున్నారు . ఇవన్నీ తెలీని ఛాందసులు యిప్పటికీ వైష్ణవులు శివకోవెలలోకి వెళ్లరు , అలాగే శైవులు కూడా . ఇలాంటి చిన్నచిన్న సంకేతాలద్వారా భగవంతుడు ఒకడే అని ఋజువులు చూపుతున్నా మానవులు తెలుసుకోలేక పోతున్నారు .

స్థలపురాణం——

శివుని కోపానికి గురైన పార్వతి భూలోకానికి వచ్చి వేగావతీ నదీతీరాన మట్టితో శివలింగాన్ని చేసి మామిడి చెట్టుకింద ప్రతిష్టచేసి శివుని కొరకై ఘోర తపశ్సాచరిస్తుంది . పార్వతీ దేవి దీక్షకు భంగం కలిగించాలని శివుడు మామిడి చెట్టును అగ్నికి ఆహుతి చేస్తాడు . పార్వతీదేవి తన సోదరుడైన విష్ణుమూర్తిని రక్షించమని కోరగా విష్ణుమూర్తి శివుని శిరస్సు పైనున్న చంద్రున తెచ్చి అతని చల్లని కిరణాలతో ఆ మంటలను చల్లారుస్తాడు . అందుకే యిక్కడ స్వామిని నీల తింగళ్ తుండథన్ పెరుమాళ్ చంద్రుడిని తెంపి తెచ్చిన విష్ణుమూర్తి అని అర్దం . పడమరముఖంగా నిలుచొన వుంటుంది విగ్రహం . శివకోవెల గర్భగుడి ద్వారానికి యెదురుగా వుంటుందీ మందిరం . శివుడు విష్ణుమూర్తిని చూస్తున్నట్లుగా వుంటుందన్నమాట .

అమ్మవారిని ‘ నెర్ఒరువర్ యిల్ల వల్లి ‘ అని  ‘ నిలతింగళ్ తుండ తాయారు ‘ అని అంటారు .

10)తిరుపాదగమ్ —-

ఈ మందిరం కాంచీపురం రైల్వేస్టేషన్లు నుండి సుమారు 1.5 కిలోమీటర్లదూరంలో వుంది . ఇది కాంచీపురంలో వున్న మందిరాలలో అతిపురాతనమైన వాటిలో ఒకటి .

ఈ మందిరం లో విష్ణమూర్తిని ‘ శ్రీ పాండవ తూతార్ ‘ అని అంటారు . అంటే ‘ పాండవదూత ‘ స్వామి అని అర్దం .

చరిత్ర ప్రకారం యీ మందిరాన్ని 8వ శతాబ్దానికి చెందిన చోళవంశపురాజు ‘ కేసరి వర్మ ( కుళోత్తుంగ -1) ‘ నిర్మించినట్లుగా తెలుస్తోంది . నాలుగంతస్థుల రాజగోపురం . మందిరం లో వున్న మహామంటపాలు చోళ , విజయనగర రాజులచే నిర్మించబడ్డాయి . ఈ కోవెలలోని విశిష్టత యేమిటంటే యిక్కడి విగ్రహం . 25 అడుగుల యెత్తైన విష్ణుమూర్తి విగ్రహం , అర్ధపద్మాసనంలో కూర్చున్నట్లు వుంటుంది , విష్ణుమూర్తి కృష్ణావతారంలో వుండడం వల్ల రెండు భుజాలతో వుంటాడు . కుడిచెయ్య అభయముద్రలోను , యెడమచెయ్య వరద ముద్రలోని వుంటుంది . ముఖ మంటపంలో కంచు వుత్సవ విగ్రహాలతో పాటు ఆళ్వారుల విగ్రహాలు కూడా వుంటాయి . ఈ కోవెలలో ‘ అరుళాల పెరుమాళ ఎంబుర మనర్ ‘ విగ్రహం వుంటుంది . ఈ విగ్రహం మరే విష్ణుమందిరాలలోనూ వుండదుట .  ‘ అరుళాల పెరుమాళ ఎంబుర మనర్ ‘ యెవరు అంటే యితను రామానుజాచార్యల శిష్యుడు , రామానుజాచార్యుల శిశ్యరికం పొందడానికి 18 రోజులు రామానుజులతో తర్కం చేసి పొందేడట , యితను జన్మించింది కూడా యీ మందిరంలోనేనట . ప్రతీ సంవత్సరం యితనికి నివాళిగా యీ మందిరంలో వుత్సవాలు నిర్వహిస్తారు .

ఇక్కడి చరిత్ర తెలుసుకున్నాం కదా యిక స్థలపురాణం తెలుసుకుందాం .

జనమేజయ మహారాజు ఋషుల నుంచి మహాభారతం లోని కురుక్షేత్ర యుధ్దానికి ముందు పాండవులదూతగా కౌరవులతో సంధి కోసం కృష్ణుని పంపుతారు . రాజనీతి ప్రకారం దూతకు హాని చెయ్యకూడదు , అలాగే దూతలు ఆయుధాలను ధరించరాదు . కృష్ణుడు దూతగా వస్తున్నాడని తెలుసుకున్న కౌరవులు దూతకు కేటాయించిన సింహాసనము క్రింద సొరంగం తవ్వించి సింహాసనం పైన కూర్చోగానే అది సొరంగంలో కి కూలేటట్లు యేర్పాటు చేసి , ఆ సొరంగంలో వేలమంది యోధ్దులను ఆయుధాలతో కృష్ణుని సంహరించేందుకు నియమిస్తారు .  కృష్ణుడు కౌరవసభలో తన విశ్వరూపం చూపుతాడు . ఈ ఘట్టాన్ని ఋషులు వర్ణించగా జనమేజయ మహారాజుకు ఆ రూపం చూడాలనే కోరిక కలుగుతుంది . అతని కోరికని విన్న ఋషులు అశ్వమేధయాగం చేస్తే విష్ణుమూర్తి ప్రసన్నుడౌతాడని చెప్పారు . అప్పుడు జనమేజయ మహారాజు అశ్వమేధయాగం చెయ్యగా విష్ణుమూర్తి ప్రసన్నుడై రాజు కోరికమేరకు కౌరవసభలో చూపించిన విశ్వరూపాన్ని చూపిస్తాడు . జనమేజయమహారాజుకు యీ ప్రదేశంలోనే విశ్వరూప దర్శనమైందని అంటారు .ఈ మందిరంలో రుక్మిణి సత్యభామలు దేవేరులు పూజలందుకుంటున్నారు .

ఈ కోలవెలలో ‘ సుదర్శన చక్రం ‘ , అరుళాల పెరుమాళ ఎంబుర మనర్ ‘  లకు ఉప మందిరాలు వున్నాయి .

వచ్చేవరక మిగతా ‘ దివ్యదేశాల ‘ గురించి తెలుసుకుందాం అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు